2 ఎకరాల కన్నా 3 గేదెలు మిన్న!

21 May, 2019 07:05 IST|Sakshi
పాలు పితుకుతున్న గణేష్‌ బాబు

కాడి–కవ్వం ఆడితే కరువుండదు

రెండెకరాల్లో పండించిన పంటలతో ఎంత ఆదాయం వస్తుందో చెప్పలేం

మూడు గేదెలు పెట్టుకుంటే రోజుకు రూ. వెయ్యి ఆదాయం ఖాయం

పంటల మీద కన్నా పాడి మీద ఆధారపడటమే మేలంటున్న బడుగు రైతు గణేశ్‌బాబు

కాడి–కవ్వం ఆడిన ఇంట్లో కరువుండదు... పాడి–పంటల ఆవశ్యకతను గుర్తించిన పెద్దల మాట ఇది. వివిధ కారణాల వల్ల వ్యవసాయం గిట్టుబాటు కాని నేటి కాలంలో కూడా పాడి పశువులను నమ్ముకున్న చిన్న, సన్నకారు రైతులు చాలా స్థిమితంగా ఉన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట మీద సమకూరే ఆదాయం కుటుంబ జీవనానికి సరిపోక పోయినా.. పాడి ఆ రైతు కుటుంబాలను ఆదుకుంటోంది. అయితే, పాడిలోనూ కష్టానికి తగిన ఆదాయం రావట్టేదు. అయినా పాడి అనుదినం నిరంతరాదాయాన్నిస్తుంది కాబట్టి గణేశ్‌బాబు వంటి చిన్న, సన్నకారు రైతులు పాడిపైనే ఎక్కువ ఆధారపడుతున్నారు. పిల్లలను పెద్ద చదువులు చదివిస్తున్నారు.

పంట ఒక్కటే కాదు పాడి కూడా ఉంటేనే బడుగు రైతు బతుకు పచ్చగా ఉంటుంది. నల్లగొర్ల గణేష్‌బాబు, సరోజిని కుటుంబ గాథ ఈ వాస్తవాన్నే చెబుతోంది. గుంటూరు జిల్లా మండల కేంద్రం దుగ్గిరాల వీరి స్వగ్రామం. సొంతానికి రెండెకరాల పొలమే గణేష్‌బాబు కుటుంబానికి ఆధారం. ఎకరం మాగాణిలో ఖరీఫ్‌లో వరి, రబీలో మొక్కజొన్న/ జొన్న/ అపరాలు వేస్తుంటారు. మరో ఎకరం మెట్ట భూమిలో వాణిజ్య పంట సాగుచేస్తారు. ఎరువులు, పురుగుమందులు ఏటికేడాది పెరుగుతూ పెట్టుబడులు భారమవుతున్నాయి. మొదటి పంటకే అస్తుబిస్తుగా సాగునీరు అందుతున్నందున రెండో పంటకు డబ్బులు పెట్టి నీటితడులు ఇవ్వాల్సివస్తోంది. ఫలితంగా అదనంగా చేతి ఖర్చులు వొదులుతున్నాయి. ఇంతచేసినా, పంట చేతికొచ్చాక మార్కెట్‌లో ‘కనీస మద్దతు’ కరవవుతోంది.

ఇలాంటి దిక్కుతోచని పరిణామాలతో పంటకు తోడుగా గతంలో వదిలేసిన పాడికేసి చూశారు గణేష్‌బాబు. తొలుత మూడు పాడి గేదెలను కొనుగోలు చేశాడు. గేదె పాలివ్వడం రోజులో ఒక్క పూటకే పరిమితమై పాలు తగ్గిపోతున్న పరిస్థితుల్లో మేపే వారికి అమ్మేయడం.. మరో పాడి గేదెను తోలుకొచ్చుకోవడం ఆయనకు అలవాటు. పాలు ఇస్తున్న గేదెలే ఆయన దగ్గర ఉంటాయన్నమాట. పాడి ఆదాయం తగ్గకుండా ఉండేలా చూసుకోవాలంటే ఇదే మార్గం. పాల కేంద్రం నిర్వాహకుడు పాల డబ్బుల్లో జమ వేసుకునే షరతుతో గేదెల కొనుగోలుకయ్యే సగం డబ్బు అడ్వాన్సుగా ఇస్తుండటం వెసులుబాటుగా ఉందంటారు గణేష్‌బాబు. ఇలా రెండేళ్లుగా ఏడాదిలో 365 రోజులు ఇంట్లో పాడి వుండేలా చూసుకున్నారు.

