పెసరంత భక్తి

13 Apr, 2019 02:34 IST|Sakshi

రాములవారికి ఏ నైవేద్యం పెట్టినా స్వీకరిస్తాడు. అందులో భక్తి నింపితే చాలు. పెసరంత నైవేద్యానికి కొండంత అండగా ఉంటాడు.పండగరోజు పెసరలతో స్వామికి నైవేద్యం!మీకు ప్రసాదం!

వడ పప్పు
కావలసినవి: పెసర పప్పు – ఒక కప్పు; కొబ్బరి తురుము – 2 టేబుల్‌ స్పూన్లు; కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు; క్యారట్‌ తురుము – ఒక టేబుల్‌ స్పూను; పచ్చి మిర్చి తరుగు – 2 టీ స్పూన్లు; నిమ్మ రసం – 2 టీ స్పూన్లు; ఉప్పు – కొద్దిగా.
తయారీ:
►ముందుగా పెసరపప్పును సుమారు మూడు గంటల సేపు నానబెట్టి, నీళ్లు ఒంపేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి
►కొబ్బరి తురుము, కొత్తిమీర తరుగు, క్యారట్‌ తురుము, పచ్చి మిర్చి తరుగు, నిమ్మ రసం, ఉప్పు వేసి బాగా కలిపి, సుమారు అర గంట తరవాత తింటే రుచిగా ఉంటుంది.

పానకం
కావలసినవి: నీళ్లు – 4 కప్పులు; బెల్లం పొడి – రెండు కప్పులు; ఏలకుల పొడి – టీ స్పూను; మిరియాల పొడి – రెండు టీ స్పూన్లు.
తయారీ:
►ముందుగా ఒక పెద్ద పాత్రలో నీళ్లు, బెల్లం పొడి వేసి బెల్లం కరిగేవరకు బాగా కలపాలి
►ఏలకుల పొడి, మిరియాల పొడి జత చేసి మరోమారు కలపాలి
►గ్లాసులోకి తీసుకుని తాగాలి.

పెసర పప్పులడ్డు
కావలసినవి: పెసర పప్పు – ఒక కప్పు; బెల్లం పొడి – ఒక కప్పు; బియ్యం – అర కప్పు; మినప్పప్పు – ఒక కప్పు; నెయ్యి – 2 టీ స్పూన్లు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; ఉప్పు – చిటికెడు; ఎండు కొబ్బరి తురుము – అర కప్పు; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా.
తయారీ:
►ముందుగా ఒక పాత్రలో మినప్పప్పు, బియ్యం, ఉప్పు వేసి సుమారు నాలుగు గంటలు నానబెట్టాలి
►మిక్సీలో వేసి మెత్తగా దోసెల పిండి మాదిరిగా రుబ్బి పక్కన ఉంచాలి
►పెసర పప్పుకి తగినన్ని నీళ్లు జత చేసి సుమారు గంటసేపు నానబెట్టి, నీళ్లు ఒంపేయాలి
►బాణలి లో తగినన్ని నీళ్లు పోసి మరిగించాలి
►పెసరపప్పు జత చేసి ఉడికించి దింపేయాలి
►చల్లారాక, రంధ్రాలున్న గిన్నెలో పోసి నీళ్లు పోయేవరకు సుమారు ఐదు నిమిషాలు పక్కన ఉంచాలి
►నీరంతా పోయాక మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి
►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, బెల్లం పొడి, పావు కప్పు నీళ్లు పోసి తీగ పాకం వచ్చేవరకు కలుపుతుండాలి
►కొద్దిగా నెయ్యి వేసి బాగా కలిపి, ఉడికించి ఉంచుకున్న పెసర పప్పు ముద్ద వేసి కలిపి, గట్టి పడిన తరవాత దింపేయాలి
►కొద్దిగా చల్లారాక ఉండలుగా చేసి పక్కన ఉంచాలి
►బాణలిలో నూనె కాగాక, తయారుచేసి ఉంచుకున్న పెసర పూర్ణాలను మినప్పప్పు మిశ్రమం పిండిలో ముంచి బూరెల మాదిరి గా నూనెలో వేసి వేయించాలి
►దోరగా వేగిన తరవాత పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి
►కొద్దిగా చల్లారాక మధ్యకు చేసి, కాగిన నెయ్యి వేసి అందించాలి.

పెసర పాయసం
కావలసినవి: పెసర పప్పు – అర కప్పు; నీళ్లు – ఒక కప్పు; పల్చటి కొబ్బరి పాలు – అర కప్పు; బెల్లం పొడి – ముప్పావు కప్పు; చిక్కటి కొబ్బరి పాలు – ఒక కప్పు; కొబ్బరి నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; జీడిపప్పులు – 15; కిస్‌మిస్‌ – ఒక టేబుల్‌ స్పూను.
తయారీ:
►పెసర పప్పును శుభ్రంగా కడగాలి
►తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి ఐదారు విజిల్స్‌ వచ్చాక దింపేయాలి
►చల్లారాక మూత తీసి ఉడికిన పెసరపప్పును ఒక గిన్నెలోకి తీసుకోవాలి
►గరిటెతో మెత్తగా మెదపాలి ∙పల్చటి కొబ్బరి పాలు, నీళ్లు జత చేసి బాగా కలపాలి
►బెల్లం పొడి జత చేసి కరిగేవరకు కలుపుతుండాలి
►చిక్కటి కొబ్బరిపాలను జత చేసి, రెండు నిమిషాల తరవాత దింపేయాలి (ఎక్కువ సేపు ఉంచితే, పాలు విరిగిపోతాయి)
►స్టౌ మీద బాణలిలో కొబ్బరి నూనె కాగాక, జీడిపప్పులు, కిస్‌మిస్‌లు ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి
►ఉడికిన పాయసంలో వేయాలి
►ఏలకుల పొడి కూడా జత చేసి కలిపి దింపేయాలి.

పెసర పప్పుహల్వా
కావలసినవి: పెసర పప్పు – ఒక కప్పు; నెయ్యి – 10 టేబుల్‌ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; పిస్తా తరుగు – ఒక టేబుల్‌ స్పూను (అన్‌సాల్టెడ్‌); కిస్‌మిస్‌ – ఒక టేబుల్‌ స్పూను; చిక్కటి పాలు – ఒక కప్పు; నీళ్లు – 2 కప్పులు; పంచదార – ఒకటిన్నర కప్పులకు కొద్దిగా తక్కువ.
తయారీ:
►పెసరపప్పుకు తగినన్ని నీళ్లు జత చేసి, సుమారు ఐదు గంటల సేపు నానబెట్టాక నీళ్లు ఒంపేసి, గ్రైండర్‌లో వేసి, తగినన్ని నీళ్లు జత చేస్తూ మెత్తగా చేయాలి
►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కాగాక మెత్తగా రుబ్బుకున్న పెసరపిండిని అందులో వేసి ఆపకుండా సన్నటి మంట మీద కలుపుతుండాలి
►బాగా ఉడికి, బాణలి నుంచి విడివడేవరకు కలుపుతుండాలి
►ఈలోగా మరొక బాణలి స్టౌ మీద ఉంచి పాలు, నీళ్లు, పంచదార వేసి ఉడికించాలి
►పెసర పిండి మిశ్రమం కొద్దిగా రంగు మారుతుండగా, పంచదార  పాలు మిశ్రమాన్ని జతచేసి కలియబెట్టాలి
►నెయ్యి వేరుపడే వరకు కలపాలి
►ఏలకుల పొడి, పిస్తా తరుగు, కిస్‌మిస్‌ జత చేసి కలియబెట్టాలి
►హల్వాను వేడిగానే అందించాలి.

పెసర పప్పు బూరెలు
కావలసినవి: పెసర పప్పు – ఒక కప్పు; పంచదార – అర కప్పు; నెయ్యి – పావు కప్పు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; డ్రై ఫ్రూట్స్‌ – పావు కప్పు (జీడి పప్పు, బాదం పప్పులు, పిస్తాలు...)
తయారీ:
►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక పెసర పప్పు వేసి దోరగా అయ్యేవరకు వేయించి, ఒక ప్లేటులోకి తీసుకోవాలి
►చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పిండిలా అయ్యేలా గ్రైండ్‌ చేయాలి
►పిండిని జల్లించాలి ∙అదే మిక్సీలో పంచదార, ఏలకుల పొడి వేసి మెత్తగా చేయాలి
►ఒక పాత్రలో పెసర పిండి, పంచదార పొడి వేసి రెండూ కలిసేలా కలపాలి  డ్రైఫ్రూట్స్‌ జత చేయాలి
►కరిగించిన నేతిని కొద్దికొద్దిగా జత చేస్తూ ఉండలు కట్టుకోవాలి
 ►బాగా చల్లారాక గాలి చొరని డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి.

పెసర పప్పు ఫ్రై
కావలసినవి: పెసర పప్పు – ఒక కప్పు; నీళ్లు – రెండున్నర కప్పులు; పసుపు – చిటికెడు.
పోపు కోసం: ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి – 3 (నిలువుగా మధ్యకు తరగాలి); ఎండు మిర్చి – ఒకటి; అల్లం తురుము – పావు టీ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 4; జీలకర్ర – ఒక టీ స్పూను; ఇంగువ – చిటికెడు; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; గరం మసాలా – పావు టీ స్పూను; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్‌ స్పూను; కసూరీ మేథీ – అర టీ స్పూను; నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; బటర్‌ – అర టేబుల్‌ స్పూను
తయారీ:
►పెసర పప్పును ఒక గిన్నెలో వేసి తగినన్ని నీళ్లు జత చేసి శుభ్రంగా కడగాలి
►తగినన్ని నీళ్లు, పసుపు జత చేసి కుకర్‌లో ఉంచి నాలుగు విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించి దింపేయాలి
►చల్లారాక గరిటెతో మెత్తగా మెదపాలి
►అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు జత చేసి, స్టౌ మీద సన్నని మంట మీద ఉంచాలి
►చిన్న బాణలిలో నూనె లేదా బటర్‌ వేసి కరిగాక, జీలకర్ర వేసి వేయించాలి
►ఉల్లి తరుగు జత చేసి మరోమారు వేయించాక, అల్లం తురుము, వెల్లుల్లి రెబ్బలు, పచ్చి మిర్చి తరుగు, ఎండు మిర్చి వేసి వేయించాలి
►టొమాటో తరుగు జత చేసి ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి
►మిరప కారం, గరం మసాలా, ఇంగువ, కసూరీ మేథీ, కొత్తిమీర జత చేయాలి
►బాగా ఉడికేవరకు వేయించాలి
►తడ్కా మిశ్రమం జత చేసి మరోమారు కలిపి, రెండు నిమిషాల తరవాత దింపేయాలి.

పెసర పప్పుతడ్కా
కావలసినవి: పెసర పప్పు – ముప్పావు కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; అల్లం తురుము – ఒక టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; నీళ్లు – 3 కప్పులు; ఉప్పు – తగినంత
పోపు కోసం: జీలకర్ర – ఒక టీ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 5; గరం మసాలా పొడి – పావు టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; తరిగిన పచ్చిమిర్చి – 2; ఇంగువ – కొద్దిగా; నెయ్యి లేదా నూనె – 3 టేబుల్‌ స్పూన్లు; కొత్తిమీర – కొద్దిగా
తయారీ:
►స్టౌ మీద కుకర్‌లో కొద్దిగా నూనె వేసి కాగాక, ఉల్లి తరుగు, టొమాటో తరుగు, అల్లం తురుము వేసి కలుపుకోవాలి
►పసుపు, మిరపకారం, నీళ్లు జత చేసి బాగా కలపాలి
►పెసర పప్పు వేసి కలియబెట్టి మూత పెట్టాలి
►నాలుగు విజిల్స్‌ వచ్చాక దింపేయాలి
►ఉప్పు జత చేసి కలియబెట్టాలి
►స్టౌ మీద చిన్న బాణలిలో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి కాగాక జీలకర్ర వేసి వేయించాలి
►వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చి మిర్చి జత చేసి కలిపి దింపేయాలి
►గరం మసాలా, మిరప కారం, ఇంగువ జత చేసి బాగా కలిపి, ఉడికిన తడ్కా మీద వేసి కలపాలి
►కొత్తిమీరతో అలంకరించాలి
►అన్నం, చపాతీలలోకి రుచిగా ఉంటుంది.

పెసర సలాడ్‌
కావలసినవి: పెసలు – రెండు కప్పులు; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి – 1 (సన్నగా తరగాలి); మిరప కారం – పావు టీ స్పూను; చాట్‌ మసాలా – అర టీ స్పూను; నిమ్మ రసం – ఒక టీ స్పూను; ఉడికించిన బంగాళ దుంప – ఒకటి (తొక్క తీసి సన్నగా తరగాలి); కొత్తిమీర – కొద్దిగా; 
తయారీ:
►ముందు రోజు రాత్రి పెసలు నానబెట్టి, మరుసటి రోజు ఉదయం నీరు ఒంపేసి, పక్కన ఉంచాలి
►ఆ మరుసటి రోజు ఉదయానికి మొలకలు వస్తాయి
►మొలకలు వచ్చిన పెసలను ఉపయోగించాలి.
తయారీ:  
►మొలకలు వచ్చిన పెసలకు తగినన్ని నీళ్లు జతచేసి ఉడికించి, నీళ్లు ఒంపేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి
►ఉల్లితరుగు, టొమాటో తరుగు జత చేయాలి
►పచ్చి మిర్చి తరుగు, బంగాళదుంప తరుగు జత చే సి కలియబెట్టాలి
►పావు మిరపకారం, చాట్‌ మసాలా జతచేశాక, ఉప్పు, నిమ్మ రసం వేసి, బాగా కలపాలి
►కొత్తిమీరతో అలంకరించి, వెంటనే అందించాలి. 

పెసర కిచిడీ
కావలసినవి: పెసర పప్పు – అర కప్పు; బియ్యం – అర కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; అల్లం తురుము – ఒక టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – ఒకటి; జీలకర్ర – ఒక టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఇంగువ – చిటికెడు; నీళ్లు – మూడున్నర కప్పులు; నూనె లేదా నెయ్యి – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – తగినంత.
తయారీ:
►ఒక పాత్రలో పెసర పప్పు,  బియ్యం వేసి తగినన్ని నీళ్లు జత చేసి శుభ్రంగా కడగాలి
►మంచి నీళ్లు జత చేసి సుమారు అరగంటసేపు నానబెట్టాలి
►స్టౌ మీద కుకర్‌ ఉంచి, వేడయ్యాక నెయ్యి వేసి కాగాక జీలకర్ర వేసి చిటపటలాడేవరకు వేయించాలి
►ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి
►టొమాటో తరుగు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము జత చేసి వేయించాలి
►పసుపు, ఇంగువ జత చేసి టొమాటోలు మెత్తపడే వరకు వేయించాలి
►నానబెట్టుకున్న పెసర పప్పు, బియ్యం మిశ్రమంలోని నీటిని తీసేసి, బియ్యం మిశ్రమాన్ని కుకర్‌లో వేసి బాగా కలపాలి
►తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి కుకర్‌ మూత పెట్టాలి
►ఆరేడు విజిల్స్‌ వచ్చాక దింపేయాలి
►మిశ్రమం మరీ ముద్దగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు జత చేయాలి
►కిచిడీ మీద నెయ్యి వేసి వేడివేడిగా అందిస్తే రుచిగా ఉంటుంది
►పెరుగు, సలాడ్‌లతో తినొచ్చు.

పెసర పప్పు కచోరీ
కావలసినవి: మైదా పిండి – 2 కప్పులు; ఉప్పు – తగినంత; నెయ్యి లేదా నూనె – పావు కప్పు; నీళ్లు – తగినన్ని
కచోరీ స్టఫింగ్‌ కోసం: పెసర పప్పు – అర కప్పు; నెయ్యి – అర టేబుల్‌ స్పూను; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – అర టీ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; శొంఠి పొడి – అర టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; సోంపు పొడి – ఒక టీ స్పూను; ఆమ్‌చూర్‌ పొడి – ఒక టీ స్పూను; నూనె – డీప్‌ ఫ్రై చేయడానికి తగినంత
తయారీ:
►ఒక పాత్రలో మైదా పిండి, ఉప్పు వేసి కలపాలి
►పావు కప్పు నెయ్యి జత చేయాలి
►తగినన్ని నీళ్లు జత చేసి చపాతీ పిండిలా కలపాలి
►తడి వస్త్రం మూత వేసి గంట సేపు పక్కన ఉంచాలి
►పెసర పప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి రెండు గంటలపాటు నానబెట్టాలి
►నీళ్లు ఒంపేసి, పెసర పప్పును మిక్సీలో వేసి మెత్తగా కాకుండా కొద్దిగా రవ్వలా ఉండేలా మిక్సీ పట్టాలి
►స్టౌ మీద బాణలిలో నెయ్యి కాగాక మిరప కారం, ఆమ్‌చూర్‌ పొడి వంటి మసాలా దినుసులు జత చేసి దోరగా వేయించాలి
►రవ్వలా మిక్సీ పట్టిన పెసర పప్పు, ఉప్పు, ఇంగువ జత చేసి మూడునాలుగు నిమిషాలు ఆపకుండా కలియబెట్టి, దింపి చల్లార్చాలి
►చేతికి కొద్దిగా నూనె పూసుకుని, పిండిని తగు పరిమాణంలో చేతిలోకి తీసుకుని, ఉండలు చేసి పక్కన ఉంచాలి
►కలిపి ఉంచుకున్న మైదాపిండిని మరోమారు బాగా కలపాలి
►పిండిని పొడవుగా గుండ్రంగా ఒత్తి, సమాన భాగాలుగా కట్‌ చేయాలి
►ఒక్కో ఉండను చపాతీకర్రతో కొద్దిగా పల్చగా ఒత్తాలి
►పెసరపప్పు మిశ్రమాన్ని కొద్దిగా ఉంచి అంచులు మూసేసి, (మరీ పల్చగాను, మరీ మందంగాను కాకుండా చూసుకోవాలి)
►మరోమారు ఒత్తాలి (పల్చటి వస్త్రం పైన వేసి ఉంచాలి. లేదంటే ఎండిపోతాయి)
►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఒత్తి ఉంచుకున్న కచోరీలను వేసి, దోరగా వేయించాలి
►కొద్దిగా పొంగుతుండగా, జాగ్రత్తగా వెనుకకు తిప్పాలి
►బంగారు వర్ణంలోకి వచ్చాక పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి
►గ్రీన్‌ చట్నీ లేదా స్వీట్‌ చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.

పెసరపప్పు ఢోక్లా
కావలసినవి: పెసర పప్పు – ఒక కప్పు; అల్లం + పచ్చి మిర్చి ముద్ద – టేబుల్‌ స్పూను; నీళ్లు – అర కప్పు; కొత్తిమీర ఆకులు – టేబుల్‌ స్పూను; నూనె – ఒక టేబుల్‌ స్పూను; నిమ్మ రసం – ఒక టేబుల్‌ స్పూను; ఉప్పు – తగినంత; నిమ్మ ఉప్పు – టీ స్పూను.
పోపు కోసం: నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; ఇంగువ – చిటికెడు; వేయించిన నువ్వులు – టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు
గార్నిషింగ్‌ కోసం: కొత్తిమీర తరుగు – పావు కప్పు; పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు
తయారీ:
►పెసరపప్పుకి తగినన్ని నీళ్లు జతచేసి రెండుమూడు సార్లు బాగా కడిగి, నాలుగు గంటల పాటు నానబెట్టి, నీళ్లు ఒంపేయాలి
►కొత్తిమీర, అరకప్పు నీళ్లు జత చేసి, మిక్సీలో వేసి కొద్దిగా పలుకులా ఉండేలా మిక్సీ పట్టాలి (మరీ ముద్దలా అవ్వకూడదు. మరీ పల్చగాను, మరీ గట్టిగానూ కూడా ఉండకూడదు)
►ఒక పాత్రలో రెండున్నర కప్పుల నీళ్లు పోసి, మరిగించాలి
►వెడల్పాటి పళ్లానికి కొద్దిగా నూనె పూసి పక్కన ఉంచాలి
►ఒక పాత్రలో అల్లం + పచ్చిమిర్చి ముద్ద, నూనె, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలిపి, తయారుచేసి ఉంచుకున్న పెసర పిండి మిశ్రమాన్ని జత చేయాలి
►చివరగా నిమ్మ ఉప్పు జత చేసి బాగా కలిపి, నూనె పూసిన పాత్రలో పోసి సమానంగా పరవాలి
►స్టౌ మీద మరుగుతున్న నీళ్ల పాత్రలో ఈ పళ్లెం ఉంచి, మూత పెట్టి, సుమారు పావు గంట తరవాత దింపేయాలి
►బాగా చల్లారాక బయటకు తీయాలి
►చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి
►నువ్వులు జత చేసి మరోమారు కలియబెట్టాలి
►ఇంగువ, కరివేపాకు వేసి వేయించి బాగా కలపాలి
►రెండు టేబుల్‌ స్పూన్ల నీళ్లు జత చేసి పోపు మిశ్రమాన్ని బాగా కలపాలి
►ఈ మిశ్రమాన్ని తయారు చేసి ఉంచుకున్న ఢోక్లా మీద వేయాలి
►కొత్తిమీర, కొబ్బరి తురుములతో అలంకరించి అందించాలి.

పానకం– వడపప్పు ప్రాముఖ్యత ఏమిటి? 
శ్రీరామ నవమి రోజున అందరిళ్లలోనూ పానకం–వడపప్పు తయారు చేసి మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనుక ప్రాకృతిక పరమార్థం దాగి ఉంది. ఇది ఎండాకాలం. కాబట్టి పానకాన్ని, వడపప్పును ప్రసాదరూపంలో సేవించడం వల్ల ఆరోగ్యం, ఆయుష్యాభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద శాస్త్రజ్ఞుల అభిప్రాయం. మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా, దేహారోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. వడపప్పు – పానకం కూడా అంతే. శరదృతువు, వసంత రుతువులు యముడి కోరల్లాంటివని దేవీభాగవతం చెబుతోంది. ఈ రుతువులో వచ్చే గొంతువ్యాధులకు... పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని లౌకికంగా చెబుతారు. పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైనదని చెబుతారు. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును ‘వడ’పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో ‘వడ’ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. అందుకే పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది. బాగా జ్వరంతో బాధపడి తిరిగి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వారికి పెద్దలు పెసరపప్పుతో చేసిన కట్టు, పెసరపప్పు కలిపి వండిన పులగం వంటి వాటిని తినిపిస్తారు. ఎందుకంటే పెసరపప్పు తేలికగా అరుగుతుంది. శరీరం కోల్పోయిన బలాన్ని, సత్తువను తిరిగి తెస్తుంది. వేసవి కాలంలో వడపప్పును తినడం వంటికి చలువ చేస్తుంది. అలాగే తియ తియ్యటి బెల్లం పానకాన్ని సేవించడం వల్ల ఎండలను ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా