కోవిడ్‌–19 లవ్‌స్టోరీ

17 Apr, 2020 02:11 IST|Sakshi
రోహ్‌తక్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ కోర్టులో జొహేరి, నిరంజన్‌.

అబ్బాయి నల్లగా ఉన్నాడు. అమ్మాయి తెల్లగా ఉంది. ప్రేమకు నలుపూ తెలుపుల భాష తెలీదు. అబ్బాయిది.. ఈ తూరుపు. అమ్మాయిది.. ఆ పడమర. ప్రేమకు దిక్కూమొక్కుల భాష తెలీదు. కళ్లు పలికే భావాలే ప్రేమకు తెలిసిన భాష. లాంగ్వేజ్‌ లెర్నింగ్‌ యాప్‌లో పరిచయం. లాక్‌డౌన్‌లో స్పెషల్‌ పర్మిషన్‌తో పరిణయం.  కోవిడ్‌–19 లవ్‌స్టోరీ ఇది. 

నిరంజన్‌ కశ్యప్‌ లోకల్‌. హర్యానాలోని రోహ్‌తక్‌ లో సూర్యాకాలనీలో ఉంటాడు. నాలుగు భాషలు నేర్చుకుంటే లైఫ్‌ ఉంటుందని ‘లాంగ్వేజ్‌ లెర్నింగ్‌ యాప్‌’ని డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. ఇప్పుడు కాదు. మూడేళ్ల క్రితం. ‘మగధీర’ సినిమాలో కాలభైరవుడికి కాజల్‌ అగర్వాల్‌ కనెక్ట్‌ అయినట్లు.. నిరంజన్‌కి ఓ మెక్సికో అమ్మాయి లిపిలేని కంటి భాషతో టచ్‌ అయింది. అందమైన అమ్మాయి. అందమైన పేరు. డానా జొహేరి ఆలివెరోస్‌ క్రూయిజీ. అబ్బాయి అమ్మాయంత తెల్లగా లేకున్నా కళగా ఉన్నాడు. అమ్మాయి అన్ని విధాలుగా పైనున్నా.. అబ్బాయి భుజాల వరకు రావడమే తన గొప్ప అనుకుంది. నేర్చుకునే భాషలేవో యాప్‌లో నేర్చుకుంటూనే.. ఒకరినొకరు చెంతకు చేర్చుకున్నారు. 2017లో నిరంజన్‌ బర్త్‌డే కి మెక్సికో నుంచి ఇండియా వచ్చింది జొహేరి.

‘ఫ్రెండ్‌’ అని చెప్పాడు నిరంజన్‌ ఇంట్లో. ‘కోడలైతే బాగుండు’ అనుకున్నారు నిరంజన్‌ వాళ్ల అమ్మ. అన్నయ్యను డౌట్‌గా చూశాడు నిరంజన్‌ తమ్ముడు. నిరంజన్‌ తండ్రి పెద్దగా పట్టించుకోలేదు. మళ్లీ సంవత్సరం కూడా ఇండియా వచ్చింది జొహేరి. ఈసారి మాత్రం ‘నీ కోడలు’ అన్నాడు నిరంజన్‌.. తల్లితో. ఆమె ముఖం వెలిగిపోయింది. ఊరికే అన్నాడు అనుకుంది కానీ, ‘నాకు నువ్వు.. నీకు నేను’ అని వాళ్లకై వాళ్లు నిశ్చితార్థం చేసేసుకున్నారని ఆమె ఊహించలేదు. తర్వాత రెండేళ్ల వరకు జొహేరీకి ఇండియా రావడం కుదర్లేదు. మన లోకల్‌ ఒక్కసారీ మెక్సికో వెళ్లలేదు. వాళ్ల ప్రేమ మాత్రం ఆన్‌లైన్‌లో రానూపోనూ టిక్కెట్‌ లెస్‌ ట్రావెల్‌ చేస్తూనే ఉంది. 

నిరంజన్‌ తల్లి, నిరంజన్, జొహేరి, జొహేరి తల్లి  

కోడల్ని నిరంజన్‌ తల్లి చూసింది. అల్లుణ్ణి జొహేరీ తల్లి చూడొద్దా! ఈ ఏడాది ఫిబ్రవరిలో తల్లీకూతుళ్లు ఇండియా వచ్చారు. నిరంజన్‌ వాళ్లింట్లోనే ఉన్నారు. జొహేరీ తల్లి కూడా జొహేరీలా చలాకీగా, ఆమెకు సోదరిలా ఉండటం నిరంజన్‌ తల్లిని ఆశ్చర్యపరించింది. ఎంతైనా ఫారిన్‌ వాళ్లు! పెళ్లికి ఏర్పాట్లు మొదలయ్యాయి. అవి చట్టం చేయవలసిన ఏర్పాట్లు. భారతీయులు విదేశీయులను పెళ్లి చేసుకోవాలంటే.. ‘స్పెషల్‌ మ్యారేజ్‌ యాక్ట్‌ 1954’ కింద ముప్పై రోజుల ముందు నోటీస్‌ ఇవ్వాలి. పెళ్లికి దరఖాస్తు చేసుకోవడం అది. ఫిబ్రవరి 17న సబ్‌ డివిజినల్‌ మేజిస్ట్రేట్‌కి విజ్ఞప్తిని పంపారు. మార్చి 18కి గడువు ముగిసింది. కానీ అప్పటికే రోహ్‌తక్‌లో లాక్‌డౌన్‌ ఛాయలు మొదలయ్యాయి.

పెళ్లయిపోయాక, ఒకసారి మెక్సికో వెళ్లి వచ్చేందుకు అంతకుముందే ఫ్లయిట్‌ టికెట్‌ బుక్‌ చేసుకుంది జొహేరీ. ఆ ప్రయాణమూ ఆగిపోయింది. ప్రయాణం మన చేతుల్లో లేదు. పెళ్లి మనదే కదా అనుకున్నారు. జిల్లా మేజిస్ట్రేట్‌ని కలిశారు. ఇండియాలోని మెక్సికన్‌ ఎంబసీ ఓకే చెప్పందే వీళ్లు ఒకటయేందుకు లేదు. అక్కడి నుంచి మేజిస్ట్రేట్‌ చేతుల్లోకి ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ రావడానికి రెండు వారాలకు పైగా టైమ్‌ పట్టింది. ఏప్రిల్‌ 13 కి అన్నీ క్లియర్‌ అయ్యాయి. ఆ రోజు రోహ్‌తక్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ కోర్టు క్లర్కులు, ఇతర సిబ్బంది లాక్‌డౌన్‌లో కోర్టుకు చేరుకునేసరికి రాత్రి ఎనిమిది దాటింది. నిరంజన్, జొహేరీ దండలు మార్చుకున్నారు. మే 3 వరకు ఈ కొత్త జంటకు రోహ్‌తకే స్వర్గధామం. తర్వాత ఇద్దరూ కలిసి మెక్సికో వెళ్తారేమో తెలియదు.

మరిన్ని వార్తలు