రోజూ 20 లీటర్లు..
గేదెలకు పచ్చి మేత కోసం  పంట పొలంలో 15 సెంట్లలో పశుగ్రాసం సాగు చేస్తున్నారు. ‘రోజూ పొలం వెళ్లి వచ్చేటపుడు పచ్చిమేత కోసుకుని వస్తాను.. వీటితోపాటు కొబ్బరి పిండి, తెలగ చెక్క, పట్టి చెక్క, మిక్చరు దాణా, తవుడు ఇస్తున్నాం.. పశువుల దగ్గర శుభ్రం చేయటం, పాలు పితకటం మా ఇంటావిడ సరోజిని చేస్తుంది. అప్పుడప్పుడు పిల్లలు కూడా సాయం చేస్తుంటారు’ అని తమ ఇంట్లో శ్రమవిభజనను వివరించారు గణేష్‌బాబు. ఇంట్లో వాడకానికి పోను రోజూ 20 లీటర్లు తగ్గకుండా పాల కేంద్రానికి విక్రయిస్తున్నారు. వెన్న శాతం ఆధారంగా లీటరుకు రూ. 50 పైగా ధర పడుతుంటుంది. నెలకు రూ. 30 వేల ఆదాయం తీస్తున్నాను. గేదెల పోషణకయ్యే రూ. 10 వేలు పోగా మిగిలిన రూ. 20 వేలను బ్యాంకులో రుణానికి జమచేస్తున్నానని వివరించారు.

పంటలతో ఆదాయం అంతంతే!    
పాడి గేదెల పోషణలో ఉన్న ఆదాయం సేద్యంలో లేదంటారు గణేష్‌బాబు. ‘‘ఎకరం మాగాణిలో ఖరీఫ్‌లో ధాన్యం 35 బస్తాలు వచ్చింది. యంత్రంతో ఒకేసారి కోత, నూర్పిడి చేసి కల్లంలోనే అమ్మేశాం. 77 కిలోల బస్తాకు రూ. 1,150 వచ్చాయి. ఎకరా సాగుకు పెట్టిన పెట్టుబడికి వచ్చిన దానికి సరిపోయింది. మొక్కజొన్న పంటకు కత్తెర పురుగు బెడద వస్తుందన్న భయంతో రెండో పంటగా పెసర వేశాను. నాలుగు బస్తాలైంది. మంగళగిరి మార్కెట్‌లో పేరు నమోదు చేసి వచ్చాను. రూ.28 వేలు వస్తాయనుకుంటున్నా... ఖర్చులు రూ.10 వేలు పోతే ఇందులో రూ.18 వేలు మిగలొచ్చు అనుకుంటున్నా’నని అన్నారు. ఎకరం మెట్ట భూమిలో పసుపు సాగు చేస్తే 23 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందన్న సంతోషమే లేకుండా పోయింది. మార్కెట్లో క్వింటాలు పసుపు ధర రూ.5,500–5,700కి మించి లేదు. విత్తనం ఖరీదుతో సహా ఎకరా పసుపు సాగుకు రూ.లక్ష పైగా ఖర్చవుతోంది. క్వింటాలు కనీసం రూ.7,000 ఉంటే మినహా నాలుగు డబ్బులు మిగిలే పరిస్థితి లేనపుడు ప్రస్తుతమున్న ధరతో లాభం ఆశించే అవకాశమే లేదు. రెండెకరాల భూమిలో మూడు పంటలు సాగుచేస్తే ఏడాదిలో వచ్చిన ఆదాయం రూ.20 వేల లోపుగానే లెక్కజెప్పారాయన.

మూడు గేదెలు..
నెలకు రూ. 30 వేల ఆదాయంఅదే మూడు పాడి గేదెలతో నెలకు రూ. 20 వేలు బ్యాంకులో జమ చేస్తున్నానంటారు. ఇద్దరు కొడుకులు బీటెక్‌ చేశారు. ఏడాదిక్రితం బీటెక్‌ పూర్తయిన పెద్ద కొడుకు ఆంజనేయ ఆదిత్యసాయి రోడ్డుప్రమాదంలో గాయపడటంతో ఆసుపత్రి ఖర్చులు, వ్యవసాయ ఖర్చుల నిమిత్తం బ్యాంకులో రూ.10 లక్షల రుణం తీసుకున్నారు. వ్యవసాయంపై వచ్చే ఆదాయం ఇల్లు గడిచేందుకే సరిపోని పరిస్థితుల్లో, పాడిగేదెల పోషణ ద్వారా ఇంటిల్లిపాదికీ పాలు సమకూరటమే కాకుండా నెలనెలా స్థిరమైన, గౌరవప్రదమైన ఆదాయాన్ని కళ్లచూస్తున్నారు గణేష్‌బాబు (97013 01880). గేదెలను శుభ్రంగా కడిగేటప్పుడు, వాటిని మాలిమిగా దగ్గరకు తీసుకున్నప్పుడు ఆ కుటుంబ సభ్యుల కళ్లలో వాటి పట్ల కృతజ్ఞత ప్రస్ఫుటమవుతూ ఉంటుంది!    – బి.ఎల్‌.నారాయణ, సాక్షి, తెనాలి ఫోటోలు : బి.రాజు, తెనాలి

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు