పెప్‌ కాలమ్‌

18 May, 2018 00:35 IST|Sakshi

నేర్చుకుందాం!

పెప్‌లమ్‌ ఇప్పుడు ట్రెండ్‌లో ఉంది.. ధోతీ ప్యాంట్‌ అందుకు తోడైంది. రెండూ కలిస్తే దేశీయానికి  విదేశీయం జతపడినట్టు. తూర్పు–పశ్చిమాలు కలిసి కూర్చిన ఈ అందమైన డ్రెస్‌కు మీరే డిజైనర్‌!

డిజైనర్‌ గార్మెంట్స్‌ కొనుగోలులో ఒక సులువు ఉంటుంది. వెంటనే నచ్చిన డ్రెస్‌ను తీసేసుకోవచ్చు. కానీ, కొలతల్లో తేడాలు తప్పవు. మళ్లీ వాటిని సరిదిద్దుకునే సమస్యలూ తప్పవూ. పైగా చాలా వరకు ఖర్చు ఎక్కువ అవుతుంటుంది. డిజైనర్‌ డ్రెస్‌ని మనమే సొంతంగా డిజైన్‌ చేసుకోవచ్చు. అదీ తక్కువ ఖర్చుతో..

ఎలా అంటే.. 
∙ఒక పార్టీ డ్రెస్‌ను ఎంచుకునేటప్పుడు అదీ కాస్త మన సంప్రదాయ టచ్‌ ఉన్నది డిజైన్‌ చేసుకోవాలంటే ఇండోవెస్ట్రన్‌ స్టైల్‌ తీసుకోవాలి. అది కూడా వేడుక, సందర్భమూ బట్టి ఎంపిక అయితే మరీ మంచిది.
∙డ్రెస్‌ల ఎంపికలో ప్రధాన పాత్ర రంగులది. ఇవే వేడుకలో ప్రత్యేకతను నింపుతాయి. 

ధోతీ ప్యాంట్‌ లేదా  పటియాలా సల్వార్‌
ధోతీ లేదా పటియాలా సల్వార్‌ మన దేశీయ సంప్రదాయ డ్రెస్‌. ఇది ఓల్డ్‌ ట్రెండ్‌. అయితే దీనికి కొంచెం వెస్ట్రన్‌ టచ్‌ ఇస్తే.. ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌ డ్రెస్‌. కొన్ని డ్రెస్‌ డిజైనింగ్స్‌కి ఎప్పుడూ ‘పాత’ లుక్‌ రాదు. ఇది సౌకర్యంగా ఉండటమే కాదు రాయల్‌ డ్రెస్‌గా కితాబులు అందుకుంది. ఈ కాలానికి అనువైన డ్రెస్‌ కూడా! నడుము దగ్గర కుచ్చులు పెడితే ధోతీ కట్టు మాదిరి లుక్‌ అద్భుతంగా కనిపిస్తుంది. దీనికి పెప్‌లమ్‌ టాప్‌ని జత చేస్తే ఇండోవెస్ట్రన్‌ లుక్‌ వచ్చేస్తుంది.కావాలనుకుంటే దీనికి దుపట్టా కూడా జత చేసుకోవచ్చు. ∙పెప్‌లమ్‌ టాప్‌ అంచు (బార్డర్‌) తీసేస్తే క్యాజువల్‌ వేర్‌గానూ ధరించవచ్చు. 

రంగులు
పార్టీవేర్‌కి పెప్‌లమ్‌ టాప్‌కి అంచుగా జరీ బార్డన్‌ని జత చేయచ్చు. లేదా ఒకే రంగుతో బ్లౌజ్‌ని, ధోతీ ప్యాంట్‌ను డిజైన్‌ చేసుకోవాలంటే డ్రెస్‌లో ఏదో ఒక తేడాను చూపించాలి. ఉదా: జరీ ఎంబ్రాయిడరీ బార్డర్‌ లేదా కోల్డ్‌ షోల్డర్‌తో ఆ తేడా తీసుకురావచ్చు. షేడెడ్‌ కలర్‌ కాంబినేషన్‌ క్లాత్‌తో ధోతీ లేదా పటియాలను డిజైన్‌ చేసుకుంటే మరింత బాగుంటుంది.
దుపట్టా తప్పనిసరి అనుకుంటే పటియాల రంగులో లేదా టాప్‌ అండ్‌ బాటమ్‌కి పూర్తి కాంట్రాస్ట్‌ది ఎంచుకోవాలి.

ఫ్యాబ్రిక్‌ ఎంపిక
∙చాలా ఖరీదైన ఫ్యాబ్రిక్స్‌ నుంచి ధర తక్కువ గల ఫ్యాబ్రిక్స్‌ వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్‌లో ఏ ఫ్యాబ్రిక్‌ సూట్‌ అవుతుందో అది ఎంచుకోవాలి. పెప్‌లమ్‌ టాప్‌కి రా సిల్క్, కాజు సిల్క్, కాటన్‌ సిల్క్, పేపర్‌ సిల్క్, టఫేరా సిల్క్‌.. వంటి ఫ్యాబ్రిక్స్‌ బాగా నప్పుతాయి. సిల్క్‌ కాకుండా వేరే ఫ్యాబ్రిక్‌ తీసుకోవాలనుకుంటే మొదటి ఎంపిక ‘వెల్వెట్‌’కి వెళ్లడం మంచిది. వెల్వెట్‌ ఫ్యాబ్రిక్‌తో పెప్‌లమ్‌ డిజైన్‌ చేస్తే రాయల్‌ లుక్‌తో టాప్‌ గ్రాండ్‌గా కనిపిస్తుంది.టాప్‌కి కాంట్రాస్ట్‌ కలర్‌లో ఉన్న ఫ్యాబ్రిక్‌ ఏది రిచ్‌గా ఉంటే అది పటియాల లేదా ధోతీకి ఎంచుకోవచ్చు. అయితే చాలా వరకు షేడెడ్‌ కలర్స్, కొంత లేత రంగులు ఎంచుకోవడం మంచిది. ఫాలింగ్‌ ఫ్యాబ్రిక్‌ని ఎంచుకుంటే కుచ్చులు చక్కగా కనిపిస్తాయి. ఉదాహరణకు: క్రేప్, కొన్ని రకాల సిల్క్స్, శాటిన్, చిఫాన్, జార్జెట్, సింథటిక్‌ ఫ్యాబ్రిక్స్‌ బాగా నప్పుతాయి. బార్డర్స్‌లో సీక్వెన్స్, జరీ, బీడ్స్, మిర్రర్స్‌వి ఎంచుకోవచ్చు. మీదైన ముద్ర వేయాలంటే మాత్రం ప్లెయిన్‌ ఫ్యాబ్రిక్‌ మీద హ్యాండ్‌ ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు. 

ఫ్యాబ్రిక్‌ కొలత
పెప్‌లమ్‌ టాప్‌కి  ఫ్యాబ్రిక్‌ 3 మీటర్లు.
బాటమ్‌కి : 4 మీటర్లు
అంచు జత చేయాలంటే : 2 –3 మీటర్లు పడుతుంది.  

ఇతర అలంకరణలు
ప్లెయిన్‌ పెప్‌లమ్‌ టాప్‌కి అదనపు హంగులు చేర్చాలంటే ఎంబ్రాయిడరీనే చేయనక్కర్లేదు. ఖర్చు తగ్గించుకోవాలంటే డిజైనర్‌ బటన్స్‌ని అమర్చినా క్లాసిక్‌ లుక్‌ వస్తుంది.ఈ డ్రెస్‌ వేసుకున్నప్పుడు హై హీల్స్‌ వేసుకుంటే లుక్‌ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.ఒక సన్నని బెల్ట్‌ ఉన్న హ్యాండ్‌ బ్యాగ్‌ భుజానికి వేసుకున్నా, డిజైనర్‌ క్లచ్‌ చేత పట్టుకున్నా బాగుంటుంది. 
– రూపేశ్‌ గుప్తా,  ఇన్‌స్టిట్యూట్‌ డిజైన్‌ ఇన్నోవేషన్, హైదరాబాద్‌

పెప్‌లమ్‌ టాప్‌ మేకింగ్‌
బ్లౌజ్‌ భాగాన్ని కుట్టాక దానికి కుచ్చులను జత చేయాలి. ఇందుకు తగినంత ఫ్యాబ్రిక్‌ తీసుకొని మడత వేసి వృత్తాకారం వచ్చేలా కట్‌ చేసుకోవాలి. ‘పెప్‌’ భాగం పొడవుగా ఉండాలో, తక్కువగా ఉండాలో మీ ఆసక్తి బట్టి డిజైన్‌ చేసుకోవచ్చు. అంచు భాగాన్ని సన్నని అంచుగా మడిచి కుట్టేయాలి. పై భాగాన్ని బ్లౌజ్‌ పార్ట్‌కి జత చేసి, కుట్టాలి. 

