స్త్రీల హక్కులు, భద్రతలో డెన్మార్‌ నం.1

10 Dec, 2019 00:02 IST|Sakshi

నేడు అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం

డిసెంబర్‌ 10 ‘అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం’. ఈ సందర్భంగా గత రెండు వారాలుగా ఐక్యరాజ్య సమితి లింగవివక్ష లేని, సమాన అవకాశాలు కలిగిన ప్రపంచమే లక్ష్యంగా విభిన్న కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా నవంబర్‌ 25ని ‘మహిళలపై హింసావ్యతిరేక దినోత్సవం’గా గుర్తించింది. అప్పటి నుంచి డిసెంబర్‌ 10 వరకు స్త్రీపురుష సమానత్వాన్ని చాటుతూ కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్త్రీల హక్కులూ మానవహక్కులుగా గుర్తించమని చెప్పడమే ఈ కార్యక్రమాల ఉద్దేశ్యం.

స్త్రీల హక్కులు మానవ హక్కులే 
స్త్రీల హక్కులు మానవ హక్కుల్లో ఎందుకు భాగం కాదు? అన్న ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది. నిజానికి  వారి శారీరక, మానసిక, భౌతిక అవసరాల రీత్యా స్త్రీలకు కొన్ని ప్రత్యేక హక్కులుండాలని ఐక్యరాజ్యసమితి గుర్తించి వాటిని సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా మలిచింది. అయితే వాటికిప్పటికింకా సమాజంలో ఆమోదముద్ర పడలేదన్నది కాదనలేని సత్యం. ఇప్పటికీ అది చేరుకోవాల్సిన లక్ష్యం.

స్త్రీల హక్కులు మానవ హక్కుల్లో భాగమేనని గుర్తించిన దేశాలు బహు తక్కువని 2019 లింగ సమానత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 129 దేశాల్లో జరిపిన అధ్యయనంలో సంపూర్ణంగా లింగ సమానత్వాన్ని సాధించిన దేశాలు లేనేలేవన్న విషయం వెల్లడయ్యింది. అయితే స్త్రీపురుష సమానత్వం కోసం కృషి చేస్తోన్న దేశాల్లో కొంతలో కొంత మెరుగైన ఫలితాలను సాధించడం గమనించాల్సిన విషయం.

కొన్ని దేశాల్లో కొంత మెరుగు...
2019లో జరిగిన సర్వే ప్రకారం లింగ సమానత్వం వైపు పురోగమిస్తోన్న టాప్‌ టెన్‌ దేశాల్లో డెన్మార్క్‌ది తొలిస్థానం. ఫిన్‌లాండ్‌  ద్వితీయస్థానంలో; స్వీడన్‌ మూడవ స్థానంలో ఉన్నాయి. నార్వే నాలుగు, నెదర్లాండ్స్‌ ఐదు, స్లోవేనియా ఆరు, జెర్మనీ ఏడు స్థానాల్లో ఉన్నాయి. కెనడా ఎనిమిదవ స్థానంలో ఉండగా, ఐర్లాండ్‌ తొమ్మిదవ స్థానాన్ని, ఆస్ట్రేలియా పదో స్థానాన్ని దక్కించుకున్నాయి.

సమానత్వంలో టాప్‌ డెన్మార్క్‌...
స్త్రీల విషయంలో టాప్‌ వన్‌ స్థానంలో నిలిచిన డెన్మార్క్‌ గురించి ఇప్పుడు మిగిలిన దేశాలు దృష్టి పెట్టాయి. డెన్మార్క్‌లో నాలుగ్గంటలకే సూర్యాస్తమయం అవుతుంది. అంటే  డెన్మార్క్‌లో దీర్ఘరాత్రులుంటాయి. అయితే అక్కడ చీకటి అభద్రతకు చిహ్నం కాదు. ఆ దేశంలో మహిళలు పగలే కాదు రాత్రిళ్ళు కూడా అత్యంత సురక్షితంగా ఉంటారు. స్త్రీ పురుష సమానత్వాన్ని సా«ధించేందుకు ఆ దేశంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాదు సంక్షేమ రాజ్యంగా కూడా డెన్మార్క్‌ని పేర్కొంటారు. ఆరోగ్యం, విద్య, ఉద్యోగావకాశాల్లో స్త్రీపురుష సమానత్వాన్ని విస్తృతంగా ముందుకు తెచ్చింది డెన్మార్క్‌ ప్రభుత్వం.

డెన్మార్క్‌లో ఉపాధిరంగంలో ఉన్న మహిళలు అత్యధికంగా ఉన్నారు. స్త్రీ అయినా పురుషులు అయినా ఒకే విధమైన వేతన విధానాన్ని అనుసరించారు. ఆర్థిక రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ నిర్ణయాత్మక పాత్రలో మహిళలకూ సమ ప్రాధాన్యముంది. 2014 ఎన్నికల అనంతరం 30 శాతం మంది మంత్రులూ, 37 శాతం మంది పార్టీ నాయకులూ స్త్రీలే ఉన్నారు. వివిధ కంపెనీల్లో బోర్డు మెంబర్లుగా ఉన్న స్త్రీల శాతం పెరిగింది. ఇక్కడ స్త్రీలు 61 ఏళ్ళకు రిటైర్‌ అయితే, పురుషులకది 63 ఏళ్ళు.

పునరుత్పత్తి హక్కులు...
వివాహ వయస్సు, పునరుత్పత్తి హక్కుల విషయంలో డెన్మార్క్‌ ముందుంది. 2012లో ఇక్కడ స్త్రీలు తొలి బిడ్డను కనే వయస్సు 29.  52 వారాల పేరెంటల్‌ లీవ్‌ అమలుచేస్తున్నారు. అత్యధిక శాతం తల్లులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. భర్తలకు ఇచ్చే పిల్లల పెంపకానికి సంబంధించిన సెలవుని సైతం  పెంచారు.

పిల్లల సంరక్షణ ప్రభుత్వ బాధ్యత...
మహిళా ఉద్యోగుల పిల్లల పెంపకానికి సంబంధించిన విషయాల్లో సైతం డెన్మార్క్‌ ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. ప్రభుత్వమే పిల్లల సంరక్షణ బాధ్యతను వహిస్తోంది. వాటి పర్యవేక్షణకు సరిపడే అధికారులను, సిబ్బంది నియామకాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. 2013లో 0–2 ఏళ్ళ మధ్య వయస్సు పిల్లల్లో 67.9 శాతం మందిని ప్రభుత్వం నిర్వహించే చైల్డ్‌ కేర్‌ సెంటర్లలో చేర్పించారు. అదే ఏడాది 3–5 ఏళ్ళ మధ్యవయస్సు పిల్లల్లో 97.2 శాతం మందిని  చేర్పించారు. మానవ అక్రమ రవాణానిషేధంపై డెన్మార్క్‌ ప్రత్యేక దృష్టి సారించింది. –అరుణ అత్తలూరి

మరిన్ని వార్తలు