సాధనా కట్ స్టార్ ఫ్యాషన్

9 Aug, 2015 23:00 IST|Sakshi
సాధనా కట్ స్టార్ ఫ్యాషన్

నాస్టాల్జియా
 
పందొమ్మిది వందల అరవైలలో దేశానికి ఒకే ఒక హెయిర్ స్టయిల్ తెలుసు. ‘సాధనా కట్’. ఆ సంవత్సరమే ‘లవ్ ఇన్ సిమ్లా’ వచ్చింది. జాయ్ ముఖర్జీ ఫస్ట్ ఫిల్మ్. హీరోయిన్‌గా సాధనాకు కూడా. అప్పటికే సాధన సినిమాల్లో ట్రై చేస్తోంది.     } 420లో ‘ముడ్ ముడ్ కే నా దేఖ్ ముడ్ ముడ్ కే’ పాటను మీరు యూ ట్యూబ్‌లో చూస్తే అందులో గ్రూప్ డాన్సర్‌లలో ఒకరుగా కనిపిస్తుంది. అయితే ఫిల్మాలయా స్టూడియో పెట్టి చక్రం తిప్పుతున్న శషధర్ ముఖర్జీ కళ్లల్లో పడటంతో దశ తిరిగింది. కొడుకు జాయ్ ముఖర్జీని హీరోగా చేస్తూ హీరోయిన్ ఎవరా అని వెతుకుతుంటే సాధనా కనిపించింది. ఓకే చేశాడు. కాని డెరైక్టర్ ఆర్.కె.నయ్యర్‌కు ఒక సమస్య వచ్చింది. సాధన నుదురు చాలా విశాలంగా ఉంది. ముఖం పొడవు. దీనిని సరి చేయాలంటే ఏం చేయాలా అని హాలీవుడ్ హీరోయిన్ ఆడ్రే హెప్‌బర్న్ హెయిర్ స్టయిల్‌ని ఈమెకు ట్రై చేశాడు. సినిమా రిలీజ్ అయ్యాక అదే సాధనా కట్‌గా దేశమంతా పాప్యులర్ అయ్యింది. సినిమాలంటే ఏమీ తెలియని పల్లెటూరి ఆడపిల్లలు కూడా ఈ కట్‌ను ట్రై చేశారు. సాధన ‘చుడీదార్ కుర్తా’ను కూడా చాలా పాప్యులర్ చేసింది. అప్పటి వరకూ హీరోయిన్‌లు లూజ్‌గా ఉన్న సల్వాల్ కమీజ్‌లను ధరించేవారు. అయితే వక్త్ (1965)లో సాధన చుడీదార్ కుర్తాను ధరించాక చాలా మంది హీరోయిన్లు ఆ దారి పట్టారు. సాధన తండ్రి, మరో హీరోయిన్ బబిత తండ్రి సొంత అన్నదమ్ములన్న సంగతి చాలా కొద్ది మందికి తెలుసు. థైరాయిడ్ వల్ల కంటి రెప్పలకు సంబంధించి సమస్య వస్తే సాధన అమెరికాలో వైద్యం చేయించుకుంది.

కాని పెద్దగా ఫలితం ఇవ్వలేదు. 1975 తర్వాత సాధన నటించలేదు. బయట కూడా కనిపించడానికి ఇష్టపడలేదు. తొలి సినిమా దర్శకుడు నయ్యర్‌ను వివాహం చేసుకుని 30 ఏళ్లు వైవాహిక జీవితం అనుభవించింది. పిల్లలు లేరు. ప్రస్తుతం ఆశా భోంస్లేకు చెందిన ఒక భవంతిలో ఆమె అద్దెకు ఉంటున్నట్టు భోగట్టా. ‘మేరే మెహబూబ్’, ‘ఓ కౌన్ థీ’, ‘మేరా సాయా’, ‘ఏక్ ఫూల్ దో మాలీ’... ఇవన్నీ సాధనా హిట్స్. ‘లగ్ జా గలే’... ‘మేరా సాయా సాథ్ హోగా’, ‘నైనా బర్‌సే రిమ్‌జిమ్ రిమ్‌జిమ్’, ‘ఝమ్కా గిరారే బరేలీ కె బజార్ మే’... ఇవన్నీ సాధనా హిట్ సాంగ్స్. పసిడి రెక్కలు విసిరి కాలం పారిపోయింది. ఒక బంగారు ఈక ఇదిగో ఇలా మన గుండెల్లో మిగిలి ఉంది.
 
 

మరిన్ని వార్తలు