శానిటైజర్‌తో లాభాలే కాదు నష్టాలు కూడా..

28 May, 2020 11:37 IST|Sakshi

కరోనా వైరస్‌ భయంతో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత పెరిగింది. ఈ నేపథ్యంలోనే క్రిమి సంహారిని శానిటైజర్‌ వాడకం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ముందెన్నడూ లేని విధంగా శానిటైజర్లకు విపరీతమైన ప్రాధాన్యత ఏర్పడింది. వైరస్‌ సోకకుండా ఉండేందుకు కొంతమంది శానిటైజర్‌ వాడకాన్ని ఓ అలవాటుగా చేసుకోగా.. మరికొంత మంది మాత్రం వాటికి బానిసవుతున్నారు. సులువైన పని కావటంతో ఇష్టం వచ్చినట్లు విచ్చల విడిగా వాడేస్తున్నారు. అయితే శానిటైజర్లను మనం వాడుకునే తీరును బట్టి లాభాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయి.

శానిటైజర్‌ అధికంగా వాడితే?...
అతి సర్వత్రా వర్జయేత్‌ అన్నది శానిటైజర్‌ విషయంలోనూ వర్తిస్తుంది. అధిక మోతాదులో శానిటైజర్‌ వాడటం వల్ల మన అరచేతుల్లోని మంచి బ్యాక్టీరియా చనిపోతుంది. ఈ మంచి బ్యాక్టీరియా మన చర్మాన్ని, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో ఎంతో ఉపయోగపడుతుంది. మంచి బ్యాక్టీరియా మన శరీరంలోకి వెళ్లకపోతే మనం రోగాల బారిన పడటం ఖాయం. అంతేకాకుండా తరచుగా శానిటైజర్‌ వాడుతున్నట్లయితే చేతుల్లో ఉండే చెడు బ్యాక్టీరియా శక్తివంతంగా తయారవుతుంది. శానిటైజర్‌కు అలవాటుపడి, నిరోధక శక్తిని పెంచుకుంటుంది. ఇక మనం శానిటైజర్‌తో స్నానం చేసినా లాభం లేకుండా పోతుంది. అయితే మనం శానిటైజర్‌ను ఎక్కువగా వాడుతున్నామా లేదా తెలుసుకోవటం ఎలా అన్నది కొంచెం కష్టం. కానీ, ఈ క్రింది సందర్భాలలో శానిటైజర్‌ వాడకుండా ఉండటం ఉత్తమం.

1) సబ్బు, నీరు అందుబాటులో ఉన్నప్పుడు కచ్చితంగా శానిటైజర్‌ వాడకానికి దూరంగా ఉండండి. ఓ 20 సెకన్ల పాటు సబ్బు నీళ్లతో చేతుల్ని కడుక్కోవటం ద్వారా క్రిముల్ని తరిమికొట్టొచ్చని ‘యూఎస్‌ సెంటర్స్‌ ఫర్‌ డిసీజెస్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌’ చెబుతోంది.  

2) మీ చేతులకు విపరీతంగా దుమ్ము, ధూళీ అంటుకున్నప్పుడు కూడా శానిటైజర్‌ను‌ ఉపయోగించకండి. చేతులు ఎక్కవ అపరిశుభ్రంగా ఉన్నపు​డు ఆల్కహాల్‌ ఆధారిత శానిటైజర్లు ఇంకా అపరిశుభ్రతను సృష్టిస్తాయి. అంతేకాకుండా క్రిముల్ని చంపడంలోనూ విఫలమవుతాయి.

3) చుట్టుప్రక్కల ఉన్న వారు తుమ్మినా, దగ్గినా కొంతమంది వెంటనే శానిటైజర్‌ రాసుకుంటుంటారు. ఇలా చేయటం వల్ల ఏ లాభమూ ఉండదు. గాల్లోని క్రిములను శానిటైజర్‌ చంపలేదని గుర్తించాలి. అదో భయానికి గురై తరచూ దాన్ని వాడటాన్ని తగ్గించుకోవాలి. 
 

పిల్లలకు దూరంగా ఉంచండి
పిల్లలు మీ చుట్టు ప్రక్కల ఉన్నపుడు శానిటైజర్‌కు దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే వారు గనుక శానిటైజర్‌ను శరీరంలోకి తీసుకున్నట్లయితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. అందుకని, పిల్లలు శానిటైజర్లను చేతుల్లోకి తీసుకోకుండా ఉండేలా జాగ్రత్త వహించాలి. 2011నుంచి 2015 మధ్య కాలంలో తమ పిల్లలు హ్యాండ్‌ శానిటైజర్‌ మింగారంటూ ‘యూఎస్‌ పాయిజన్‌ కంట్రోల్‌ సెంటర్‌’లకు 85వేల ఫోన్‌ కాల్స్‌ రావటం గమనార్హం.

మరిన్ని వార్తలు