పాలిచ్చే తల్లులకు మేలు చేసే జీలకర్ర

2 May, 2018 00:48 IST|Sakshi

గుడ్‌ఫుడ్‌ 

జీలకర్రను మనం కేవలం ఒక సుగంధ ద్రవ్యంలాగా వాడుతాం గానీ... దీనితో కేవలం మంచి వాసనే కాదు... మంచి ఆరోగ్యం కూడా సమకూరుతుంది. జీలకర్రతో మనకు ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని మాత్రమే... 

∙    గర్భిణులు, పాలిచ్చే తల్లులు జీలకర్ర ఉండే పదార్థాలను తరచూ తీసుకోవాలి. పాలిచ్చే తల్లుల్లో పాలు ఎక్కువగా పడేలా చేస్తుంది. థైమాల్‌ అనే పదార్థం ఇందుకు దోహద పడుతుంది.

∙    జీలకర్రలో ఐరన్‌ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే రుతు సమయంలో అధిక రుతుస్రావం అయ్యే మహిళలు జీలకర్ర వాడితే, వారు కోల్పోయే ఐరన్‌ తేలిగ్గా భర్తీ అవుతుంది. అలాగే ఎదిగే పిల్లలకూ ఐరన్‌ ఎక్కువగా అవసరం కాబట్టి వారికీ జిలకర చాలా మంచిది. 

∙    జీలకర్రలో ఐరన్‌తో పాటు చాలా ఎసెన్షియల్‌ ఆయిల్స్, విటమిన్‌–సి, విటమిన్‌–ఏ, ఇతర ఖనిజలవణాలు చాలా ఎక్కువ. ఇవన్నీ సంయుక్తంగా రోగనిరోధక శక్తిని పెంపొందించి, అనేక వ్యాధులనుంచి నివారిస్తాయి. 

∙    ఆస్తమా, బ్రాంకైటిస్‌ వంటివి రాకుండా నిరోధించే గుణం జీలకర్రకు ఉంది. శ్వాసవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 

∙    జీలకర్రలో విటమిన్‌–ఇ ఎక్కువ. అందుకే ఇది యాంటీ ఏజింగ్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. తద్వారా వయసు పెరగడం వల్ల వచ్చే మార్పులు... చర్మం వదులు కావడం, ముడుతలు, ఏజ్‌ స్పాట్స్‌ వంటి వాటిని నిరోధిస్తుంది.

మరిన్ని వార్తలు