బ్రిటన్‌లో సరస్వతీ పుత్రికల శకం!

19 Aug, 2014 23:21 IST|Sakshi
బ్రిటన్‌లో సరస్వతీ పుత్రికల శకం!

బ్రిటన్‌లో చదువు విషయంలో అమ్మాయిలు దూసుకుపోతున్నారు. అబ్బాయిలతో పోటీ పడటం కాదు.. అబ్బాయిలను ఓడించి, అందనంత వేగంగా దూసుకుపోతున్నారు. అక్కడి యూనివర్సిటీల్లోని విద్యార్థినీ విద్యార్థుల సంఖ్యను బట్టి చూస్తే... ప్రస్తుతం అక్కడ సరస్వతీ పుత్రికల శకం నడుస్తోందని చెప్పవచ్చు. ప్రత్యేకించి పై చదువుల విషయంలో అమ్మాయిల హవా స్పష్టంగా కనిపిస్తోంది.

గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ల కోసం యూనివర్సిటీల్లో స్థానం సీట్లు సంపాదిస్తున్న వాళ్లలో, ఆ ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వాళ్లలో అమ్మాయిల శాతం చాలా ఎక్కువ ఉంటుంది. ప్రస్తుత విద్యాసంవత్సరం లెక్కల ప్రకారం చూస్తే.. బ్రిటన్‌లోని టాప్ రేటెడ్ యూనివర్సిటీల్లో మొత్తం 4,12,170 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వీరిలో 2,32,250 మంది అమ్మాయిలు ఉండగా, అబ్బాయిల సంఖ్య 1,79, 920 మంది మాత్రమే. తేడా దాదాపు 50 వేల మందిపైనే! ఈ ఏడాదికే కాదు.. గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి పరిస్థితే ఉంది.

ప్రతియేటా గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బయటకు వస్తున్న వాళ్లలో అమ్మాయిల సంఖ్య 50 నుంచి 60 వేలు ఎక్కువగా ఉంటోంది. దీంతో క్లాసురూముల్లో అబ్బాయిలు మైనారిటీలు అయిపోయారు. అమ్మాయిలు మెజారిటీలు అయిపోయారు. మహిళా సాధికారతలో ఇది మరో ముందడుగు అనే అభిప్రాయం వినిపిస్తోందిప్పుడు. అమ్మాయిల్లో చదువు మీద పెరిగిన ఆసక్తికి.. వారి పట్టుదలకు ఇది నిదర్శనమని అంటున్నారు స్థానిక విద్యావేత్తలు, మహిళా హక్కుల ఉద్యమకారిణులు. నిజంగా ఇది మంచి పరిణామం కదా!
 

మరిన్ని వార్తలు