మానవ వనిత

13 Nov, 2019 04:06 IST|Sakshi

నంబర్‌ వన్‌

బాలీవుడ్‌లో దీపికా పడుకోన్‌ ఇప్పుడు నంబర్‌ వన్‌ హీరోయిన్‌. భారీ పారితోషికం, సర్దుబాటు చేసుకోలేనన్ని కాల్షీట్లు ఎవర్నైనా నంబర్‌ వన్‌ని చేస్తాయి. మరి దీపిక ప్రత్యేకత ఏమిటి? ఆమె ఎప్పుడూ ధగధగలాడే విషయాలు మాట్లాడరు. పైగా సాదా సీదాగా ఒక సామాన్య మహిళగా కనిపించడానికి ఇష్టపడతారు. సినీ సెలబ్రిటీ కాబట్టి రిచ్‌ గా కనిపించడం, గంభీరంగా వ్యవహరించడం అప్పుడప్పుడూ ఆమెకు తప్పక పోయినా.. వీలైనంత వరకు లైఫ్‌ని ‘మానవ వనిత’గా లీడ్‌ చెయ్యడానికే ఇష్టపడతారు. కష్టాలు చెప్పుకుంటారు.

కన్నీళ్లు పెట్టుకుంటారు. ‘తిన్నావా?’ అని పలకరిస్తారు. ‘భోజనానికి ఉండి వెళ్లండి’ అని.. వెళ్లేవాళ్లను ఆపుతారు. తీరిక చిక్కితే కాలేజ్‌లో కలిసి చదువుకున్న స్నేహితురాళ్ల ఇంటికి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయి అక్కడ హస్క్‌ వేసుకుంటూ కూర్చుంటారు. దీపిక ఉంటున్నది ముంబై అయినా.. బేసిగ్గా.. బెంగళూరు అమ్మాయి. అక్కడి బాల్యం ఆమెను ఇంకా వీడిపోలేదు. ఫ్రెండ్‌ పెళ్లికని మొన్న సండే బెంగళూరు వెళ్లొచ్చి మండే సిక్‌ అయి, సెట్స్‌కి లీవ్‌ పెట్టారు. పెళ్లికి వెళ్లి సిక్‌ అవడం ఏంటి?! అక్కడంతా ఆటలు, పాటలు, వినోదాలు, ఉల్లాసాలు, ఐస్‌ క్రీమ్‌లు, ‘హహహ్హ నాకే ముందు’ టైప్‌ వంటకాలే కదా! అవే దీపికను జ్వరాన పడేశాయి. ఆడినంత ఆడి అలసి, తిన్నవన్నీ తిని సొలసి.. ఫీవర్‌ తెచ్చుకున్నారు.

ఫ్లైట్‌లో సరాసరి ఇంటికి తిరిగొచ్చేసి, సెల్ఫీ తీసుకుని దానికి థర్మామీటర్‌ స్టిక్కర్‌ని ఎటాచ్‌ చేసి ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘పెళ్లి ఫంక్షన్‌లో సరదాలు ఎక్కువైతే ఇలాగే ఉంటుంది’ అని ఫొటో కింద క్యాప్షన్‌ కూడా రాశారు. దీపికను అలా నిస్సత్తువగా చూసి అభిమానులంతా బెంగపెట్టేసుకున్నారు. స్టార్స్‌ని మేకప్‌లో మాత్రమే చూడ్డానికి అభిమానులు, అభిమానులకు మేకప్‌లో మాత్రమే కనిపించడానికి స్టార్స్‌ అలవాటు పడి ఉంటారు. అందుకు భిన్నంగా దీపిక తన నీరసపు వదనాన్ని షేర్‌ చేశారు. ఇమేజ్‌ని పక్కన పెట్టి ఇలా కనిపించడం మామూలు సంగతా?!


 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు