ఆత్మరక్షణకే అయినా...

5 Nov, 2013 00:02 IST|Sakshi
ఆత్మరక్షణకే అయినా...

సుమారు రెండేళ్ల క్రితం... ఆదిలాబాద్ జిల్లాలో గంగాభవాని అనే టీచర్ మీద క్లాస్‌రూమ్‌లోనే దాడి జరిగింది. ఆ దాడిలో ఆమె ప్రాణాలు పోయాయి. దాడికి పాల్పడింది ఒక ప్రేమోన్మాది. గ్రామస్థులు ఆ ఉన్మాదిని కొట్టి చంపేశారు. ఇది ధర్మాగ్రహమే అయినా వారి మీద కేసు నమోదైంది. అలాగే మహబూబ్‌నగర్ చిన్న చింతకుంటలో బహిర్భూమికి వెళ్లిన మహిళపై అత్యాచారం చేశాడు సీఐ.

గ్రామస్థులు ఆ సీఐని కొట్టి చంపేశారు. ఖమ్మంలో మరో మహిళ తన మీద అత్యాచారం జరగకుండా అడ్డుకోగలిగింది. ఆ తర్వాత ఊరందరి సహకారంతో ఆగంతకుడి మీద ఎదురుదాడి చేసింది. ఈ విధమైన సందర్భాలలో ఆత్మరక్షణలో భాగంగా హత్య, తిరుగుబాటులో భాగంగా హత్య, ప్రతిఘటనలో భాగంగా హతమార్చడం... ఈ మూడు కోణాల్లో కేసును పరిశీలించి తీర్పు ఇస్తుంది న్యాయస్థానం.

ఇలాంటి కేసుల విషయంలో ఆ మహిళలకు న్యాయం జరిగే వరకు, కేసును పక్కదారి పట్టనివ్వకుండా సంధ్య వంటి సామాజిక ఉద్యమకారులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. అయినా మహిళల మీద లైంగికదాడులు ఆగకపోగా పెరిగిపోతున్నాయి. ఈ దాడులను అడ్డుకోవాలంటే ఆత్మరక్షణ ఒక్కటే మార్గం. అయితే మహిళ ఆత్మరక్షణలో భాగంగా చేసిన దాడిలో అత్యాచారయత్నానికి పాల్పడినవాడి ప్రాణాలు పోతే!.. ఆ మహిళ న్యాయస్థానంలో విచారణను ఎదుర్కోవలసిందేనా? ఆ మహిళకు శిక్ష తప్పదా?
 
ఈ సందేహాలకు చాలా సందర్భాలలో అవుననే సమాధానం అంటారు న్యాయవాది నిశ్చలసిద్ధారెడ్డి. స్త్రీ తనను తాను రక్షించుకునే క్రమంలో హత్య జరిగిన సందర్భంలో... రేప్ జరిగిన తర్వాత హత్య జరిగితే ఐపిసి 376, 302 అనే రెండు సెక్షన్ల కింద బాధితురాలిపైనే కేసు నమోదవుతుంది. దీనితోపాటు కేసులో తీర్పు రావడానికి కనీసం రెండు-మూడేళ్లు పడుతుంటుంది. ఇలాంటి కేసుల్లో నిర్భయ కేసులో వచ్చినట్లు త్వరితగతిన విచారణ పూర్తి చేసి తీర్పు చెప్పడం చాలా అవసరం.

అంతకంటే ముఖ్యంగా తాను చేసిన హత్య ఆత్మరక్షణ కోసమే అని బాధితురాలు నిరూపించుకోవడం చాలా అవసరం. కోర్టులో ప్రతివాది తరఫు న్యాయవాదుల (పురుష న్యాయవాదులు) ప్రశ్నలు చాలా ఇబ్బందికరంగా, మహిళ అవమానపడే విధంగా ఉంటాయి. వీటికి భయపడి చాలామంది కేసును మధ్యలోనే ఉపసంహరించుకుంటుంటారు. ఇలాంటి కేసులను మహిళా న్యాయవాదులే విచారించాలనే చట్టం ఇంతవరకు లేదు. అలాంటి చట్టం వస్తే బావుంటుంది.
 
అసలు అత్యాచారం, హత్యకేసును నమోదు చేయడంలోనే లోపాలు జరిగిపోతుంటాయి. కేసును నీరుకార్చే విధంగా నమోదయితే ఆ కేసులో సదరు మహిళ చేసిన హత్య ఆత్మరక్షణకోసమే అని నిరూపించడం కష్టం. హత్యకు గురైన వ్యక్తితో తనకు ఎటువంటి వ్యక్తిగత ద్వేషాలు లేవని కూడా నిరూపించుకోవాలి. ఇలాంటి కేసు నమోదు ప్రక్రియ(ఎఫ్‌ఐఆర్) మహిళా పోలీసుల చేతిలో జరగాలి.

పోలీసు ఉన్నది ఉన్నట్లుగా నమోదు చేసే నిష్పక్షపాతి అయి ఉండాలి. ఇక శిక్ష విషయానికి వస్తే... ఇలాంటి కేసుల్లో మహిళకు విధించే శిక్షలు మరీ అంత కఠినంగా ఉండవు. అయితే తనకు చట్టాన్ని చేతిలోకి తీసుకునే ఉద్దేశం లేదని న్యాయస్థానానికి విధేయతతో తెలియపరచడం చాలా అవసరం. ఇంకా ముఖ్యంగా తనను కాపాడుకోవడానికి చూపించిన తెగువనే చివరి వరకు కొనసాగించాలి. తీర్పు వచ్చే వరకు అదొక యజ్ఞంలా భావించి న్యాయంకోసం పోరాడాలి.

 - వాకా మంజులారెడ్డి
 

మరిన్ని వార్తలు