పండక్కి ఏదైనా కొత్తగా వండాలి అనుకుంటే..

26 Oct, 2019 14:55 IST|Sakshi

తీపి ఉన్న చోట దీప్తి ఉంటుంది. తియ్యదనం ఉన్న జీవితం మరొకరి జీవితంలో వెలుతురు పంచమంటుంది. చీకటిని తరిమికొట్టడానికి వెలిగించిన దీపంలో మిఠాయి రుచి నింపుకుంటుంది. 
ఇంటి ముందర దీపాలు, మనసులో అనుబంధాలు వెలిగే పండగ దీపావళి నోరు తీపి చేసుకోండి. నలుగురికీ పంచి బంధాల్ని కూడా తీపి చేసుకోండి. 

డ్రైఫ్రూట్‌ సున్నుండలు 

కావలసిన పదార్థాలు: మినప్పప్పు – 1/2 కప్పు; బాదం పప్పులు  – 1/4 కప్పు; జీడిపప్పు – 1/4 కప్పు; తరిగిన పిస్తా – 1/4 కప్పు; బెల్లం – 3/4 కప్పు; నెయ్యి – 1/3 కప్పు.

తయారీ విధానం: ∙జీడిపప్పు, బాదం పప్పులను విడివిడిగా వేయించుకొని బరకగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ∙మినప్పప్పుని తక్కువ మంట మీద ఎర్రగా పచ్చి వాసన పోయేలా వేయించి చల్లార్చాలి ∙చల్లారిన మినప్పప్పుని కొద్దిగా బరకగా పొడి చేసి అందులోనే బెల్లం కూడా వేసి మరోసారి గ్రైండ్‌ చేయాలి ∙పొడి చేసుకున్న జీడిపప్పు, బాదం, మినప్పప్పు మిశ్రమాలను, తరిగిన పిస్తా పప్పులను ఒక గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి   ∙వేడి నెయ్యి కొద్ది  కొద్దిగా వేస్తూ గరిటెతో కలుపుకోవాలి  ∙మిశ్రమం వెచ్చగా వున్నప్పుడే ఉండలు చేసుకుంటే డ్రైఫ్రూట్‌ సున్నుండలు రెడీ. 

► కోవా–రవ్వ బర్ఫీ

కావలసిన పదార్థాలు: పచ్చి కోవా –1/2 కప్పు; బొంబాయి రవ్వ – 1/2 కప్పు; పాలు – 1/2 కప్పు; పంచదార  – 1/2 కప్పు; నెయ్యి – 1/4 కప్పు; కుంకుమ పువ్వు – చిటికెడు; ఏలకుల పొడి – 1/2 టీస్పూన్‌.

తయారీ విధానం: ∙కుంకుమ పువ్వుని రెండు స్పూన్ల వేడి పాలలో నానబెట్టుకోవాలి ∙నెయ్యి వేడి చేసి అందులో రవ్వ వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ∙అదే మూకుడులో కోవా, పాలు పోసి కోవా కరిగే వరకు కలియబెట్టాలి ∙దీనిలో చక్కెర కూడా వేసి కరిగేవరకు తిప్పాలి ∙ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ, నానబెట్టిన కుంకుమ పువ్వు, ఏలకుల పొడి జత చేసి, మిశ్రమం దగ్గర పడేవరకు కలపాలి ∙మిశ్రమం అంచులు విడుస్తున్నప్పుడు పొయ్యి కట్టేసి, నెయ్యి రాసిన పళ్లెంలో పోసుకోవాలి ∙తరిగిన పిస్తా పప్పులను పైన వేసి సిల్వర్‌ ఫాయిల్‌తో అలంకరించుకోవాలి ∙కొద్దిగా చల్లారాక ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.

 కొబ్బరి –మిల్క్‌ మెయిడ్‌ హల్వా 

కావలసిన పదార్థాలు: తురిమిన పచ్చి కొబ్బరి – 1 కప్పు; నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్లు; పాలు – 1/4 కప్పు; కండెన్సెడ్‌ మిల్క్‌ (మిల్క్‌ మెయిడ్‌ ) – 1/2 కప్పు; ఏలకుల పొడి – 1/4 టీస్పూన్‌; పిస్తా – తగినంత.

