పార్టీకి కొత్త ఫ్రెండ్స్‌

4 Jan, 2020 01:32 IST|Sakshi

రెండు  విషయాలు

రేపు దీపికా పడుకోన్‌ పుట్టినరోజు. 33 వెళ్లి 34 వస్తుంది. లక్నోలోని ఒక కేఫ్‌లో కేక్‌ కట్‌ చేసి, క్యాడిల్స్‌ ఊదబోతున్నారు. పక్కన ముంబై ప్రముఖులెవ్వరూ ఉండరు. ఆమె స్నేహితులూ ఉండరు. అందరికన్నా ముఖ్యమైన భర్త రణ్ వీర్‌సింగ్ సింగ్‌ కూడా ఉంటే ఉంటారు. లేదంటే లేదు. మరి ఎవరూ లేకుండా దీపిక ఒక్కరే ఏకాంతంగా ఏ దీవిలోనో గడిపినట్లుగా పుట్టినరోజు జరుపుకుని ముంబై తిరిగి వచ్చేస్తారా? కాదు... కాదు.. స్నేహితులకన్నా, ముంబై ప్రముఖుల కన్నా తనకు ఎక్కువ అని దీపిక భావిస్తున్నవారు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచీ ఆమె పుట్టిన రోజుకు లక్నో చేరుకుంటున్నారు. వాళ్లంతా యాసిడ్‌ దాడుల నుంచి బతికి బట్టకట్టినవాళ్లు! కృంగిపోకుండా స్వయం కృషితో జీవితాన్ని నిలబెట్టుకున్నవారు.

ఇక ఆ లక్నో కేఫ్‌ కూడా ఆసిడ్‌ సర్వైవర్‌లు నడుపుతున్నదే! ‘ఛపాక్‌’ డైరెక్టర్‌ మేఘనా గుల్జార్‌ కూడా రేపు అక్కడ దర్శనం ఇవ్వొచ్చు. ‘ఛపాక్‌’ చిత్రం ఈ నెల 10న విడుదల అవుతోంది. 5 నే దీపిక బర్త్‌డేకి విడుదల చేద్దాం అనుకున్నారు కానీ.. సాధారణంగా ఆదివారాలు సినిమాలు విడుదల కావు. అందుకే చలనచిత్ర సంప్రదాయం ప్రకారం శుక్రవారం రిలీజ్‌ చేస్తున్నారు. యాసిడ్‌ బాధితుల స్ఫూర్తిదాయకమైన జీనన పోరాటమే ‘ఛపాక్‌’ స్టోరీ. సినిమా ప్రమోషన్‌ కోసం దీపిక జరుపుకుంటున్న పుట్టిన రోజు కాదు కదా ఇది! కానే కాదు. సినిమాలో దీపిక ఉంటే ఇక ప్రమోషన్‌ ఎందుకు? దీపికను మించి, స్టోరీ ఉంది. దీపిక, ప్రమోషన్‌ రెండూ లేకున్నా.. ఆ స్టోరీ నడిపించేస్తుంది.

పుట్టింటి ప్రెసిడెంట్‌
ఈమె పేరు సరస్వతి. మొన్నటి వరకు పారిశుధ్య కార్మికురాలు. నిన్నటి నుంచీ పంచాయితీ ప్రెసిడెంట్‌! గురువారం జరిగిన కన్సాపురం పంచాయితీ ఎన్నికల్లో సరస్వతి తన ఏడుగురు ప్రత్యర్థులపై పైచేయి సాధించి 302 ఓట్ల తేడాతో విజేతగా నిలిచింది. నిజానికివి 2016లో జరగవలసిన ఎన్నికలు. సరస్వతి కూడా జరుగుతాయన్న నమ్మకంతోనే ఆ ఏడాది తన ప్రభుత్వోద్యోగానికి రాజీనామా చేసి ఆ ఎన్నికల బరిలోకి దిగింది. అప్పుడు ఆమె పని చేస్తున్నది ఇప్పుడు తను గెలిచిన పంచాయితీ ఆఫీసులోనే.. పారిశుద్ధ్య కార్మికురాలిగా! పర్మినెంట్‌ ఉద్యోగం మానేసి, నామినేషన్‌ పత్రాలు కూడా ఇచ్చేశాక ఆ ఎన్నికలు వాయిదా పడ్డాయి.

రాజీనామా చేసింది కనుక మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోలేదు. అక్కడే తాత్కాలిక కార్మికురాలిగా చేరింది. 2016లో వాయిదా పడిన ఆ ఎన్నికలకు నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు నోటిఫికేషన్‌ పడింది. ఈసారి కూడా అవకాశాన్ని వదులుకోలేదు సరస్వతి. రాజకీయాల్లోకి రావడం కోసం పర్మినెంట్‌ ఉద్యోగాన్నే వదిలేసిన సరస్వతి తాత్కాలిక ఉద్యోగానికి రాజీనామా చేయకుండా ఉంటుందా? చేసింది. ఎన్నికల్లో పోటీ చేసింది. గెలిచింది! గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణానికి, మంచినీటి వసతికి ప్రాధాన్యం ఇస్తానని సరస్వతి అంటోంది. శుభ్రపరిచే ఉద్యోగంలోంచి గ్రామాన్ని తీర్చిదిద్దే ప్రజాసేవలోకి వచ్చిన సరస్వతి ఎంతో ఆనందంగా ఉంది. సందేహం లేదు ఆ ఆనందం త్వరలోనే తను పంచాయితీ ప్రెసిడెంట్‌గా ఉన్న కన్సాపురానికి కళను తెస్తుంది.

మరిన్ని వార్తలు