ఛపాక్‌

9 Jan, 2020 00:52 IST|Sakshi

రెండు  విషయాలు

జేఎన్‌యూ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు దీపికా పడుకోన్‌ ఆ యూనివర్శిటీని సందర్శించడం వివాదం అయింది. ఆ ప్రభావం ఆమె నటించిన ‘ఛపాక్‌’ చిత్రంపై పడటం కూడా మొదలైంది. ఈ నెల 10 న ఛపాక్‌ విడుదల అవుతుండగా.. సినిమా చూసేందుకు ముందుగా టిక్కెట్లు రిజర్వే చేయించుకున్నవారు ఆ టిక్కెట్లను తాము క్యాన్సిల్‌ చేయించుకున్నట్లు సోషల్‌ మీడియాలో వరుసపెట్టి పోస్టులు పెడుతున్నారు. ‘బాయ్‌కాట్‌ ఛపాక్‌’ పేరుతో ఒక ట్విట్టర్‌ హ్యాండిల్‌ కూడా వెలసింది. గత ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు కొందరు జేఎన్‌యూ క్యాంపస్‌లోకి వెళ్లి విద్యార్థులపై దాడులకు పాల్పడ్డారు. ఆ ఘటనను అనేక రంగాలలో ప్రముఖులు ఖండిస్తూ బాధితుల వైపు నిలబడుతున్నారు. దీపిక కూడా తన సంఘీభావాన్ని తెలిపేందుకు ఢిల్లీ వెళ్లారు. అయితే అది నచ్చని వారు తమ అసహనాన్ని ఆమె సినిమాపై చూపిస్తున్నారని దీపికను సమర్థిస్తున్న వారు అంటున్నారు.

స్టార్టప్‌

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రాకు ఓ అలవాటు ఉంది. ఎక్కడైనా ఓ మంచి విషయం కనిపిస్తే అభినందించి గానీ అడుగు ముందుకేయరు. చండీగఢ్‌కు చెందిన హర్బజన్‌ కౌర్‌ అనే 94 ఏళ్ల మహిళ ఈ వయసులో కూడా తన కాళ్ల మీద తను నిలబడడం కోసం.. తయారీలో తనకెంతో ప్రావీణ్యం ఉన్న.. ‘బేసన్‌ కి బర్ఫీ’ స్వీట్‌ను ఇంట్లోనే పెద్ద మొత్తంలో చేసి మార్కెట్‌కి సరఫరా చేస్తున్న విషయాన్ని ట్విట్టర్‌లో తెలుసుకున్న మహీంద్రా ముగ్ధులైపోయి.. ‘మై ఆంట్రప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అని ప్రశంసలు కురిపించారు. ‘స్టార్టప్‌ల గురించి మాట్లాడేటప్పుడు మనకు యంగ్‌ జనరేషన్, సిలికాన్‌ వ్యాలీ, బెంగళూరు సాఫ్ట్‌వేర్‌.. ఇవన్నీ స్ఫురిస్తాయి. కౌర్‌ ఈ ఆలోచనను మార్చివేశారు. బిజినెస్‌ ప్రారంభించడానికి వయసుతో సంబంధం లేదని నిరూపించారు’’ అని కూడా ఆయన ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు