దృశ్యం

22 Oct, 2017 01:52 IST|Sakshi

రాత్రి పదకొండు సన్నగా వానజల్లు పడుతోంది. రోడ్డు మీద ట్రాఫిక్‌ లేదు. అప్పుడొక కారు, స్కూటరో, బైకో వెళ్తున్నాయి. వెహికల్స్‌ వెళ్తున్నప్పుడు హెడ్‌లైట్స్‌ వెలుతురు రోడ్డు మీదకు ప్రసరిస్తుంటే, తారు రోడ్డు నిగనిగ మెరుస్తోంది. వేగంగా వస్తున్న స్కూటీకి ఎదురుగా రాంగ్‌సైడ్‌లో వెళ్తోంది ఖరీదైన కారు. స్కూటీ నడుపుతున్న యువతి ప్రమాదం శంకించి స్పీడ్‌ తగ్గించి రోడ్డుకి బాగా లెఫ్ట్‌సైడ్‌కి వెళ్లింది. అయినా కారు స్కూటీని ఢీ కొంది. కావాలనే డాష్‌ యిచ్చినట్టు అర్థమైంది.స్కూటీ పక్కకి ఒరిగిపోయింది. ఆమె నేల మీదకు జారింది. కారు దిగిన ఇద్దరు ఆమెను ఒడిసి పట్టుకుని కారులోకి లాక్కెళ్లి డోర్‌ మూశారు. ఆమె అరుపులు గాలి హోరులో వాన చినుకుల చప్పుడులో కలిసి పోయాయి.   అది మూడు నిమిషాలు రన్‌ అయిన దృశ్యం. టి.వి. చానల్లో పదేపదే చూపిస్తున్నారు. కారు నెంబరు స్పష్టంగా కనిపిస్తోంది.

యాంకర్‌ వ్యాఖ్యానిస్తోంది.‘‘ఆమె ఎవరు? ఎక్కడ్నుంచి వస్తోంది ఆ రాత్రివేళ? ఆ కారు ఎవరిది? మనం చూస్తున్నాం. స్కూటీని కావాలని డాష్‌ కొట్టింది కారు. స్కూటీ నడుపుతున్న యువతి హెల్మెట్‌ పెట్టుకున్నందు వలన ముఖం కనిపించడం లేదు. రాంగ్‌సైడ్‌లో వస్తున్న కారుని ఆమె గమనించి ఎడమవైపుకి వెళ్లింది. అయినా కారు కావాలని రాంగ్‌సైడ్‌లోకి వెళ్లి ఎదురుగా వస్తున్న స్కూటీకి డాష్‌ ఇచ్చింది.’’తర్వాత ప్రమాదం జరిగిన ప్రదేశానికి పోలీస్‌ పెట్రోలింగ్‌ వ్యాన్‌ వచ్చింది. పోలీసులు దిగి అక్కడంతా ఆధారాల కోసం గాలిస్తున్నారు.మర్నాడు ఉదయం వార్తలు టెలికాస్ట్‌ అవుతున్న సమయానికి కేసులో పురోగతి కనిపించింది. ఆ కారు విక్రమ్‌ పేరుతో రిజిస్టర్‌ అయివున్నట్టు ఆర్‌టీఏ వాళ్లు తెలియజేశారు. బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ అడ్రస్‌ ఉంది. విక్రమ్‌ మాజీ ఎమ్మెల్యే కొడుకు అని తేలింది.

 కెమెరాకు చిక్కిన బెంజికారు ఔటర్‌ రింగ్‌రోడ్డులో రోడ్డు పక్కన ఆగి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.ఆ రోజు ఉదయమే మాదాపూర్‌లోని బాలికల వసతి గృహం ‘లిటిల్‌ ఏంజెల్స్‌’ నిర్వాహకురాలు మార్గరెట్‌ మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌కి వచ్చింది. తమ హాస్టల్లో ఉంటున్న సునీత రాత్రి రాలేదనీ, ఒక పెళ్లికి అటెండై లేటుగా వస్తానని ఫోన్‌ చేసిందని రిపోర్టు చేసింది. సునీత సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తోందని ఫొటో అందజేసింది. రాత్రి బెంజికారుతో డాష్‌ ఇచ్చి దుండగులు కిడ్నాప్‌ చేసిన యువతి సునీతే కావొచ్చని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సునీత ఫొటోలు అన్ని పోలీస్‌ స్టేషన్లకూ మెయిల్‌ చేశారు.ఇన్‌స్పెక్టర్‌ అశ్విన్, ఎస్సై నాగరాజు మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే చనిపోయినా ఆ క్వార్టర్‌ ఖాళీ చేయకుండా అందులో ఆయన చిన్నకొడుకు విక్రమ్‌ ఉంటున్నాడు.పోలీసుల్ని చూడగానే విక్రమ్‌ ఆశ్చర్యం ప్రకటించాడు.

‘‘సార్‌! నా కారు దొరికిందా? థ్యాంక్‌ గాడ్‌!’’‘‘కారు దొరకడం ఏంటి?’’‘‘రాత్రి పన్నెండింటికి నా బెంజికారు ఎవరో దొంగిలించారు. గచ్చిబౌలిలోని జాగ్వర్‌ ఫాంహౌస్‌లో పార్టీ జరిగింది. లోపల పార్కింగ్‌ లేకపోవడంతో బైట పార్క్‌ చేశాడు మా డ్రైవర్‌ అన్వర్‌. పదకొండుకు ఇక బయల్దేరదామన్కుంటూ ఉండగా అన్వర్‌ వచ్చి బైట పార్క్‌ చేసిన కారు కనిపించడం లేదన్నాడు. మరొక ఫ్రెండ్‌ కారులో ఇంటికి వచ్చాను. కారు పోయిందని స్టేషన్‌లో కంప్లైంట్‌ ఇచ్చాను. మీరెందుకు వచ్చారు? కారు గురించి డిటెయిల్స్‌ ఏమైనా కావాలా?’’ఇన్‌స్పెక్టర్, ఎస్సై ఒకరి మొహం మరొకరు చూసుకున్నారు. విక్రమ్‌ తెలివిగా ఎదురుదాడికి దిగాడని అర్థమైంది.‘‘ఔను. కొన్ని డిటెయిల్స్‌ కావాలి. మీరొకసారి స్టేషన్‌కొచ్చి ఏసీపీ వాసుదేవ్‌ గారిని కలుసుకుంటే అంతా చక్కబడుతుంది. మీ కారు మీరు హ్యాండోవర్‌ చేసుకోవచ్చు. బైదబై మీ డ్రైవర్‌ని కూడా తీసుకురండి’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్‌.

‘‘డ్రైవర్‌ ఎందుకు? నాకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉంది’’ అన్నాడు విక్రమ్‌.‘‘డ్రైవర్‌ దగ్గర స్టేట్‌మెంట్‌ తీసుకోవాల్సి ఉంటుంది’’‘‘ఆల్‌ రైట్‌.. పదండి’’ అన్నాడు విక్రమ్‌ ధీమాగా.విక్రమ్‌ వెంట అన్వర్‌ కూడా పోలీసుల వెంట బయల్దేరాడు. లోగడ ఇటువంటి కేసుల్లో తండ్రి అధికారం, ధనమదంతో బైటపడిన అనుభవం విక్రమ్‌ది. అందుకే అతను భయపడలేదు. ఏసీపీ ముందు కూర్చున్న తర్వాత గానీ విక్రమ్‌కి తాను దొరికిపోయానని అర్థం కాలేదు.‘‘మిస్టర్‌ విక్రమ్‌! మీ ఆధార్‌ కార్డ్, స్టేట్‌బ్యాంక్‌ డెబిట్‌ కార్డ్‌ ఎక్కడ?’’విక్రమ్‌ జేబులు తడుముకున్నాడు. షర్టు జేబులో గాని, ప్యాంట్‌ జేబులో గాని పర్సు లేదు. కంగారుపడుతూ పదిసార్లు వెతికి తెల్లముఖం వేశాడు.

‘‘ఇంట్లో ఉండొచ్చు సార్‌! వెళ్లి పంపిస్తాను అవసరమైతే’’ అన్నాడు వణుకుతున్న గొంతుతో.‘‘ఇంట్లో ఉండవు విక్రమ్‌. నా దగ్గరున్నాయి. రాత్రి తాగిన మైకంలో సునీత స్కూటీకి డాష్‌ కొట్టావు ఉద్దేశపూర్వకంగా. నువ్వూ, నీ డ్రైవర్‌ కిందపడిన సునీతను లాక్కెళ్లి కారులోకి ఎక్కించారు. ఆ పెనుగులాటలో నీ షర్ట్‌ జేబులో ఉన్న పర్స్‌ కింద పడిందని గమనించలేక పోయావు. ఆ సీన్‌ అంతా ఒక జర్నలిస్ట్‌ షూట్‌ చేశాడు. నిన్నెవరూ రక్షించలేరు. ఇప్పుడు మీ నాన్న కూడా బతికిలేడు రాజకీయంగా ఒత్తిడి తెచ్చి విడిపించడానికి’’

ఏసీపీ మాటలకు వణికిపోయాడు విక్రమ్‌. చెమటతో ఒళ్లంతా తడిసింది.‘‘చెప్పు! సునీతను ఏం చేశావు?’’ గద్దించాడు ఏసీపీ వాసుదేవ్‌. పోలీసులు తమశైలిలో విచారించేసరికి ముందు అన్వర్‌ బైట పడిపోయాడు. విక్రమ్‌ నేరం ఒప్పుకోక తప్పలేదు.జాగ్వర్‌ ఫాంహౌస్‌ విక్రమ్‌ విలాసకేంద్రం. కిడ్నాప్‌ చేసిన సునీతను అక్కడే రేప్‌ చేసి మర్డర్‌ చేశాడు. శవం ఫాంహౌస్‌లోనే చెట్ల మధ్యలో గొయ్యి తీసి పాతిపెట్టాడు. సునీతను రేప్‌ చేసి మర్డర్‌ చేసినట్టు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో ఆధారాలు, పోస్ట్‌మార్టమ్‌ రిపోర్టు ధ్రువపరిచాయి. విక్రమ్‌కి, అన్వర్‌కి జైలు శిక్ష తప్పదని తేలింది. ఉరి శిక్ష కూడా పడొచ్చు.
∙∙
అనుకోకుండా ఆ రాత్రి సునీత కిడ్నాప్‌ సీన్‌ షూట్‌ చేశాడు జర్నలిస్ట్‌ నవీన్‌. హైస్పీడ్‌లో వస్తున్న బెంజికారు గమనించి తాను నడుపుతున్న బైక్‌ ఆపాడు. సునీత కిడ్నాప్‌ సీన్‌ షూట్‌ చేసి పోలీసులకు, తమ టీవీ చానల్‌కు ఫార్వార్డ్‌ చేశాడు. అదే విక్రమ్‌ పాలిట శాపమైంది. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోబట్టి విక్రమ్‌ పర్స్‌ స్పాట్‌లో దొరికింది. లేకపోతే అది ఎవరికో దొరికితే అందులో డబ్బు తీసుకొని అవతల పారేసేవాళ్లు.ఒక కిడ్నాప్‌ వెలుగులోకి తెచ్చి దుండగులకు శిక్షపడేట్టు చేసిన నవీన్‌ని తోటి జర్నలిస్టులు అభినందించి పొగడ్తలతో ముంచెత్తారు.అదే ఇప్పుడు నవీన్‌కి ప్రాబ్లమైంది.

‘‘నవీన్‌! కిడ్నాప్‌ సీన్‌ నువ్వే షూట్‌ చేసి పోలీసులకు, చానల్‌కు పంపావని అందరికీ తెలిసిపోయింది. విక్రమ్‌ అన్న హర్ష నీ మీద పగతీర్చుకోకమానడు. నువ్వు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి’’ హెచ్చరించాడు క్రియేటివ్‌ హెడ్‌ రాజన్‌.‘‘సార్‌! మనల్ని ఎవరైనా చంపదల్చుకుంటే, ఏదోక రోజు చంపుతారు. ఈ వృత్తిలో ప్రమాదం ఉందని నాకు తెలుసు. అయినా జాబ్‌ శాటిస్‌ఫేక్షన్‌ ముఖ్యం. ఐ డోంట్‌ కేర్‌’’ అన్నాడు నవీన్‌ దృఢంగా.‘‘ధైర్యంగా ఉండడం మంచిదే. అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. నువ్వు బైక్‌ మీద రావడం మానెయ్‌. నువ్వు ఇంటి నుంచి ఆఫీసుకి రావడానికి, మళ్లీ ఇంటికి వెళ్లడానికి వెహికల్‌ అరేంజ్‌ చేస్తాం.’’
నవీన్‌ నవ్వి ఊరుకున్నాడు.

కొద్దిరోజుల తర్వాత మళ్లీ ఇంకొక ప్రపోజల్‌ పెట్టాడు హెడ్‌. ‘‘నవీన్‌! హైదరాబాద్‌లో భయపడుతూ ఎంతకాలం పని చేస్తావ్‌? మన బెంగళూర్‌ ఆఫీసుకి వెళ్లిపో.’’నవీన్‌కి ఇష్టం లేకపోయినా క్రియేటివ్‌ హెడ్‌ సలహా పాటించాలని నిర్ణయించుకున్నాడు. బెంగళూరు ఆఫీసుకి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యాడు.కార్పొరేటర్‌ హర్షకి భయపడి నవీన్‌ బెంగళూరు వెళ్లిపోతున్నాడని అందరూ చెప్పుకోసాగారు.ఆ రోజు నవీన్‌ ఆఫీసుకి బయల్దేరడానికి రెడీ అవుతున్నాడు. వెహికల్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో అతను ఉంటున్న శ్రీనిలయ అపార్ట్‌మెంట్‌ ముందు క్వాలీస్‌ వాహనం ఆగింది. అందులో నుంచి తెల్లటి ఖద్దరు డ్రెస్‌లో భారీ పర్సనాలిటీతో హర్ష దిగాడు. అతని వెంట నలుగురు అనుచరులు ఉన్నారు. అపార్ట్‌మెంట్‌ వాచ్‌మేన్‌ ఎదురొచ్చి ‘‘సార్‌! ఎవరి కోసం?’’ అని వినయంగా అడిగాడు.‘‘నవీన్‌.’’

‘‘ఫస్ట్‌ఫ్లోర్‌ సార్‌! నూట ఒకటి.’’ చెప్పాడు వాచ్‌మేన్‌. కాలింగ్‌ బెల్‌నొక్కగానే ఆఫీస్‌ కారుడ్రైవర్‌ వచ్చాడనుకుని నవీన్‌ భార్య తలుపు తీసింది. ఎదురుగా యముడిలా కనిపించాడు హర్ష. హడలిపోయింది ఆమె. తలుపు ముయ్యటానికి ప్రయత్నించింది కానీ ఆమె బలం చాలలేదు. నెట్టుకొని లోపలకు ప్రవేశించారు.హాల్లో కూర్చుని టీవీ న్యూస్‌ వాచ్‌ చేస్తున్న నవీన్‌ హర్షగ్యాంగ్‌ని చూసి లేచి నిల్చున్నాడు. అందరూ హెచ్చరించినట్టు జరగబోతున్నదని తన సిక్త్స్‌ సెన్స్‌ చెబుతోంది. ధైర్యం తెచ్చుకున్నాడు నవీన్‌. అతను విక్రమ్‌ అన్న అని తెలిసిపోతున్నా అడిగాడు.

 ‘‘సార్‌!.. మీరు?’’
‘‘నా పేరు హర్ష. నవీన్‌ నువ్వే కదూ?’’ అంటూ సో¸లో కుర్చున్నాడు. ‘‘రిలాక్స్‌ నవీన్‌. కూర్చో..!’’ అన్నాడు.నవీన్‌ అయోమయంగా చూస్తూ కూర్చున్నాడు. అతని భార్య దూరంగా నిలబడి భయంభయంగా చూస్తోంది. ఆమెకు శరీరమంతా కంపించిపోతోంది. గుండె దడదడలాడుతోంది. కన్నీళ్లు కారుతున్నాయి జరగబోయేది తలచుకునేసరికి. ‘‘అమ్మాయ్‌! నువ్వు లోపలికెళ్లు..’’ అన్నాడు హర్ష.ఆమె ఏడుపు ఆపుకుంటూ బెడ్‌రూమ్‌లోకి వెళ్లింది.‘‘నవీన్‌. నేను నీ మీద పగ తీర్చుకుంటానని భయపడుతున్నావు కదూ! అందుకే బెంగళూరు వెళ్లిపోతున్నావని తెలిసింది’’ అన్నాడు హర్ష కూల్‌గా.

‘‘ఆఫీసు వాళ్లే వెళ్లమంటున్నారు. నేను భయపడ్డం లేదు. మనిషి ఒక్కసారే చస్తాడు. ప్రతిరోజూ కాదు.’’‘‘గుడ్‌! నీ ధైర్యం నాకు నచ్చింది. విక్రమ్‌ని నువ్వు పట్టించినందుకు నాకు నీ మీద కోపం లేదు. ఎందుకంటే వాడితో ఎన్నోసార్లు మొత్తుకున్నాను. ఏం చేసైనా డబ్బు సంపాదించుకో. ఆడవాళ్ల జోలికి పోవద్దు. అలాపోతే ఎప్పటికైనా నాశనమవుతావు. భారతంలో ద్రౌపది జోలికి, రామాయణంలో సీత జోలికి వెళ్లి నాశనమైన వాళ్ల గురించి చెప్పాను. ఎందరో బాబాలూ జైలుపాలయ్యారని చెబితే వాడు వింటేగా! వినాశకాలే విపరీత బుద్ధి... నవీన్‌ నువ్వు ఎక్కడికీ పోవద్దు. నా తమ్ముడికి ఉరిశిక్ష పడాలని కోరుకుంటున్నాను. వాడు కాదు నా బ్రదర్‌. నువ్వే నా బ్రదర్‌. ధైర్యంగా దుర్మార్గుల్ని బైటపెట్టు. నీకు నీ ఆఫీసు వాళ్లే కాదు, నేనూ అండగా ఉంటాను’’ గంభీరంగా చెప్పాడు హర్ష. నమ్మలేనట్టు చూస్తున్నాడు నవీన్‌. కలా? నిజమా? హర్ష ఒక అట్టపెట్టె బహుమతిగా ఇచ్చాడు నవీన్‌కి. అందులో ఖరీదైన కెమెరా ఉంది.ఆస్తిలో భాగం పంచుకునే బ్రదర్‌ పీడ వదిలిందని తనకి ఆనందంగా ఉందని మాత్రం హర్ష చెప్పలేదు. కొన్ని విషయాలు పైకి చెప్పకూడదు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిర్లవణీకరణకు కొత్త మార్గం!

కార్బన్‌డైయాక్సైడ్‌ను ఆహారంగా మార్చేశారు!

సినిమా టైంలో కలిసిన ‘రోహిత్‌ సహానీ’..

తొలి అమెరికా పెళ్లికొడుకు

బొప్పాయి గుజ్జుతో మేని కాంతి

అభినయ శిల్పం

రోజుకు వెయ్యి లీటర్ల నీటితోనే చేపల సాగు..

'పాడి'తో బతుకు 'పంట'!

సంతృప్తి.. సంతోషం..!

మళ్లీ మురిపి'స్టారు'

‘ప్రేమ’ లేకుండా పోదు

నలుగురు ఓహ్‌ బేబీలు

పక్కింటి ఎండమావి

చీకటికి అలవాటుపడని కళ్లు

పెత్తనం పోయి కర్ర మిగిలింది

ఎత్తయిన సిగ్గరి

యువత. దేశానికి భవిత

బజ్జీ బిర్యానీ.. స్నాకం 'పాకం'

మద్దూరు వడను వదిలేస్తే బాధపడకతప్పదు..

చందమామ నవ్వింది చూడు

ఆఫీస్‌ ఇలా ఉండకూడదు

ప్లాస్టిక్‌ ఇల్లు

సౌరశక్తి ప్లాంట్‌లలో అబూదాబి రికార్డు!

మ్యావ్‌ మ్యావ్‌... ఏమైపోయావ్‌!

మా అమ్మపై ఇన్ని పుకార్లా

చక్కెర చాయ్‌తో క్యాన్సర్‌!

చిన్నారుల కంటి జబ్బులకు చికిత్సాహారం

మేము సైతం అంటున్న యాంకర్లు...

ఒత్తిడి... వంద రోగాల పెట్టు

చేతులకు పాకుతున్న మెడనొప్పి... పరిష్కారం చెప్పండి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’