పంటలు మారితే బతుకు బంగారం

1 Jan, 2019 08:52 IST|Sakshi
చిరుధాన్యాలు + పప్పుధాన్యాలు.. మన బడుగు రైతుల బతుకుల్లో జీవితేచ్ఛను పండించే బంగారు పంటలు..

రైతమ్మలు, రైతన్నలు, వ్యవసాయ కార్మికులు.. అష్టకష్టాలు పడి ఆరుగాలం చెమట చిందిస్తే.. ఆ తడితో మొలిచి పండిన గింజలే మనందరి ఆకలి తీరుస్తున్నాయి.అందుకు అన్నదాతకు ప్రతి ముద్దకూ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. దొరికీ దొరకని  సాయంతో.. నిండీ నిండని డొక్కలతో.. 
చిన్నా చితకా కమతాల్లో నేలతల్లినే నమ్ముకొని మొక్కవోని మనోబలంతో ముందడుగేసే మట్టి మనుషులందరికీ నిండు మనసుతో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతోంది ‘సాగుబడి’. 
ప్రకృతి మాత కనుసన్నల్లో సాగే వ్యవసాయంలో కష్టనష్టాలు.. ఒడిదొడుకులెన్నో. జ్ఞాపకాలను మిగిల్చి వెళ్లిపోయిన 2018 మనకు అందించిన మార్గదర్శనం చేసే ఊసులను స్మరించుకుంటూ..  ప్రకృతికి ప్రణమిల్లుతూ.. సరికొత్త ఆశలతో ముందడుగు వేద్దాం! 

భారతీయుల్లో 30 శాతం మందికి రక్తహీనత ఉంది. భూతాపోన్నతి వల్ల చాలా ప్రాంతాల్లో సాగు నీటి కొరత తీవ్రంగా ఉంది. వర్షపాతం తగ్గిపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ రైతులు వరి, గోధుమ పంటలను వదిలి... మొక్కజొన్న, చిరుధాన్య పంటలు సాగు చేయడం ప్రారంభిస్తే సాగు నీటి బాధలు 33% తీరిపోతాయని ఒక ముఖ్య అధ్యయనం(2018) తేల్చింది. అంతేకాదు, పౌష్టికాహారాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తేవచ్చని అమెరికాకు చెందిన ఎర్త్‌ ఇన్‌స్టిట్యూట్, కొలంబియా యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ సంయుక్తంగా చేసిన అధ్యయనం తేల్చింది. 
1996–2009 మధ్యకాలంలో ధాన్యం ఉత్పత్తి గణాంకాల ఆధారంగా ఎంత నీరు ఖర్చయిందో లెక్కగట్టారు. వరి సాగుకు అత్యధికంగా సాగు నీరు ఖర్చవుతోంది. వరికి బదులు మొక్కజొన్న, రాగి, సజ్జ, జొన్న వంటి చిరుధాన్యాలు సాగు చేస్తే సాగు నీరు ఆదా కావడమే కాకుండా.. ఐరన్‌ (27%), జింక్‌ (13%) వంటి పోషకాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని ‘సైన్స్‌ అడ్వాన్సెస్‌’లో ప్రచురితమైన ఈ అధ్యయనం విశ్లేషించింది. అన్ని జిల్లాలకూ ఒకే పరిష్కారం కుదరదు. 

ప్రతి జిల్లా స్థితిగతులను బట్టి ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించాలి అని కొలంబియా యూనివర్సిటీ ఎర్త్‌ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన కైలె డావిస్‌ అంటున్నారు. అధిక నీటిని వాడుకుంటూ అధిక ఉద్గారాలను వెలువరిస్తున్న వరికి బదులు.. అంతకన్నా పోషక విలువలున్న, కొద్దిపాటి నీటితో పండే మిల్లెట్స్‌ను పండించి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలందరికీ అందించవచ్చు. వీటిని సేంద్రియంగానే పండించవచ్చు అని ఆయన అంటున్నారు.  2018ని భారత్‌ జాతీయ చిరుధాన్య సంవత్సరంగా ప్రకటించుకున్న విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు