రెండు సంప్రదాయాల జోడి... నిండు హృదయాల సవ్వడి

24 Dec, 2013 23:08 IST|Sakshi

నవ్వుల హాసిని ‘జెనీలియా, బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ కిందటేడాది ఫిబ్రవరి 3న దంపతులయ్యారు. ఇద్దరి మతాలు వేరు. కుటుంబ నేపథ్యాలు వేరు. దీంతో మొదట ఇరువైపు పెద్దలు ససేమిరా అన్నారు. అయినా ఎవరినీ నొప్పించకుండా ఒప్పించి ఒక్కటైన ఈ జంట విశేషాలే ఈ మనసే జతగా!
 
 ప్రేమికులుగా ఉన్నప్పుడు కులాలు, మతాలు అడ్డు రావు. కాని పెళ్లి అనగానే ఎవరి సంప్రదాయాలు వారికి గుర్తుకు వస్తాయి. పెద్దలు ఒప్పుకుంటారో లేదో అని కొంతమంది చెప్పాపెట్టకుండా వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటారు. మరికొందరు తమ ప్రేమను తమలోనే దాచుకుని కుమిలిపోతుంటారు. కొందరు మాత్రమే ధైర్యంగా పెద్దలకు తెలియజేసి, వారిని ఒప్పించి మరీ జంటకడతారు.

ఈ వరసలోనే చేరుతారు 26 ఏళ్ల జెనీలియా డి  సౌజా, 35 ఏళ్ల రితేష్ దేశ్‌ముఖ్‌లు. రితేష్ సినిమాల్లోకి రాకముందు ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనర్. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ ్జకుమారుడు. అప్పటికి జెనీలియా మోడల్! రితేష్ 2003లో తుఝే మేరీ కసమ్ సినిమాలో నటించడానికి ఓకే చేశారు. కో స్టార్ జెనీలియా! ఇద్దరికీ అది మొదటి సినిమా. ఆ సినిమాతో ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఆ సినిమా ఫ్లాప్ అయినా వీరి అనుబంధం మాత్రం పెద్ద హిట్ అయ్యింది అని అంతా అనుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ ఎవరికి వారు కెరియర్‌లో బిజీగా ఉంటూనే తమ మధ్య ఆత్మీయతను పెంచుకున్నారు.
 
అనుబంధానికే ప్రాముఖ్యం

జెనీలియా: రితేష్‌తో ఉంటే గంటలు నిమిషాల్లా గడిచిపోతాయి. మా మధ్య ప్రేమ చిగురించిందని తెలిశాక ఇరువైపు కుటుంబాల వారికి చెప్పాం. అయితే రితేష్ నాన్నగారు మా పెళ్లికి ఒప్పుకోలేదు. దాంతో ఎనిమిదేళ్లపాటు వారి అనుమతి కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో రితేష్ చాలా కష్టపడ్డారు. మా మధ్య బంధం మొదలైన నాటి నుంచి వారి ఇంట్లో చెబుతూనే ఉండేవారు. నేనూ అంతే! అమ్మనాన్నలకు అన్ని విషయాలు తెలియజేస్తూ ఉండేదాన్ని. మా మధ్య దీర్ఘకాలంగా కొనసాగిన ప్రేమను అర్థం చేసుకున్న పెద్దలు పెళ్లికి ఓకే చేశారు. అంతే!

మా ఆనందానికి హద్దుల్లేవు. అయితే ఇరువైపులవారికి నచ్చినట్టుగా రెండు మతాల పద్ధతుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అలా మా ఇంట్లో వారికి నచ్చినట్టుగా చర్చిలోనూ, రితేష్ ఇంట్లో వారికి నచ్చినట్టుగా మహారాష్ట్ర సంప్రదాయ పద్ధతిలోనూ మా పెళ్లి అయ్యింది. రితేష్ పెద్ద అన్నయ్య టీవీ నటి అదితి ప్రతాప్‌ను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత అదితి నటనకు ఫుల్‌స్టాప్ పెట్టేసింది. దాంతో నేనూ అలాగే నా నటనకు స్వస్తి చెబుతానని చాలా మంది అనుకున్నారు. కాని రితేష్ మాత్రం ఆ నిర్ణయం నాకే వదిలేశారు. అందుకే ఇంకా సినిమాల్లో నటిస్తున్నాను.

నేను రితేష్ కలిసి గుళ్లు, గోపురాలు సందర్శిస్తుంటాం. అలాగే చర్చ్‌కీ వెళుతుంటాం. మా పెళ్లయిన కొద్దిరోజులకే ముంబైలో మంచి ఫ్లాట్ కొనుక్కున్నాం. మేం ఇప్పుడు ఉంటున్న ఫ్లాట్‌ను దగ్గర ఉండి డిజైన్ చేయించారు రితేష్! దేవుడికి నేను చాలా ఇష్టమైన బిడ్డను అని నమ్ముతాను. అందుకే నా జీవితం ఇంత బాగుంది. నాకే చిన్న సమస్య వచ్చినా దేవుడితోనే ముందు చెప్పుకుంటాను...’ అంటూ చిరునవ్వులు చిందిస్తూ, ఎంతో సంబరంగా చెబుతారు ఆమె!
 
విలువ తెలిపిన బంధం


రితేష్: మా పెద్దలు పెళ్లికి ఒప్పుకోనప్పుడు జీవితాంతం స్నేహితులుగానే ఉందామని చెప్పింది జెనీలియా! పెద్దల పట్ల గౌరవం, సంప్రదాయాల పట్ల మన్నన ఉన్న వ్యక్తి తను. ఆమె నా జీవితంలోకి వచ్చాకే జీవితం విలువ అంటే ఏంటో తెలిసింది. ప్రేమ, పని రెండూ తనతో పాటే నడుస్తూ నన్ను వ్యక్తిగా నిలబెట్టాయి. నా పుట్టినరోజు కూడా కిందటి వారమే (డిసెంబర్ 17). క్రిస్ట్‌మస్ కూడా ఈ నెలలోనే! దీంతో మా ఇంట రెండు పండుగల సందడి ఉంటుంది. అంధేరిలోని సెయింట్ క్యాథరీన్ హోమ్ బాలల మధ్య కిందటేడాది క్రిస్ట్‌మస్ వేడుకలు జరుపుకోవడం మరిచిపోలేని అనుభూతి’ అంటూ ఆనందంగా వివరిస్తారు రితేష్!

ఇద్దరూ సెలబ్రిటీలు. కాంట్రవర్సీ కామన్! సమస్యలూ సహజమే! అయినా ప్రేమను కాపాడుకోవడానికి పెద్దలను ఒప్పించిన ఈ జంటకు అవన్నీ దూదిపింజెల్లాంటివే!
 
 పెళ్లయ్యాక నా నటనకు ఫుల్‌స్టాప్ పడుతుంది అన్నారంతా! కానీ రితేష్ మాత్రం ఆ నిర్ణయాన్ని నాకే వదిలేశారు.
 - జెనీలియా
 
 జెనీలియా నా జీవితంలో కి వచ్చాకే జీవితం విలువ అంటే ఏంటో తెలిసింది. ప్రేమ, పని రెండూ తనతో పాటే నడుస్తూ నన్ను వ్యక్తిగా నిలబెట్టాయి.
 - రితేష్
 

మరిన్ని వార్తలు