అయ్యో అమానుషం

26 Nov, 2017 00:46 IST|Sakshi

‘‘వాట్‌....? క్వార్టర్స్‌ ఎంట్రన్స్‌లో ఉన్న రెండు కుక్కలూ చనిపోయాయా? ఎందుకు?’’ చాలా ఆశ్చర్యంగా అడిగాడు క్వార్టర్స్‌ కమిటీ హెడ్‌ సదానందం!తెలీదు సార్‌..! నైట్‌ రాఘవులే.. వాటికి ఫుడ్‌ పెట్టాడు.. తెల్లారే సరికి చనిపోయాయి సార్‌..!’’ అన్నాడు సైదులు చాలా నెమ్మదిగా..!‘‘ఏడి వాడు.. పిలు వాడిని’’ అన్నాడు చాలా కోపంగా  క్వార్టర్స్‌ కమిటీ హెడ్‌ సదానందం!ఇంతలో ‘‘సార్‌.. సార్‌... రెండు కుక్కలూ చనిపోయినాయి సార్‌..’’ అంటూ పరుగున వచ్చాడు రాఘవులు.‘‘అసలేం జరుగుతుందయ్యా క్వార్టర్స్‌లో.. మొన్నటికి మొన్న సీసీ కెమేరాలు పనిచెయ్యలేదు. ఇప్పుడు కుక్కలు చచ్చిపోయాయి?? నైట్‌ వాటికి ఏం పెట్టావ్‌’’ అంటూ గర్జించాడు సదానందం.‘‘అట్టంటారేటి సార్‌.. ఎప్పుడేం పెడతామో అదే పెట్టినా సార్‌..! చికెన్‌ ముక్కలు దండిగా తిన్నాయి. తిన్న తరువాత కూడా బాగానే ఉన్నాయి సార్‌!’’ అన్నాడు రాఘవులు!ఆ రోజు ఆదివారం కావడంతో ‘మొగల్‌పురా రైల్వే క్వార్టర్స్‌’లో ఉండేవాళ్లంతా కుక్కల దుర్మరణంతో గుమిగూడారు. ‘‘ఏ దొంగలైనా కావాలనే కుక్కల్ని చంపాలని ప్లాన్‌ చేశారేమో’’ అని యోచించారు. ఎవరికీ అంతు పట్టలేదు. ‘‘విలువైన వస్తువులేమైనా పోయాయా?’’ అని.. ఎవరి ఇళ్లు వాళ్లు సోదా చేసుకున్నారు. కానీ ఎక్కడి వస్తువులు అక్కడే భద్రంగా ఉన్నాయని తేల్చేశారు. మరి ‘‘కుక్కల అకాలమరణానికి కారణం ఏంటని’’... అంతా ఆలోచనలో పడ్డారు. సీసీ ఫుటేజ్‌లు చెక్‌ చేద్దాం అని అటుగా నడిచాడు సదానందం.

‘‘సీసీ ఫుటేజ్‌ చూద్దామని తీసుకొచ్చాగానీ.. అసలు ఇది బ్యాక్‌కి ఎలా మూవ్‌ చెయ్యాలి?’’ అన్నాడు సదానందం సీసీ టీవీ ముందు కూర్చుని ఏదేదో నొక్కేస్తూ.. ‘‘అయ్యో సార్‌ అలా కాదు! నా కివ్వండి’’ అని లాక్కుని ‘‘ఇలా చెయ్యాలి సార్‌’’ అన్నాడు సైదులు. ‘‘నువ్వు వాచ్‌మెన్‌వనే∙పేరే గానీ... టెక్నికల్‌ వర్క్‌లు కూడా బాగా తెలుసయ్యా..!’’ అంటూ మెచ్చుకున్న సదానందం.... కుక్కలకు ఫుడ్‌ పెట్టడం దగ్గర నుంచి మొదలు పెట్టి... సీసీ ఫుటేజ్‌ అంతా మూవ్‌ చేసి చూస్తున్నాడు. వెనుక ఉన్నవాçళ్లంతా సీన్‌ టు సీన్‌ పరిశీలిస్తున్నారు. సరిగ్గా 11:40కి రెండు పొడవాటి తాచు పాములు కుక్కలవైపు పాకడం, వాటిని చూసి మొదట అదిరిపడిన కుక్కలు... వాటితో గొడవ పడ్డం అంతా కానవస్తోంది. చాలాసేపు చెలగాటం తరువాత పాములు అటుగా ఉన్న తుప్పల్లోకి పోయాయి. కాసేపటికి మెల్లమెల్లగా కుక్కలు గిలగిలలాడుతూ చివరికి చనిపోయాయి.

పులుల్లాంటి ఆ కుక్కలని పూడ్చాలా.. కాల్చాలా.. అన్న సూచనలు, సలహాల మేరకు చివరికి పూడ్చేద్దామని నిర్ణయించారు. అయితే ఆ నిర్ణయం ఎందుకో సైదులకి నచ్చలేదు.
నలుగురు చొప్పున సాయం పట్టుకుంటూ.. ఎలాగో కష్టపడి ఆ కుక్కలను కాంపౌండ్‌ వెనుకకు మోసుకెళ్లారు. అదంతా ప్లాస్టిక్‌ కవర్లు, పేపర్‌ ప్లేట్స్, పిచ్చి మొక్కలు.. ఈత ముళ్లు ఇలా ఒకటేమిటి చూడ్డానికే భయానకంగా ఉంది ఆ ప్రదేశమంతా. పెద్ద పెద్ద తుమ్మచెట్లతో, తుప్పలతో ఉన్న ప్రదేశంలో అడుగు పెట్టడం కూడా చాలా కష్టంగానే ఉంది. సైదులు కూడా అయిష్టంగానే అటుగా నడిచాడు. పెద్ద దిమ్మ పక్కన ఉన్న కాస్త ఖాళీ స్థలంలో... గునపం పోట్లు మొదలయ్యాయి. గోతులు తవ్వేటోళ్లు, మరికొందరు క్వార్టర్స్‌లో ఉండే వాళ్లు తప్ప మిగిలిన వాళ్లంతా మెల్లగా ఎవరింట్లోకి వాళ్లు వెళ్లిపోతున్నారు.గాలి వేస్తున్న ప్రతిసారీ దుర్గంధం గుప్పుమంటోంది.‘‘ఏంటో బాగా కుళ్లిన కంపొస్తోంది’’ అంది గొయ్యి తవ్వుతున్న రాఘవులతో సదానందం భార్య శారద!అవునన్నట్లు అక్కడ ఉన్నవారంతా తలూపారు!ఏంటో ఈ తుప్పలు. మనుషులుండే చోట్లా ఉందా ఇది? పాములు రాక ఏం వస్తాయి మరి? ఇక్కడ నేనుండలేనమ్మా అంటూ ముందుకు నడిచింది శారద.ఎందుకో సైదులు గుండె వేగంగా కొట్టుకుంటోంది. ‘మరీ పక్కనే తవ్వుతున్నారు... ఏం జరుగుంతుందో ఏమో..’? అనుకుంటున్నాడు.తవ్వగా తవ్వగా దుర్గంధం మరింతగా పెరిగింది. గొయ్యి అడుగు భాగంలో పోటు మీద పోటు వేస్తున్నారు రాఘవులతో మరో ఇద్దరు పనివాళ్లు.

‘‘సార్‌.. సార్‌... శవం సార్‌ కుళ్లిన శవం’’ అంటూ అరుస్తున్నాడు రాఘవులు.అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. రాఘవులు గుండె ఆగినట్లు అయ్యింది. తన ఆందోళన బయటికి కనబడకుండా జాగ్రత్త పడుతున్నాడు.సదానందం మరింత వంగి చూశాడు.. మనిషి చెయ్యి కనబడుతుంది. ‘‘పక్కనే∙పూడ్చి నట్లున్నారు..!’’ అనుకుంటూ కంగారుగా పోలీసులకు సమాచారం అందించాడు.

సరిగ్గా పాతికేళ్లుంటాయేమో..! ఒంటి మీద నూలు పోగు కూడా లేదు. అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఉన్నారు. శరీరం సగంపైనే కుళ్లిపోవడంతో... పోలీసులు కూడా ‘‘గుర్తుతెలియని మహిళ హత్య’’ అని కేసు నమోదు చేసుకున్నారు. వారం గడిచే సరికి..  ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసి.. ఉరిబిగించి చంపేశారని తేల్చారు.

 పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ హశ్రిత... ఎంక్వైరీ మొదలు పెట్టింది. ఏవైనైనా మిసింగ్‌ కేసులు నమోదయ్యాయా? ఎవరిపైనా అనుమానం ఉందా? అక్కడ పనిచేసేవాళ్లు ఎలాంటి వారు? ఇలా చాలానే ఆరాలు తీసింది. అయితే శవాన్ని గుర్తించడానికి దుస్తులు కానీ, చెప్పులు కానీ, ఐడీ కార్డులు కానీ ఏవీ దొరక్కుండా చాలా జాగ్రత్తపడ్డారు హంతకులు. స్నిఫర్‌ డాగ్స్‌ సాయంతో.. పట్టేద్దామంటే ఐదురోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న వాచ్‌మెన్‌ అరణ్యం ఇంటినే చూపిస్తున్నాయి డాగ్స్‌.