తయారీ విధానం: ∙బాణలిలో నెయ్యి వేసి స్టౌ మీద ఉంచి, కరిగాక, తురిమిన కొబ్బరి వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి ∙ పాలు, మిల్క్‌ మెయిడ్‌ వేసి బాగా కలిపి దగ్గర పడేవరకు తిప్పుతూ ఉడికించాలి ∙  కొబ్బరి మిశ్రమం దగ్గర పడ్డాక ఏలకుల పొడి వేసి దింపేయాలి ∙ తగినన్ని పిస్తా పప్పులను పైన చల్లి సర్వ్‌ చేయాలి.

► వాల్నట్‌ హల్వా 

కావలసిన పదార్థాలు: వాల్నట్స్‌ – 1 కప్పు; పాలు – 1/2 కప్పు; పంచదార – 1/2 కప్పు; నెయ్యి – 4 టేబుల్‌ స్పూన్లు; కుంకుమ పువ్వు – చిటికెడు; సిల్వర్‌ ఫాయిల్‌ – గార్నిషింగ్‌ కోసం.

తయారీ విధానం: వాల్నట్స్‌ని బరకగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ∙ఒక గిన్నెలో పాలు, పంచదార, కుంకుమ పువ్వు వేసి పంచదార కరిగి ఒక పొంగు వచ్చే వరకు వేడి చేసి, దించి పక్కన పెట్టుకోవాలి ∙ఒక మూకుడులో మూడు టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేడి చేసి, పొడి చేసుకున్న వాల్నట్స్‌ని వేసి, తక్కువ మంట మీద బంగారు రంగులోకి వచ్చేవరకు  వేయించాలి ∙వేగాక దీనిలో పాల మిశ్రమం పోసి, రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ∙మరో టేబుల్‌ స్పూన్‌ నెయ్యి కూడా వేసి కొద్దిసేపు బాగా కలుపుతూ అంచులు విడిచే వరకు ఉడికించుకోవాలి ∙నెయ్యి రాసిన పళ్ళెంలో పోసి చల్లారనివ్వాలి (హల్వా చల్లారాక ఇంకా గట్టి పడుతుంది) ∙పైన సిల్వర్‌ ఫాయిల్‌ అద్ది, ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. 

 బ్రెడ్‌కాజా 

కావలసిన పదార్థాలు: బ్రెడ్‌ స్లైసెస్‌ – 6; పంచదార – 1/2 కప్పు; నీళ్లు – 1/4 కప్పు  ; ఏలకుల పొడి – చిటికెడు; తరిగిన పిస్తా, బాదం – తగినంత; నూనె – వేయించటానికి సరిపడా.

తయారీ విధానం: ∙బ్రెడ్‌ స్లైసెస్‌ అంచులు తీసేసి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి ∙వేయించటానికి సరిపడా నూనె బాణలిలో వేసి, వేడి చేసి, కట్‌ చేసిన బ్రెడ్‌ ముక్కలను దోరగా వేయించుకోవాలి ∙ వేయించిన ముక్కలను కిచెన్‌ పేపర్‌ మీదకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ∙ఒక గిన్నెలో పంచదార, నీళ్లు వేసి కలియబెట్టి, స్టౌ మీద ఉంచి, తీగ పాకం వచ్చేవరకు కలుపుతుండాలి ∙ ఏలకుల పొడి జత చేసి, ఒకసారి కలియబెట్టి, స్టౌ మీద నుంచి దించేయాలి ∙ వేయించిన బ్రెడ్‌ ముక్కలను పాకంలో వేసి, కొన్ని క్షణాల వరకు పాకంలో ముంచి తీసేయాలి ∙పాకంలో ముంచి తీసిన బ్రెడ్‌ ముక్కలను పళ్లెంలో పరుచుకొని, అవి తడిగా వున్నప్పుడే, తరిగిన పిస్తా పప్పులను, బాదం పప్పులను పైన చల్లుకోవాలి ∙ పూర్తిగా తడి ఆరిన తరవాత సర్వ్‌ చేయాలి.

  గర్‌ మఖానా

కావలసిన పదార్థాలు: పూల్‌ మఖానా – 1 కప్పు; బెల్లం – 1/4 కప్పు; నెయ్యి  – 2 టీస్పూన్లు.

