సిగ్గు పడదాం దళిత కంఠంపై వెలి ఖడ్గం

10 Jan, 2018 00:56 IST|Sakshi

దళిత మహిళా సర్పంచ్‌ సంఘ బహిష్కరణ

నిజామాబాద్‌ జిల్లా బుస్సాపూర్‌లో అమానుషం 

పాట్లు పడుతున్న గ్రామ ప్రథమ పౌరురాలి కుటుంబం

మహిళ అంటే ఈ దేశంలో వివక్ష... దళితులంటే ఈ సంఘంలో వివక్ష.మరి దళిత మహిళ అయితే?... బహిష్కారం ఒక ఆయుధం.బహిష్కరించడం ఒక పంజరం... మాట చెల్లుబాటు కావడానికి ఈ జులం.
పైచేయి సాధించడానికి ఈ దౌర్జన్యం... ఇంకానా... ఇప్పుడు కూడానా?... సిగ్గు పడదాం.

గ్రామానికి ప్రథమ పౌరురాలు ఆమె. ప్రజాస్వామ్యబద్ధంగా గ్రామస్తులంతా కలిసి ఓట్లేసి గెలిపించిన సర్పంచ్‌. అలాంటి ప్రజాప్రతినిధినే ఇప్పుడు ఆ గ్రామం నుంచి బహిష్కరించారు. సాధారణ ప్రజలకు ఏమైనా ఇబ్బందులొస్తే ముందుగా గుర్తొచ్చేది గ్రామ సర్పంచ్‌. మరి అలాంటి ప్రజాప్రతినిధినే ఓ భూవివాదం విషయమై గ్రామం నుంచి వెలివేయడం అమానవీయం. ఆమెతో ఆమె కుటుంబసభ్యులతో గ్రామస్తులెవరూ మాట్లాడవద్దని, ఆమె పొలాలకు ఎవరూ పనులకు వెళ్లద్దని, పండగలు, శుభకార్యాలకు పిలవొద్దని హుకూం జారీ చేశారు. కొన్ని నెలలుగా సంఘ బహిష్కరణకు గురి చేశారు. నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్‌ గ్రామానికి చెందిన దళిత మహిళా సర్పంచ్‌ జక్కుల మమత ఉదంతం ఇది. 

ఏం జరిగింది?
బుస్సాపూర్‌ గ్రామ శివారులో మమత పూర్వికుల పేరుతో 3 ఎకరాల 30 గుంటల భూమి ఉంది. ఈ భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డులు మమత భర్త శ్రీనివాస్‌ తాతల పేరుతో ఉన్నాయి. గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారికి పక్కనే ఉన్న ఈ భూమి ఇప్పుడు రూ.కోట్లు పలుకుతోంది. ఈ భూమిపై కొందరు గ్రామ పెద్దలు కన్నేశారు. ఎలాగైనా ఈ భూమిని మమత కుటుంబానికి దక్కకుండా చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన సందర్భాన్ని అనుకూలంగా మార్చుకోవాలని ప్రణాళిక రూపొందించారు. భూమి తమది కాదని చెప్పమంటూ రెవెన్యూ రికార్డులపై ఆ మేరకు సంతకాలు పెట్టాలని పలుకుబడి కలిగిన పెద్దలు మమత భర్త శ్రీనివాస్‌పై ఒత్తిడి తెచ్చారు. ‘మీ పూర్వికులు మీ భూమిని మాకు విక్రయించారు. అందుకోసం ఇప్పుడు రెవెన్యూ రికార్డుల్లో సంతకాలు చెయ్యి’ అని సర్పంచ్‌ భర్త శ్రీనివాస్‌పై ఒత్తిడి తెచ్చారు. ఇందుకు శ్రీనివాస్‌ నిరాకరించడంతో 2017 అక్టోబర్‌ 29న సర్పంచ్‌ మమత కుటుంబాన్ని సంఘ బహిష్కరణ చేశారు. ఆమెతో, ఆమె భర్త శ్రీనివాస్‌తో ఎవరైనా మాట్లాడినా, తిరిగినా, భోజనం చేసినా రూ.ఐదు వేల జరిమానా ఉంటుందని తీర్మానం చేశారు. ఇటీవల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కందూరు చేయగా.. సర్పంచ్‌ భర్త శ్రీనివాస్‌ను భోజనానికి పిలిచారు. మరొకరు దుర్గామాత పూజ, సత్యనారాయణ వ్రతం సందర్భంగా శ్రీనివాస్‌ను ఆహ్వానించారు.  శ్రీనివాస్‌ను ఆహ్వానించిన ముగ్గురిపై గ్రామపెద్దలు ఒత్తిడి తెచ్చారు. మరోమారు ఇలాంటి ఘటనలు జరిగితే తీవ్రంగా ఉంటుందని హెచ్చరించడంతో వారు మమత కుటుంబసభ్యులను దూరంగా ఉంచారు.

అభివృద్ధి పనులకూ ఆటంకాలు..
గ్రామంలోని వివిధ అభివృద్ధి పనుల కోసం మంజూరైన నిధులతో సర్పంచ్‌ మమత ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో మురికి కాలువల నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనులకు ఎంబీ రికార్డులు చేయకుండా గ్రామ పెద్దలు సంబంధిత అధికారులను అడ్డుకున్నారు. దీంతో మూడు నెలలుగా తమకు రావాల్సిన బిల్లులు నిలిచిపోయాయని మమత వాపోతున్నారు. గ్రామపంచాయతీ రికార్డుల్లో కూడా ఎలాంటి తీర్మానాలు చేయవద్దని పంచాయతీ సిబ్బందిని సైతం ఆదేశించారని మమత ఆవేదన వ్యక్తంచేశారు.
– పాత బాలాప్రసాద్

పొలం పనులకూ  ట్రాక్టర్‌లను రానిస్తలేరు
పొలంలో నాట్లు వేసుకోవాలని అనుకున్నాం. దమ్ము కొట్టేందుకు గ్రామంలోని ఓ ట్రాక్టర్‌ యజమానిని అడిగితే. ఆదివారం ట్రాక్టర్‌ పంపుతానని చెప్పారు. 17 మంది కూలీలను కూడా పిలుచుకుని సిద్ధంగా ఉన్నాం. సర్పంచ్‌ పొలంలో పనికి వెళితే రూ.ఐదు వేలు జరిమానా విధిస్తామని గ్రామ పెద్దలు ట్రాక్టర్‌ యజమానిని హెచ్చరించడంతో ఆయన ట్రాక్టర్‌ను పంపలేదు. నిర్మల్‌ జిల్లా సోన్‌పేట్‌ నుంచి ట్రాక్టర్‌ను కిరాయికి తెచ్చుకుని నాట్లు వేసుకోవాల్సి వచ్చింది. ఇట్ల మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. 
– జక్కుల మమత, సర్పంచ్‌ 

మరిన్ని వార్తలు