నింగి వంగి నేలతోటీ నేస్తమేదో కోరిందీ 

23 Apr, 2018 01:23 IST|Sakshi

పాత్రల నేపథ్యాన్నీ, స్వభావాన్నీ పాటలోకి తెస్తూనే దాన్ని కవిత్వంగా పలికించడం గీత రచయితలకు సవాల్‌ లాంటిది. ఆరాధన చిత్రంలోని ‘అరె ఏమైందీ/ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ’ పాట కోసం ఆచార్య ఆత్రేయ ఈ పని అనాయాసంగా చేయగలిగారు.
‘నింగి వంగి నేలతోటీ నేస్తమేదో కోరిందీ 
నేల పొంగి నింగి కోసం పూలదోసిలిచ్చింది’ అన్నప్పుడు నాయికానాయకుల అంతరాలు స్పష్టంగా కళ్ల ముందు నిలుస్తాయి. దాన్నే కొనసాగిస్తూ వచ్చే మరో చరణం పూర్తిగా ఉటంకించదగినది.
‘బీడులోన వాన చినుకు పిచ్చిమొలక వేసింది
పాడలేని గొంతులోన పాట ఏదో పలికింది
గుండె ఒక్కటున్న చాలు గొంతు తానె పాడగలదు
మాటలన్ని దాచుకుంటే పాట నీవు వ్రాయగలవు 
రాతరాని వాడి రాత దేవుడేమి వ్రాసాడో చేతనైతె మార్చి చూడూ వీడు మారిపోతాడు మనిషౌతాడు’.
ఇళయరాజా అద్భుతంగా సంగీతం సమకూర్చిన ఈ పాటను ఎస్‌.జానకి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. చిరంజీవి, సుహాసిని అభినయించారు. తమిళ దర్శకుడు భారతీరాజానే ఈ 1987 నాటి రీమేక్‌ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. 

మరిన్ని వార్తలు