కోపమే లోపమా?

2 Jan, 2014 00:02 IST|Sakshi

‘‘నేను ఉద్యోగం మానేస్తాను’’.
 భార్య అన్న మాటకి ఆశ్చర్యపోయాడు శ్రీకాంత్.
 ‘‘అవునండీ. నేనిక ఆ ఆఫీసుకు వెళ్లను. వేరే ఎక్కడైనా చూసుకుంటాను’’... ఎటో చూస్తూ అంది ప్రవీణ.
 ‘‘మళ్లీ ఏమైంది?’’ అన్నాడు శ్రీకాంత్ ల్యాప్‌టాప్ ఓపెన్ చేస్తూ.
 ‘‘ఏం లేదు. అక్కడివాళ్లెవరూ నాకు నచ్చడం లేదు. నచ్చని వాళ్లమధ్య ఎలా పని చేస్తాను?’’ అంది నింపాదిగా.
 ఏం మాట్లాడలేదు శ్రీకాంత్.  చిర్రెత్తుకొచ్చిందామెకి.
 ‘‘ఏంటి మాట్లాడరు? నాకేదైనా సమస్య వచ్చి చెబితే ఉలకరు పలకరు. మీకు చెప్పడం నాదే బుద్ధి తక్కువ’’... ప్రవీణ అరుపులకి టాప్ లేచిపోయింది.
 ల్యాప్‌టాప్ పక్కనపెట్టి ప్రవీణ వైపు చూశాడు శ్రీకాంత్. ఏడ్చేయడానికి సిద్ధంగా ఉంది ప్రవీణ. అప్పుడన్నాడు... ‘‘మనుషులు నచ్చలేదని నువ్వు ఆఫీసు మారడం ఇది మూడోసారి. ఎవరో నచ్చలేదని ఆఫీసు మారతానంటావు. అసలు ఎవరూ ఎందుకు నచ్చడం లేదో ఆలోచించావా?’’
 
భర్త అన్నమాటకు సెలైంట్ అయిపోయింది ప్రవీణ. నిజమే. తను ఎప్పుడూ ఆలోచించలేదు. తను చాలా కష్టపడి పని చేస్తుంది. మంచి వర్కర్ అనిపించుకుంది. యాజమాన్యం తరచు ప్రశంసిస్తుంటుంది. కానీ చుట్టూ ఉన్నవాళ్లు మాత్రం తనకు ఎప్పుడూ ఏదో ఒక వంక పెడుతూనే ఉంటారు. అంతా బాగున్నా ఏదో లోపం ఉందని కామెంట్ చేస్తుంటారు. తనతో ఎవ్వరూ స్నేహంగా ఉండరు. అలా ఎందుకో అర్థం కాదామెకి. ఆ కారణంతోనే ఇప్పటికి రెండుసార్లు ఉద్యోగం మారింది. కానీ మూడోసారి కూడా అదే సమస్య.
 
ఇలాంటి పరిస్థితి ఆఫీసుల్లో చాలామందికి ఎదురవుతూ ఉంటుంది. మనం ఇంత బాగా పనిచేస్తాం, మనల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అనిపిస్తూ ఉంటుంది. ప్రవీణ కూడా బాగా పనిచేస్తుంది కానీ బాగా మాట్లాడదు. ఎవరైనా ఇది ఇలా ఉంటే బాగుణ్ను అంటే కోపమొచ్చేస్తుంది ఆమెకి. నాకు తెలీదా అన్నట్టు మాట్లాడుతుంది. దాంతో మొదట్లో మామూలుగా చెప్పినవాళ్లు, తరువాత కావాలని వంకలు పెట్టి ఇరిటేట్ చేయడం మొదలుపెట్టారు. అది ఆమె అర్థం చేసుకోలేకపోతోంది. ఆ విషయం శ్రీకాంత్ కి తెలుసు. అందుకే ఆమెలో ఆలోచనను రేకెత్తించాడు.
 
పదిమంది ఉండే చోట ఒక్కొక్కరూ ఒక్కోలా ఉంటారు. అందరికీ మనం, మన పని నచ్చాలని లేదు. కొందరు లోపాలు ఎత్తిచూపుతారు. మనం కరెక్ట్ అయితే వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. లేదంటే యాజమాన్యం అడిగితే నేను చెప్పుకుంటాలెండి అని సింపుల్‌గా చెప్పి తప్పించుకోవచ్చు. అప్పుడు వాళ్లే సెలైంట్ అయిపోతారు. అది మానేసి వాళ్లమీద విరుచుకు పడితే మన విలువ తగ్గుతుంది. వాళ్లకీ మనకీ మధ్య దూరం పెరుగుతుంది. పని చేసే చోటు నరకంలా కనిపిస్తుంది. ఒక్కసారి అందరూ నా వాళ్లే, అందరూ చెప్పేది నా మంచి గురించే అని అనుకుని చూడండి... ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది!
 

మరిన్ని వార్తలు