శక్తినిచ్చే అమ్మ పూజ

25 Sep, 2017 00:28 IST|Sakshi

ఆత్మీయం

దేవీనవరాత్రులలో శక్తి పూజ ప్రధానం. దేవి అంటే పరమేశ్వరుని శక్తి. ఈ శక్తిని స్త్రీ స్వరూపిణిగా భావించి కొలవడం ఆచారమైంది. ఆమె దయాతత్వాన్ని అంబ అని, అతిలోక సౌందర్యాన్ని త్రిపుర సుందరి అని, ఆమె భయంకర స్వరూపాన్ని కాళి అని ఉపాసిస్తాం. దుర్గాసప్తశతి ‘యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా’ అని కీర్తిస్తుంది. అమ్మవారి అసలు పేరు జ్ఞానప్రసూనాంబిక. ప్రసూనం అంటే పుష్పం. జ్ఞానమనే పుష్పం తనదిగా కల తల్లి అని అర్థం. ప్రసూనానికి ఎలా సుగంధం ఉంటుందో, ఆ సుగంధాన్ని తన చుట్టుపక్కల అందరికీ అవతలి వారి ఇష్టాయిష్టాలకు సంబంధం లేకుండా ఎలా వెదజల్లుతూ ఉంటుందో అలాగే అమ్మవారు కూడా జ్ఞానప్రసూనాంబ కాబట్టి జ్ఞానాన్ని నిరంతరం‡పంచుతూనే ఉంటుంది.

దసరా ఉత్సవాల పదిరోజులపాటూ అమ్మను రోజుకో రూపంలో అలంకరిస్తారు. ప్రతినిత్యం అమ్మకు ఇష్టమైన లలితాసహస్రనామస్తోత్రం, బాలాత్రిపురసుందరీ స్తవం, మహిషాసుర మర్దినీ స్తోత్రం, కనకధారాస్తవం, దుర్గాసప్తశ్లోకీ... ఇలా భక్తులు ఆమె సమక్షంలో ఏదో ఒక శ్లోకాన్నో, అష్టోత్తరాన్నో పారాయణం చేస్తూ కనిపిస్తారు. దాని మూలంగా మానసికంగా ఎంతో స్థైర్యాన్ని, ధైర్యాన్ని, బలాన్ని పొందుతారు. ఆలయంలో ఉన్న అమ్మను స్తుతించకపోయినా ఫరవాలేదు. ఇంటిలో ఉండే అమ్మను ప్రేమగా పలకరించడం, ఆత్మీయంగా కబుర్లు చెప్పడం మాత్రం మరచిపోరాదు.  

మరిన్ని వార్తలు