తయారీ విధానం: ∙మూకుడులో ఒక స్పూన్‌ నెయ్యి వేసి మఖానాలను తక్కువ మంట మీద కరకరలాడే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి ∙నాన్‌ స్టిక్‌ పాన్‌లో ఒక స్పూన్‌ నెయ్యి, బెల్లం వేసి, బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలి ∙బెల్లం కరిగాక వేయించి పెట్టుకున్న మఖానా కూడా వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి ∙నెయ్యి రాసి పెట్టుకున్న పళ్లెంలోకి తీసుకొని కొద్దిగా చల్లారాక విడివిడిగా అయ్యేలా  చేసుకోవాలి.

 మఖ్ఖన్‌ పేడా

కావలసిన పదార్థాలు: పచ్చి కోవా – 1/2 కప్పు; మైదా పిండి – 1 కప్పు; పంచదార – 2 కప్పులు; డ్రై ఫ్రూట్‌ ముక్కలు – 4 టేబుల్‌ స్పూన్లు (బాదం, జీడిపప్పు, పిస్తా, కిస్మిస్‌); నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్లు; వంట సోడా – 1/4 టీ స్పూను; ఏలకుల పొడి – 1/2 టీ స్పూన్‌; నూనె – వేయించటానికి సరిపడా.

తయారీ విధానం: ∙ఒక గిన్నెలో కోవా, మైదా పిండి, వంట సోడా, నెయ్యి వేసి, బాగా కలిసేలా కలుపుకోవాలి ∙కొద్దిగా నీళ్లు చల్లి పిండి మృదువుగా కలుపుకోవాలి (పిండిని ఎక్కువగా మర్దనా చేయకూడదు) ∙మూతపెట్టి 15 నిమిషాలు నాననివ్వాలి ∙ఒక గిన్నెలో చక్కెర, రెండు కప్పుల నీళ్లు పోసి కరగనివ్వాలి ∙పంచదార కరిగి కొద్దిగా మరిగాక, ఏలకుల పొడి వేసి మరో 5 నిమిషాలు ఉంచి దించేయాలి ∙కలిపి పెట్టుకున్న పిండిని ఉండలు చేసి, ఒక్కొక్క ఉండను కొద్దిగా చేతితో ఒత్తి మధ్యలో డ్రై ఫ్రూట్‌ ముక్కలను స్టఫ్‌ చేసి, అంచులను మూసి, చేతితో కొద్దిగా ఒత్తి పక్కన పెట్టుకోవాలి ∙ఒత్తి పెట్టుకున్న పిండి ముద్దలను వేడి నూనెలో వేసి తక్కువ మంట మీద దోరగా వేయించాలి ∙వేగిన వాటిని వేడి పాకంలో వేసి రెండు గంటలు
నానిన తరవాత తినాలి.

  బెల్లం గవ్వలు 

కావలసిన పదార్థాలు: మైదా పిండి – 1 కప్పు; బెల్లం – 1 కప్పు; నెయ్యి – 3 టేబుల్‌ స్పూన్లు; వంట సోడా – చిటికెడు.

తయారీ విధానం: ∙ఒక గిన్నెలో మైదా పిండి, నెయ్యి, వంట సోడా వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి ∙చిన్న చిన్న ఉండలుగా చేసి గవ్వల పీట మీద గవ్వల ఆకారంలో వత్తుకోవాలి ∙ఆరిపోకుండా మూత పెట్టి ఉంచుకోవాలి ∙బాణలిలో నూనె పోసి, వేడి చేసి, అందులో గవ్వలను వేసి, దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి ∙ఒక గిన్నెలో బెల్లం వేసి, మునిగే వరకు నీరు పోసి, స్టౌ మీద ఉంచి, ఉండ పాకం వచ్చేవరకు ఉడికించుకోవాలి ∙బెల్లం పాకం వచ్చాక, పొయ్యి కట్టేసి, వేయించి పెట్టుకున్న గవ్వలను పాకంలో వేసి బాగా కలుపుకోవాలి ∙నెయ్యి రాసిన పళ్లెంలోకి మార్చువాలి ∙చల్లారాక గవ్వలు విడివిడిగా వస్తాయి.

మరిన్ని వార్తలు