డెనిమ్.. డైనమిక్

17 Nov, 2016 23:14 IST|Sakshi
డెనిమ్.. డైనమిక్

న్యూలుక్

చలికాలాన వెచ్చగా ఉంటుంది. వేసవిలో కంఫర్ట్ ఉంటుంది. ఏకాలమైనా స్టైలిష్‌గా ఉంటుంది. యూత్ ఇష్టపడే డెనిమ్ గురించే ఇప్పుడు మనం చెప్పుకుంటోంది. డెనిమ్, కార్గో ప్యాంట్లు, షర్ట్‌లు చాలా కాలం మన్నుతాయి. అందుకే వాటి వినియోగం కూడా ఎక్కువ. కొన్నాళ్లయ్యాక బోర్ కొట్టడమో, పిల్లల ప్యాంట్లు అయితే బిగుతు అవడమో జరుగుతుంటాయి. ఇలాంటప్పుడు వాటిని ఏం చేస్తారు? ఇక్కడిచ్చిన విధంగా మార్చేయండి. డెనిమ్‌ను ధరించి డైనమిక్ లుక్‌తో కట్టిపడేయండి.

షర్ట్ టాప్
డెనిమ్ షర్ట్‌ను ఛాతీ పై భాగానికి కట్ చేయాలి. అయితే, మధ్య బటన్స్ ఉన్న లైన్‌ను అలాగే ఉంచేయాలి. అలాగే, చేతుల భాగాన్ని కత్తిరించాలి. కింది భాగాన్ని పూర్తి కాంట్రాస్ట్ క్లాత్‌ని కొలత ప్రకారం తీసుకొని, జత చేయాలి. ఆకట్టుకునే వెరైటీ టాప్ రెడీ! దీన్ని డెనిమ్ ప్యాంట్స్ మీదకు ధరించవచ్చు.

కత్తిరించు.. అతికించు
ప్యాంట్ పై భాగం (కటిభాగం) వరకు కత్తిరించాలి. కింద షిఫాన్ లేదా కాటన్ క్లాత్ తీసుకోవాలి. అది ప్లెయిన్ అయినా, ప్రింట్లు ఉన్నది అయినా నచ్చిన కలర్‌కాంబినేషన్ సరిచూసుకోవాలి. కింది భాగం క్లాత్ కొలత ప్రకారం కత్తిరించి, కుచ్చులు పెట్టి, ప్యాంట్ పై భాగానికి జత చేయాలి. ప్యాంట్ స్కర్ట్ రెడీ.


పిల్లల ప్యాంట్లు.. పొట్టి స్కర్ట్‌లు
పొట్టివైతే పిరుదుల కింది భాగం వరకు ప్యాంట్‌ను కత్తిరించి, రెండు-మూడు రకాల క్లాత్‌లను విడి విడిగా కుచ్చులు పెట్టి జత చేయాలి.  పిల్లలకు నచ్చే స్కర్ట్ సిద్ధం. దీనికి పై భాగాన్ని అతికించి గౌన్‌లా కూడా రూపొందించవచ్చు.

డెనిమ్ లెహెంగా
ప్యాంటు పొడవును సరి చూసుకొని కాంట్రాస్ట్ కలర్ కాటన్ క్లాత్స్‌తో ప్యాచ్ వర్క్ చేసి, మధ్య భాగాన జత చేయాలి. దీంతో ఇలా ఆకట్టుకునే లాంగ్‌లెహంగా రూపు  దిద్దుకుంటుంది.

మరిన్ని వార్తలు