ఎదురు లేని వెదురు వనం! 

21 Jul, 2020 08:33 IST|Sakshi
దామ్యాంగ్‌ వెదురు వనంలో ముళ్లు లేని వెదురు

అద్భుతం.. దామ్యంగ్‌ (సౌత్‌ కొరియా) రైతుల వెదురు సేద్యం 

తరతరాలుగా సంప్రదాయ వ్యవసాయ పద్ధతులే తలమానికం

వెదురు ఉత్పత్తులు, కళాకృతుల తయారీతో రైతులకు ఆదాయం 

అంతర్జాతీయ వ్యవసాయ వారసత్వ స్థలంగా ఎఫ్‌.ఎ.ఓ. గుర్తింపు 

చిరకాలంగా వర్థిల్లుతున్న సంప్రదాయ వెదురు క్షేత్రాలు అవి. వందా రెండొందలు కాదు.. ఏకంగా వెయ్యేళ్లుగా పుడమిపై పచ్చని సంతకంలా పరుచుకొని ఉన్నాయి. సుసంపన్నమైన దక్షిణ కొరియా సంప్రదాయ వ్యవసాయ వారసత్వానికి సజీవ సాక్ష్యాలు ఆ వెదురు క్షేత్రాలు. దామ్యంగ్‌ లోయ ప్రాంతంలో గ్రామాల మధ్య పచ్చగా అలరారుతున్న వెదురు వనాలే అక్కడి రైతులు, ప్రజానీకానికి జీవనాధారాలుగా నిలుస్తున్నాయి. అంతేకాదు, అతి శీతల గాలుల నుంచి తీవ్ర వడగాడ్పుల నుంచి పల్లెవాసులను పెట్టని కోటలై రక్షిస్తున్నాయి. 

వెదురు జీవవైవిధ్యం
వెదురులో అనేక రకాలు ఉంటాయి. ముళ్లు లేని వెదురు రకాలు సాగుకు అనువుగా ఉంటాయి. ఒక్కో రకం వెదురు ఒక్కో పనికి అంటే.. కలపకు, కళాకృతులు, ఫర్నిచర్‌ తయారీ వంటి పనులకు ఉపయోగపడుతాయి. ఆ ప్రాంతంలోని ప్రతి గ్రామానికి చెందిన రైతులు తమ అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల వెదురు జాతులను సాగు చేస్తూ.. తమ జీవనోపాధి చూసుకుంటూనే వెదురు జీవైవిధ్యాన్ని పదిలంగా కాపాడుకుంటున్నారు. వెదురు తోటల చుట్టుపక్కల్లో వరి, క్యాబేజి, బఠాణీలు, ఇతర కూరగాయలు, స్ట్రాబెర్రీలు, ఆపిల్స్‌ వంటి పండ్లు సాగు చేస్తున్నారు. కొండవాలులో వెదురు తోపుల మధ్య విశిష్టమైన ‘జుక్రో’ రకం తేయాకు, కొన్ని రకాల అరుదైన ఔషధ మొక్కలను సాగు చేస్తున్నారు. 

సహజ నీటి చక్రం
ఏడాది పొడవునా కొన్ని మీటర్ల ఎత్తున, కొన్ని కిలో మీటర్ల పరిధిలో పచ్చని గుమ్మటంలా పరచుకొని ఉండే వెదురు వనాలు విశిష్టమైన పర్యావరణ సేవలు అందిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి నిపుణులు గుర్తించారు. కనీసం రెండు కిలో మీటర్ల పరిధిలో ఏడాది పొడవునా ఇటువంటి దట్టమైన పచ్చదనం అలముకొని ఉంటే గణనీయమైన రీతిలో పర్యావరణ సేవలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సేవల వల్ల ఆ ప్రాంతంలో సహజ నీటి వనరుల లభ్యతకు కొదువ లేకుండా ఉంది. వెదురు చెట్ల వేరు వ్యవస్థకు మట్టిని, తద్వారా నీటిని పుష్కలంగా పట్టి ఉంచి నెమ్మదిగా విడుదల చేసే లక్షణం ఉండటం వల్ల పంటలకు నిరంతరం నీటి కొరత ఉండటం లేదు. దామ్యాంగ్‌ రైతులు తరతరాలుగా పర్యావరణ హితమైన సంప్రదాయ సాగు పద్ధతులను అనుసరిస్తున్నారు. పంటల సాగులో పశు వ్యర్థాలను తప్ప రసాయనాలు వేసిన దాఖలాలు లేవు. భూసార పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధచూపుతున్నారు. 

వెదురు పిలకలతో వంటకాలు
వెదురు పిలకలు పోషక విలువలతో కూడిన చక్కని సంప్రదాయ ఆహారం. సేంద్రియ వెదురు పిలకలతో రుచికరమైన ప్రత్యేక వంటకాలను సందర్శకులకు వడ్డిస్తారు. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి కొన్ని ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. అందులో ఒకటి.. వెదురు పిలకలతో ముఖ సౌందర్యాన్ని ఇనుమడింపజేసే ఫేస్‌ క్రీం తయారీ కూడా. వెదురును ఎన్నెన్ని రకాలుగా ఉపయోగించవచ్చో దామ్యంగ్‌ వాసులు ప్రపంచానికి చాటి చెబుతూ మంచి ఆదాయం పొందుతున్నారు. 

వ్యవసాయ పర్యాటకం
ప్రకృతి మాత ఒడిలో సుందర దృశ్యంగా ఆవిష్కృతమైన వెదురు వనాలు చూపరులను మంత్రముగ్ధులను చేస్తాయి. అందువల్లనే దామ్యంగ్‌ వెదురు వనాలను చక్కటి ‘వ్యవసాయక పర్యాటక కేంద్రం’గా మలచిన తీరు ముచ్చటగొలుపుతుంది. బాంబూ ఫారెస్ట్‌లో రెండు కిలోమీటర్ల నడక, వెదురు ఉత్పత్తుల మ్యూజియం, థీమ్‌ పార్క్‌ పర్యాటకుల మనసులు దోచుకుంటున్నాయి. ప్రతి ఏటా జరిగే ‘దామ్యంగ్‌ బాంబూ ఫెస్టివల్‌’ పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తూ రైతులు, స్థానికులు, వెదురు ఉత్పత్తుల తయారీ కళాకారులకు కాసులు కురిపిస్తోంది. బొంగులతో బుట్టలు, వివిధ ఆకృతుల్లో వస్తువుల తయారు చేసి పర్యాటకులకు విక్రయించి మంచి ఆదాయం గడిస్తున్నారు. 

దామ్యంగ్‌ వెదురు రైతుల విశేష కృషికి ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్‌.ఎ.ఓ.) ఫిదా అయిపోయింది. ‘అంతర్జాతీయంగా ముఖ్యమైన వ్యవసాయ వారసత్వ వ్యవస్థ’ (జి.ఐ.ఎ.హెచ్‌.ఎస్‌.)గా దామ్యంగ్‌ వెదురు వనాలకు ఇటీవలే విశిష్ట గుర్తింపునిచ్చింది. దక్షిణ కొరియాలో ఈ గుర్తింపు పొందిన ఐదో ప్రాంతం దామ్యాంగ్‌. ఇప్పటి వరకు 22 దేశాల్లో 62 అబ్బుర పరిచే సంప్రదాయ వ్యవసాయ ప్రదేశాలకు ఎఫ్‌.ఎ.ఓ. ఇటువంటి విశిష్ట గుర్తింపును ప్రకటించింది. మొత్తానికి వెదురుతో ఆదాయం కోసం వనాలనే కాకుండా అమూల్యమైన ప్రకృతి వారసత్వ సంపదను కూడా అక్కడి రైతులు కలసికట్టుగా సృష్టించుకోవడం ప్రపంచం మెచ్చదగిన మంచి సంగతి.  

మరిన్ని వార్తలు