అరణ్యం ఎందుకు చనిపోయాడు అని ఆరాతీస్తే... అప్పులెక్కువై చనిపోయాడని కొందరు.. భార్యకు వేరేవాడితో సంబంధం ఉందని తెలుసుకుని చనిపోయాడని మరి కొందరు.. చెప్పుకొచ్చారు. 
ఆత్మహత్య చేసుకుంటే పోలీసులకు ఎందుకు చెప్పలేదని అరణ్యం భార్య వీరమ్మని ప్రశ్నించింది ఇన్‌స్పెక్టర్‌ హశ్రిత.‘‘ఏమోనమ్మా! పెద్దోళ్లు అంతా కలిసి అలా నిర్ణయించినారు! దానికి ముందు మూడు రోజుల నుంచి కూడా మనిషేం బాగుండేటోడు కాదు? ఏమైందంటే చెప్పేటోడు కాదు!’’ అంది వీరమ్మ.క్రిస్టియన్స్‌ కావడంతో.. శవాన్ని కాల్చలేదు పూడ్చారని తెలుసుకుంది ఇన్‌స్పెక్టర్‌ హశ్రిత.అరణ్యం శవాన్ని పైకి తీయించి... ఆ యువతిపై అత్యాచారం చేసిన ఇద్దరి డీఎన్‌ఏలతో అరణ్యం డీఎన్‌ఏ మ్యాచ్‌ అవుతుందేమో చూడాలని ఆదేశాలు జారీ చేసింది హశ్రిత.

నిజమే ఆ యువతిపై అత్యాచారం చేసిన వాడిలో అరణ్యం ఒకడు. అంటే.. మరో వ్యక్తి కూడా వాచ్‌మెనే ఎందుకు కాకూడదు?’’ ఇన్‌స్పెక్టర్‌ హశ్రితలో అనుమానం మొదలైంది. 
తన అనుమానాలతో క్వార్టర్స్‌ కమిటీ హెడ్‌ సదానందాన్ని ఎంక్వైరీ చేసిన హశ్రితకు... శవం దొరికిన మరునాటి నుంచీ వాచ్‌మెన్‌ సైదులు డ్యూటీకి రావడం లేదని తెలిసింది.
∙∙ 
సైదుల్ని అరెస్ట్‌ చేసిన ఇన్‌స్పెక్టర్‌ హశ్రిత... నిజం చెప్పేవరకూ లాఠీలను విరగ్గొడుతూనే ఉంది.‘‘చెబుతా! మొత్తం చెబుతా!!’’చెప్పు! ఆ అమ్మాయి ఎవరు? తనకి నీకు ఏంటి సంబంధం?’’ అని అడిగింది హశ్రిత.‘‘ఆ అమ్మాయి.. ఆ అమ్మాయి.. క్వార్టర్స్‌లో ఉండే శివరామరాజులుగారి మనుమరాలు రమ్య మేడం!తను సిటీలో ఎవరో కుర్రోడిని ఇష్టపడిందట. ఆ విషయం ఇంట్లో చెబితే.. తన ఫోన్‌ లాక్కుని, ఓ గదిలో పెట్టి తాళంవేశారు.ఓ రోజు నేను క్వార్టర్స్‌లో అటూ ఇటూ తిరుగుతుంటే.. ‘నాకు హెల్ప్‌ చేస్తే డబ్బులిస్తా’నని ఓ కాగితంపై రాసి పై ఫ్లోర్‌ కిటికీ నుంచి నా మీదకు విసిరింది మేడం.
నేను సరే అన్నాను.

తరువాత రెండు రోజులకి తను ఉండే రూమ్‌ కిటికీ నట్లు విప్పేందుకు స్క్రూడైవర్‌ తీసుకెళ్లి ఇచ్చాను. 
‘నేను ఈ రోజు రాత్రికే మావాళ్లకు లేఖ రాసి... ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్లిపోతాను’ అంటూ.. చేతిలో ఐదువేలు డబ్బులు పెట్టింది. ‘‘నైట్‌ పదిగంటలకల్లా నా బ్యాగ్స్‌ అందుకోవడానికి రా.. సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి ఆ లోపే పవర్‌ పోయేలా చెయ్యి’’ అని చెప్పింది.

అప్పుడే.. ఆ పిల్ల మీద కన్నుపడింది. శాశ్వతంగా వెళ్లిపోతున్న పిల్ల తిరిగి వస్తుందన్న ఆశ వీళ్లెవ్వరికీ ఉండదు. పైగా వెళ్లిన పిల్ల కోసం ఇక్కడైతే వెతకరు. అదే ఆలోచనని అరణ్యంతో పంచుకున్నా.
అంతే! ఆమె బయటికి రావడం..! మేము మత్తు ఇచ్చి కాంపౌండ్‌ వెనుక ఉన్న తుప్పల్లోకి లాక్కెళ్లడం క్షణాల్లో జరిగిపోయాయి. పవర్‌ ఆన్‌ చెయ్యకుండానే సీసీ కెమెరా కనెక్షన్స్‌ పాడు చేసి.. పూర్తిగా పనికి రాకుండా చేశాం!

ఆ తరువాత ఆ కాంపౌండ్‌లోనే తనపై అత్యాచారం చేశాక... తనకి మెలుకువ వచ్చింది. నోటికి గుడ్డలు కుక్కడం వల్ల.. తను అరవలేకపోయింది. తనని వదిలేద్దామని అరణ్యం అన్నాడు. కానీ, తనందరితో చెప్పేస్తే అనే భయంతో నేనే తన మెడకి చున్నీ బిగించి చంపేశాను. తరువాత ఆ తుప్పల మధ్యలోనే గొయ్యి తీసి కప్పెట్టేశాం. ఆమె తాలూకు అన్ని వస్తువులు మాయం చేశాం. తరువాత ఏమైందో ఏమో.. అరణ్యం చాలా భయపడేవాడు. నేను ఎంత ధైర్యం చేప్పినా వినేవాడు కాదు. చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో ఆ శవం ఆ గోతిలో ఉండటం ఎప్పటికైనా ప్రమాదమే అనిపించింది. ఎలాగైనా పైకి తీసి కాల్చేద్దాం అనుకున్నా. అనుమానం రాకుండా కాల్చాలంటే.. ఏం చెయ్యాలని చాలా ఆలోచించాను. అప్పుడే ఓ ఆలోచన వచ్చింది. నాకు నైట్‌ డ్యూటీ ఉన్న రోజున.. మెయిన్‌ గేట్‌ దగ్గర ఉన్న కుక్కలను చంపి.. వాటిని కాల్చే సమయంలోనే ఆ మంటల్లో శవాన్ని వేసేద్దామని నిర్ణయించుకున్నాను.

 ఎందుకంటే.. ఎంతమంది పనివాళ్లు ఉన్నా అలాంటి పనులు నాకే అప్పగించి చేతులు దులుపుకుంటారు క్వార్టర్స్‌ వాళ్లు. అందుకే ఒకరోజు రాత్రి కుక్కలకు పెట్టే చికెన్‌ ముక్కల్లో స్లో పాయిజన్‌ కలిపాను. ఎవరికి అనుమానం రాకుండా అవి చావకముందే... సీసీ ఫుటేజ్‌ల్లో కనిపించేలా రెండు కోరల్లేని తాచుపాములను వాటి మీదకు వదిలాను. అనుకున్నట్లే అంతా అయ్యింది కానీ.. ఆదివారం రోజున ప్లాన్‌ చెయ్యడమే పొరబాటైందని తరువాత అర్థమైంది. కాలేజ్‌లు, స్కూళ్లు, ఆఫీసులు సెలవు కావడంతో అంతా ఆ క్వార్టర్స్‌లో ఉండటం.. కుక్కలని పూడ్చాలనే నిర్ణయించడం ఇదంతా నేను ఊహించ లేకపోయాను. ఆదివారం కాకుండా మిగిలిన రోజుల్లో జనం తక్కువగా ఉండటంతో పాటు.. ఏ పనైనా నాకే అప్పగించి అంతా తప్పుకునేవారు. ఈ సారి కూడా అలానే అవుతుందనుకున్నా. కానీ ఈ లోపే.. ఇలా జరిగిపోయింది’’ అంటూ తలదించుకున్నాడు సైదులు.

విషయం తెలుసుకున్న శివరామరాజులు కుటుంబం కన్నీరు మున్నీరయ్యారు. ‘‘రమ్యకి ఎవరో ముక్కు ముఖం తెలియని వాడిని సాయం కోరే పరిస్థితిని మనమే కల్పించామని.. ఇంటి బిడ్డ మాన ప్రాణాలకంటే మన పట్టుదలే ఎక్కువైపోయిందని’’ వాళ్లంతా గుండెలు బాదుకుంటూ ఏడ్చారు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా