భిన్నత్వంలో ఏకత్వసాధన దత్తారాధన

4 Dec, 2014 23:21 IST|Sakshi
భిన్నత్వంలో ఏకత్వసాధన దత్తారాధన

పరమ దయామూర్తి, మహా యోగీశ్వరుడు, భక్తవత్సలుడు, నోరారా పిలిస్తేనే పలికే దైవం దత్తాత్రేయుడు. మార్గశిర పూర్ణిమనాడు త్రిమూర్తుల అంశతో అత్రి, అనసూయ దంపతులకు దత్తాత్రేయుడు పుత్రుడుగా పుట్టాడు. ఈ పర్వదినాన్నే దత్తజయంతిగా జరుపుకోవడం అనాదిగా వ స్తున్న ఆచారం. గురు సంప్రదాయంలో దత్తాత్రేయుడిది ప్రత్యేక స్థానం. దత్తోపాసన అన్ని ఉపాసనల కంటె తేలికైనదని, శీఘ్రంగా ఫలితాన్ని ప్రసాదించేదనీ ప్రతీతి. ధర్మస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు అయిన దత్తాత్రేయుడు సద్గురువులందరిలోనూ అంతర్లీనంగా ఉండి, వారి చేత శిష్యులకు జ్ఞానబోధ చేయిస్తుంటాడని, వారిని మంచి మార్గంలో పెట్టేలా చేస్తాడని దత్తసంప్రదాయం చెబుతోంది. అన్ని సాధనలను ఏకం చేసి, తనలో కలుపుకోవడమే ఈ అవతార పరమార్థమని దత్త చరిత్ర చెబుతోంది. కృతయుగంలో ప్రహ్లాదుడు, త్రేతాయుగంలో అలర్కుడు, ద్వాపరయుగంలో పరశురాముడు, కార్తవీర్యార్జునుడు తదితరులు, కలియుగంలో అసంఖ్యాకమైన వారు దత్తుడిని ఆరాధించి, ఆయన నుంచి యోగవిద్యను, ఆధ్యాత్మిక విద్యను పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. భక్తుల పాలిట కామధేనువైన దత్తాత్రేయుడు కేవలం స్మరిస్తే చాలు ప్రసన్నుడవుతాడని శాస్త్రవచనం.

దత్తజయంతి రోజున దత్తారాధన, దత్తస్మరణ, గురుచరిత్ర పారాయణ, గురుగీత పారాయణ చేయడం, శునకాలకు, ఇతర జీవులకు రొట్టెలు తినిపించడం, గురువులను పూజించడం, సన్మానించడం సత్ఫలితాలనిస్తుందని దత్తసంప్రదాయం చెబుతోంది. మాణిక్ ప్రభు, గజానన్ మహరాజ్, శ్రీపాద శ్రీవల్లభులవారు, శిరిడీ సాయి బాబా, సత్యసాయిబాబా దత్తుని అంశావతారాలేనని భక్తుల విశ్వాసం.
 దత్తజయంతి సందర్భంగా దత్తక్షేత్రాలైన పిఠాపురంలోనూ, గానుగాపురంలోనూ విశేష పూజలు జరుగుతాయి. స్వామిని నోరారా శ్రీగురుదత్త- జయగురుదత్త అని కానీ, శ్రీ దత్త శ్శరణం మమ అని కానీ, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని కానీ స్మరించుకుంటూ ఉంటే చాలా మంచిది. నియమ నిష్ఠలతో రోజుకు తొమ్మిదిమార్ల చొప్పున 21 రోజుల పాటు దత్తస్తవాన్ని దీక్షగా పఠిస్తూ, తీపిపదార్థాలను నివేదిస్తూ, సాధు సన్యాసులకు భిక్షపెడుతూ ఉంటే కోరిన కోర్కెలు నెరవేరతాయని ప్రతీతి.
 (డిసెంబర్ 6, శనివారం దత్తజయంతి)
 
 

మరిన్ని వార్తలు