నీటి కాసులకు కర్కుమిన్‌ చికిత్స!

27 Jul, 2018 01:39 IST|Sakshi

కళ్లకు వచ్చే జబ్బు నీటి కాసులకు సరికొత్త, మెరుగైన చికిత్సను అందుబాటులోకి తెచ్చారు ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు. పసుపులోని కర్కుమిన్‌ రసాయనాన్ని ద్రవ రూపంలో అందిస్తే నీటి కాసులకు మెరుగైన చికిత్స చేయవచ్చునని వీరు అంటున్నారు. ఇప్పటివరకూ కర్కుమిన్‌ను మాత్రల రూపంలో నోటి ద్వారా తీసుకుంటున్నారు. అయితే కర్కుమిన్‌ అంత సులువుగా రక్తంలో కలిసిపోదని.. దీంతో చాలా ఎక్కువ మోతాదులో మాత్రలు మింగవలసి వస్తుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు చెప్పారు.

ఈ నేపథ్యం లో తాము 24 కర్కుమిన్‌ మాత్రల స్థానంలో కంటిలోకి కొన్ని కర్కుమిన్‌తో కూడిన చుక్కలు వేయడం ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చునని నిరూపించామని ప్రొఫెసర్‌ ఫ్రాన్సిస్కా కోర్డిరో తెలిపారు. పెద్ద ఎత్తున మాత్రలు మింగడం వల్ల వచ్చే జీర్ణసంబంధిత సమస్యలను కూడా రాకుండా చేసుకోవచ్చునని చెప్పారు. ద్రవరూప కర్కుమిన్, మాత్రల కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ ప్రభావవంతమైందని, ఎలుకలపై జరిపిన పరిశోధనల ద్వారా తాము ఈ విషయాన్ని రూఢి చేసుకున్నామని అన్నారు. ద్రవరూప కర్కుమిన్‌ కళ్లలోకి వేసిన ఎలుకల్లో కణాల నష్టం గణనీయంగా తక్కువ ఉందని, పైగా దుష్ప్రభావాలు కూడా ఏమీ కనిపించలేదని వివరించారు.

మరిన్ని వార్తలు