దీపావళిని మధురంగా మార్చే ప్రాంతాలివే!

22 Oct, 2019 12:52 IST|Sakshi
అమృత్‌సర్‌ వద్ద బాణసంచా

సాక్షి, హైదరాబాద్‌: భారతదేశంలో జరుపుకొనే ముఖ్య పండుగలలో ఒకటి దీపావళి. ఈ పండుగ దేశమంతటా జరుపుతున్నప్పటికీ, కొన్ని నగరాలలో అత్యంత వైభవంగా జరుపుతారు. ప్రపంచ నలు మూలల నుంచి ఈ పండగ వెలుగులను చూడటానికి యాత్రికులు వస్తుంటారు. ఈ దీపావళి ఎక్కడ జరుపుకోవాలా ? అని మీరు ఆలోచిస్తున్నట్లయితే... కింది ప్రదేశాలు తప్పక మధురానుభూతులను అందిస్తాయి. 

కోల్‌కతా : దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించడం సర్వసాధారణం. ఇందుకు భిన్నంగా కోల్‌కతాలో కాళికా దేవిని పూజిస్తారు. దేవాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించి, ప్రమిదలను వెలిగించి అమ్మవారిని పూజిస్తారు. బాణసంచా కాలుస్తూ కాళికా దేవి రూపాలను ఊరేగిస్తారు. నగరమంతా దీపాలతో, మిరుమిట్లుగొలుపుతూ కాంతులీనే పలు రకాల బాణసంచా పేలుస్తారు. నగరమంతా వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది.

చెన్నై: ఇతర ప్రాంతాలకు భిన్నంగా చెన్నైలో దీపావళి రోజున కుబేరుని పూజిస్తారు. ఆయనకు తేనె, బెల్లం సమర్పించి దీవించమని ప్రార్థిస్తారు. ఆరోగ్యానికి అధిపతిగా ఉన్న ధన్వంతరిని కూడా ఈరోజున పూజిస్తారు. ఇళ్లను శుభ్రపరచుకోవడం ఈ పండుగలో ఒక భాగం. 

అమృత్‌సర్‌ : దీపావళి నాడు పెద్ద పెద్ద విందు భోజనాలకు అమృత్‌సర్‌ పెట్టింది పేరు. దీపావళిని మొఘల్‌ చెర నుంచి హరగోబింద్‌ సాహిద్‌ విడుదలైన రోజుగా సిక్కులు భావిస్తారు. స్వర్ణ దేవాలయమంతా వేలాది విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. నది పక్కనే వెలుగుతున్న దీపాలు, దేవాలయానికి మరింత శోభను తెస్తాయి. పట్టణమంతా బాణసంచా శబ్ధాలతో హోరెత్తుతుంది. 

వారణాసి : ఇతర ఏ ప్రాంతంలో లేని విధంగా ఈ పట్టణంలో దీపావళి పక్షం రోజుల పాటు కొనసాగుతుంది. ఫోటోగ్రఫీని ఇష్టపడేవారికి ఈ పట్టణం స్వర్గధామంలా అనిపిస్తుంది. వారణాసిలో ఈ పండుగను దేవతల దీపావళిగా అభివర్ణిస్తారు. రవిదాస్‌, రాజ్‌ ఘాట్ల వద్ద స్వామీజీలు ప్రార్థనలు నిర్వహించి దేవతలను ఆహ్వానిస్తారు. గంగా నదిలో స్నానం చేయడానికి దేవతలు దిగివస్తారన్నది వారి నమ్మకం.

గోవా: సంవత్సరాంత పార్టీలకు, అందమైన సముద్ర తీరాలకు గోవా పెట్టింది పేరు. అయినప్పటికీ దీపావళి పండుగ గోవాకు దేశమంతట నుంచి పర్యాటకులను ఆకర్షిస్తుంది. పల్లెటూర్లలో ప్రజలంతా తమ ఇళ్ల వద్ద ప్రమిదలను వెలిగిస్తారు. 

>
మరిన్ని వార్తలు