పిలవని పెళ్లికి వెళ్లొద్దాం

6 Nov, 2019 03:35 IST|Sakshi

జాయిన్‌ మై వెడ్డింగ్‌

ఒక దేశ సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకోవాలనుకుంటే పండుగలు, వివాహాలకు మించిన వేడుకలేముంటాయి? అదీగాక సంప్రదాయబద్ధంగా, వైభవోపేతంగా జరిగే భారతీయ పెళ్లి సందడంటే పాశ్చాత్యులకు మోజు. ఆ క్రేజ్‌ను గమనించే ‘జాయిన్‌ మై వెడ్డింగ్‌ డాట్‌ కామ్‌’ అనే ఆస్ట్రేలియన్‌ సైట్‌ వెలిసింది! తమ పెళ్లికి విదేశీ అతిథులను ఆహ్వానించదలిచిన వధూవరులు ఈ వెబ్‌సైట్‌లో తమ పేరు, పెళ్లి సంబరం తాలూకు వివరాలను పొందుపర్చాలి. భారతదేశ పర్యటనలో  భాగంగా ఇక్కడి పెళ్లిళ్లను చూడాలనే ఆసక్తిగల విదేశీయులు ఈ వెబ్‌సైట్‌ లాగిన్‌ అయి ఏ సంప్రదాయపు పెళ్లి.. అంటే ఉత్తర, దక్షిణ, ఈశాన్య భారతీయ పెళ్లిళ్లలో ఏ వివాహతంతును చూడాలనుకుంటే అక్కడున్న వధూవరులు సైట్‌కి ఇచ్చిన పెళ్లి వివరాల ప్రకారం ఆ పెళ్లికి హాజరుకావచ్చు.ఆ పెళ్లికి సంబంధించిన టికెట్లను కొనుక్కోవాలి.

ఆ టికెట్‌ డబ్బులో కొంత శాతాన్ని సైట్‌ వాళ్లు కమీషన్‌గా తీసుకొని మిగిలిన డబ్బును ఆ జంటకు ఇచ్చేస్తారు. పసుపు దంచే కార్యక్రమం నుంచి మెహందీ, సంగీత్, పెళ్లి, రిసెప్షన్‌ దాకా అన్నిట్లో ముందువరుసలో ఉండి ఆలకిస్తారు ఆ విదేశీ అతిథులు. ఇంట్రెస్ట్‌ ఉంటే ఆయా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు కూడా.  మన సంప్రదాయపు దుస్తులు ధరించొచ్చు. విందును ఆస్వాదించవచ్చు. ఆత్మీయ అతిథిౖయె పెళ్లి సంబరంలో పాలుపంచుకోవచ్చు. జాయిన్‌ మై వెడ్డింగ్‌ డాట్‌ కామ్‌ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే మీ పెళ్లికి విదేశీయులకు టికెట్లు అమ్మడం. యేటా కొన్ని లక్షల పెళ్లిళ్లు ఆర్భాటంగా జరుగుతుంటాయి కాబట్టి ఈ తరహా వివాహ పర్యటనలకు విదేశీ అతిథుల డిమాండ్‌ చాలానే ఉంటోందట.

ఒక్క పర్యటనలో దాదాపు అయిదారు పెళిళ్లకు హాజరైన అతిథులూ ఉన్నారట. ఈ వెడ్డింగ్‌ టూరిజంలో ఇప్పటిదాకా దాదాపు  వంద పెళ్లిళ్లకు హాజరయ్యారట విదేశీ అతిథులు. మరో సంగతేంటంటే ఇలా పెళ్లికి విదేశీయుల నుంచి వచ్చిన టికెట్‌ డబ్బులతో కొత్త జంటలు ఎంచక్కా తమ హనీమూన్‌ను ప్లాన్‌ చేసుకుంటున్నాయట. అంటే ఉచితంగా హనీమూన్‌ డెస్టినేషన్‌కు చేరుకుంటున్నారన్నమాట. కొత్త ప్రాంతాల నుంచి ఫ్రెండ్స్‌ అవడానికి ఇంతకన్నా గొప్ప వేడుక ఏముంటుంది అని అటు ఫారిన్‌ గెస్ట్‌లు, ఇటు వధూవరులూ  అంటున్నారు. ఈ పెళ్లిళ్లను చూడ్డానికి అమెరికా, ఐర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఆస్ట్రియా అండ్‌ అఫ్‌కోర్స్‌ ఆస్ట్రేలియా నుంచి యమ డిమాండ్‌ ఉంటోందట.  కార్తీకమాసం పెళ్లిళ్ల సీజనే.. ఆలస్యమెందుకు.. ఆన్‌లైన్‌లో టికెట్స్‌కు శుభస్య శీఘ్రం!! అన్నట్లు.. మనం విదేశీయుల పెళ్లిళ్లకు వెళ్లాలన్నా.. ఇదే రూటు. ఇదే సైటు. టికెట్‌ కొనుక్కుని వెళ్లిపోవచ్చు.

మరిన్ని వార్తలు