బ్యాగ్‌ పాత పడిపోయిందా! లేదంటే రొటీన్‌గా ఉండే బ్యాగ్‌ను కొత్తగా మార్చేయాలా! మీ మొదటి సంపాదనతో కొనుక్కున్న బ్యాగ్‌ను జ్ఞాపకంగా దాచేసుకున్నా, ఎవరైనా కానుకగా ఇచ్చినా, ఖరీదు ఎక్కువైనా, చిన్న చిన్న లోపాలున్నా.. ఇలా కొన్ని బ్యాగ్‌లను బయట పడేయలేం. అలాంటి బ్యాగులను కొత్తగా మార్చుకొని ఎంచక్కా వాడుకోవాలంటే.. ఈ టెక్నిక్‌ రెడీగా ఉంది. 

ఉదా: 1 డిజైన్‌ చేయాలనుకున్న బ్యాగ్, లేసులు, తెల్లని పూసలు లేదా ముత్యాలు, కుందన్స్, చమ్కీ, గ్లూ వంటివి సేకరించండి. లెదర్, జూట్‌ బ్యాగ్‌లకు ఇలాంటివి కుట్టాలంటే సూది దారం కూడా రెడీగా పెట్టుకోండి 2 గ్లూ సాయంతో లేసును బ్యాగ్‌ లేదా క్లచ్‌కి అతికించండి. అదనపు భాగాన్ని కత్తిరించేయండి 3 పూర్తి లేసు చక్కగా అమరేలా జాగ్రత్త తీసుకోండి 4 ఆ లేసు మీదుగా ముత్యాలు లేదా పూసలు, 5చమ్కీలు అతికించండి. బ్యాగ్‌/క్లచ్‌ రెడీ.
నోట్‌: 6,7 బ్యాగుల్లా క్లాత్, జ్యూట్, లెదర్‌ బ్యాగ్‌లైతే సూదితో జాగ్రత్తగా కుట్టేయాలి. లేదంటే గ్లూతో అతికించాలి. మీ బ్యాగ్‌ లేదా క్లచ్‌ అత్యంత సుందరంగా పార్టీవేర్‌కి నప్పేలా మారిపోతుంది.

39 అంగుళాల ధోతీ ప్యాంట్‌కు
1    మూడు మీటర్ల ఫ్యాబ్రిక్‌ తీసుకోవాలి. నాలుగువైపుల సమభాగాలుగా ఉండాలి. అఆఇఈ మార్క్‌ చేయాలి.
2    ఆ నుంచి ఇ వరకు మడవాలి. అప్పుడు అఇఈ అవుతుంది.
3    ఈ నుంచి  అ కోణానికి ఫ్యాబ్రిక్‌ మడత తీసుకోవాలి. మరో కోణానికి ఉ మార్క్‌ చేయాలి. అఉఇ వస్తుంది.
4    అఉఇ లో ఉ వద్ద 10 అంగుళాల పొడవు, 2 అంగుళాల వెడల్పు తీసుకొని కట్‌ చేయాలి. అ నుంచి ఇ వరకు 36 అంగుళాల కొలత తీసుకొని అ భాగంలో కట్‌ చేయాలి. 
5    ముందు భాగాన్ని మడవాలి.
6    వెనుక భాగం ముందు భాగం మీదకు వచ్చేలా కలిపి జత చేయాలి.
7    5 అంగుళాల వెడల్పు 20 అంగుళాల పొడవు ఉన్న బెల్ట్‌ భాగాన్ని జత చేయాలి. 
నోట్‌: శరీర ఆకృతిని బట్టి కొలతలు తీసుకోవాలి. 

>
మరిన్ని వార్తలు