మనసు పరిమళించెను తనువు పరవశించెను

21 Mar, 2019 01:49 IST|Sakshi

బంధం

‘నా కనులు నీవిగా చేసుకుని చూడు.. శిలలపై శిల్పాలు చెక్కినారు.. మన వాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు..’ అంటూ ‘మంచి మనసులు’ చిత్రంలోనాగేశ్వరరావు, అంధురాలైన తన భార్యకు హంపీ నగరాన్ని మనోనేత్రంతో ఆమె దర్శించేలా వివరిస్తాడు. జపాన్‌లో ఉన్న టొషియూకీ కూడా అదే పని చేస్తున్నారు.

టోషియూకీ, యషుకో కురోకీలు దంపతులకు 60 ఆవుల పాడి ఉంది. డెయిరీ పెట్టుకుని వ్యాపారం చేసుకుంటూ, హాయిగా జీవనం గడుపుతున్నారు. సిరిసంపదలతో తులతూగుతున్నారు. ఇంతలోనే అనుకోని సంఘటన జరిగింది. యషుకో కురోకీ మధుమేహ వ్యాధితో కంటి చూపును పోగొట్టుకుంది. ఆమె మానసికంగా కుంగిపోయింది. చనిపోవాలనుకుంది. ఇంట్లో నుంచి బయటకు రావడం మానేసింది. ఎవ్వరు పలకరించినా మాట్లాడట్లేదు. టోషియూకీకి ఏం చేయడానికీ తోచలేదు. ఒకరోజు టోషియూకీ బ్రైట్‌గా ఉన్న షిబాజకురా పువ్వులను, రంగురంగుల్లో ఉన్న ఫుచిషియా కుసుమాలను చూశాడు. అవి చూడటానికి ఎంతో అందంగా ఉన్నాయి.

అయితే వాటిని∙తన భార్య కళ్లతో చూడలేదని, వాటి నుంచి వచ్చే సుగంధాన్ని ఆస్వాదించగలదని తెలుసు. అంతే! అతనిలో ఒక ఆలోచన విరిసింది. టోషియూకీ ఆ మొక్కలను ముందుగా తన ఇంటి చుట్టూ నాటాడు. ఆ తరవాత తన పొలంలో నాటడం ప్రారంభించాడు. క్రమేపీ తన డెయిరీని పెద్ద పూలతోటగా మార్చేశాడు. పూలతోట అనగానే యషుకో కురోకీ ఇంట్లో నుంచి బయటకు రావడానికి ఆసక్తి చూపింది. ఆ పూల నుంచి వచ్చే మధురమైన పరిమళం ఆమెను బయటకు వచ్చేలా చేసింది. తోటను చూడటానికి సందర్శకులు వచ్చేవారు. వారితో మాటలు కలపడం అలవాటు చేసుకుంది. మనసులోని నిరాశను దూరం చేసుకుంది. గత ముఫ్ఫై ఏళ్లుగా ఆ పూలు వారి డెయిరీలో పూస్తూనే ఉన్నాయి. ఇప్పుడు పశుసంపద లేదు, పుష్పసంపదతో పరిమళాలు వెదజల్లుతూ విరాజిల్లుతోంది.

పూల మ్యూజియమ్‌గా మారిపోయింది! ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్‌ మాసాలలో గులాబి రంగు షిబాజకురా ముచ్చటగా విచ్చుకుంటాయి. ఈ ముచ్చటను చూడటానికి కనీసం పది వేల మంది సందర్శకులు వస్తుంటారు. ఆ పరిమళాన్ని ఆఘ్రాణించి, గులాబీరంగు దుప్పటిని చూసి మైమరచిపోతారు. ఏడు పదుల నుంచి ఎనిమిది పదులు దాటిన వృద్ధ దంపతులు సైతం ఆ తోటలో కొత్త జంటల్లా పరవశిస్తుంటారు.ఆ గులాబీ వర్ణ వనానికి వచ్చిన వారు టోషియూకీ, యషుకో కురోకీ దంపతుల ఫొటోలు తీసుకోవడంతో పాటు, వారితో కలిసి మరీ ఫొటోలు తీయించుకుంటున్నారు. ఇలా యషుకో కురో కోసం  టోషియూకీ అందమైన నందనవనాన్ని నిర్మించి, భార్యమీద తనకున్న అనురాగాన్ని, అభిమానాన్ని, ఆప్యాయతను పరిమళింపజేసుకుంటున్నాడు.
 
వైజయంతి


 

మరిన్ని వార్తలు