స్త్రీల రచనలకూ విలువ లేదా?

27 May, 2018 23:59 IST|Sakshi

ఏఎన్‌ డెవర్స్‌ యువ రచయిత్రి. పబ్లిషర్‌ కూడా. ఉండడం యు.ఎస్‌.లో. త్వరలో ఆమె ‘ది సెకండ్‌ షెల్ఫ్‌’ అని ఒక ప్రాజెక్టును ప్రారంభించబోతున్నారు. సైట్‌లోకి వెళ్లి చూస్తే ‘కమింగ్‌ సూన్‌’ అని కనిపిస్తుంది. అరుదైన పుస్తకాల తొలి ప్రతులను, చేతిరాతలను సేకరించి భద్రపరచడం, వాటిని పునర్ముద్రించడం, ఆ రచనలకు పాఠకాదరణ కల్పించడం డెవర్స్‌ ఉద్యమ లక్ష్యం.

అయితే అవన్నీ కూడా మహిళలు రాసినవి, మహిళలపై రాసినవి మాత్రమే అయి ఉంటాయి! ఎందుకని డెవర్స్‌ ఈ విధమైన వివక్షాపూరిత లక్ష్యాన్ని ఎంచుకున్నారు? పుస్తకం పుస్తకమే కదా! రచయిత రాస్తే ఏముంది? రచయిత్రి రాస్తే ఏముంది? ఈ ప్రశ్న అడగడానికి ముందు డెవర్స్‌ను ‘ది సెకండ్‌ షెల్ఫ్‌’ ప్రాజెక్టుకు ప్రేరేపించిన ఒక సందర్భం గురించి తెలుసుకోవాలి.

ఇటీవల డెవర్స్‌ న్యూయార్క్‌ నగరంలో జరుగుతున్న ఒక పుస్తక ప్రదర్శనకు వెళ్లారు.  అక్కడ కొత్తవి, పాతవీ పుస్తకాలున్నాయి. పాతవి అంటే ఫస్ట్‌ ఎడిషన్‌ పుస్తకాలు. వాటిల్లో ఒక సీనియర్‌ రచయిత్రి రాసిన పుస్తకం ధర కేవలం 25 డాలర్లు, అన్ని పేజీలతోనే ఉన్న ఒక సీనియర్‌ రచయిత రాసిన ఫస్ట్‌ ఎడిషన్‌ పుస్తకం ధర వందల డాలర్లు ఉండడం డెవర్స్‌ గమనించారు. రచనలకు విలువ కట్టడంలో కూడా స్త్రీపురుష అసమానత, అనాసక్తత ఉండడం డెవర్స్‌కు ఆవేదన కలిగించి, ఆమెలో ఆలోచన రేకెత్తించింది.

ఈ వివక్షను రూపుమాపడానికి స్త్రీల రచనలకు, స్త్రీలపై వచ్చిన రచనలకు ఒక పబ్లిషర్‌గా కూడా డెవర్స్‌ ప్రాముఖ్యం ఇవ్వాలనుకున్నారు. అలా ఆవిర్భవించబోతున్నదే ‘ది సెకండ్‌ షెల్ఫ్‌’ ప్రాజెక్ట్‌. కొత్తగా వస్తున్న పుస్తకాల్లో కూడా పుస్తకం వెల నిర్ణయించే విషయంలో లైంగిక వివక్ష ఉంటోందని ఈ మధ్య వచ్చిన ఒక సర్వే కూడా డెవర్స్‌ను ఈ ఆలోచనకు పురికొల్పింది. ‘దీన్ని నేనొక బిజినెస్‌గా తీసుకోవడం లేదు. బాధ్యత అనుకుని చేస్తున్నాను’’ అంటున్నారు డెవర్స్‌.

మరిన్ని వార్తలు