శిల్పికారాణి

24 Oct, 2016 23:03 IST|Sakshi
జీసెస్ విగ్రహానికి దేవిక తుదిమెరుగులు

కళ


డి.దేవికారాణి ఉడయార్. శిల్పం గురించి కొంచెమైనా తెలిసిన వారికి పరిచయం అక్కరలేని శిల్పకళాకారిణి. అయినా ఇంకొంచెం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే.. దేవిక ఆల్‌రౌండర్. నృత్యం, సంగీతం, సాహిత్యం, జ్యోతిష్యం, వాస్తు, వైద్యం, చిత్ర లేఖనం... వీటన్నింటిలోనూ తనదైన శైలిలో రాణిస్తున్నారు. బడుగుల కుటుంబంలో జన్మించిన తొలి తెలుగు శిల్పి కళారాణి దేవికారాణి. వృత్తి, ప్రవృత్తిగా ఒకటి రెండు రంగాల్లోనే మాత్రమే రాణించే వారిని చూశాం. ఏకంగా ఐదారు రంగాల్లో ఆమెది తనదైన ముద్రే. శుక్రవారం రవీంద్రభారతిలో ‘లత రాజ సాంస్కృతిక శిరోమణి అవార్డు’ అందుకున్న దేవిక సాక్షి ‘ఫ్యామిలీ’తో ముచ్చటించారు. ఆ విశేషాలు.


బాల్యంలోనే: దేవిక ఐదవ తరగతిలో ఉండగా స్కూల్‌కి ఇన్‌స్పెక్టర్ వచ్చారు. వివిధ రకాల పోటీలు నిర్వహించారు. దేవిక శంకరాచార్యులు, రామానుజాచార్యుల చిత్రాలు గీశారు. వాటిని స్కూల్ హెచ్‌ఎం, ఇన్‌స్పెక్టర్ చూశారు. రూ. 5 బహుమతిగా అందిస్తూ జీవితంలో మహాశిల్పివి అవుతావని ఆశీర్వదించారు. దేవిక చెన్నైలో బీఎఫ్‌ఏ చేశారు. తండ్రి దగ్గర శిష్యురాలిగా శిల్ప విద్య నేర్చుకున్నారు. ‘‘నెహ్రూగారు తన కుమార్తె ఇందిరా గాంధీని ఎలా తన వెంట తిప్పారో... మా నాన్న మహా శిల్పి భద్రగిరి శ్రీనాధ రత్న కూడా నన్ను అలాగే ఎక్కడికి వెళ్లినా తీసుకెళ్లేవారు’’ అని చెప్పారు దేవిక.  హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలను రూపొందించడంలో కూడా ఆ తండ్రి తన కూతురి సహకారం తీసుకున్నారు!

 

60 వేల విగ్రహాలు: దేవిక స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా నత్తా రామేశ్వరం. 1973 ఆగస్ట్ 15న జన్మించారు. గత 32 ఏళ్ల   ప్రయాణంలో తండ్రితో కలిసి అన్ని రకాలవి కలిపి 60 వేలు విగ్రహాలు చేశారు. అందులో 30 వేల వరకు అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి. 2003 తండ్రి కాలం చేసి తర్వాత నుంచి ఇప్పటి వరకు సొంతంగా ఒక్కరే ఆరువేల విగ్రహాలు.. మహానుభావులవి, పురాణపురుషులవి, రాజకీయ నాయకులవి తయారు చేశారు. జ్యోతిభాపూలే, అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు, రాణి రుద్రమ దేవి, అన్నమాచార్యులు, తిక్కన, మొల్ల, వివేకానంద, నెహ్రూ, అక్కినేని నాగేశ్వరావు, రఘుపతి వెంకయ్య, ఒబామా, పాప్ రారాజు మైఖేల్ జాక్సన్, సముద్రాల (సీనియర్) విగ్రహాలకూ ప్రాణం పోశారు.


పవిత్రమైనది ఈ కళ: ‘‘శిల్ప కళ ఎంతో ఉత్కృష్టమైంది. ఎంతో నిష్ఠగా చేయాలి. ఫొటోను చూచి వ్యక్తిని చూస్తున్నట్లుగా శిల్పకారుడు లీనం అవ్వాలి. ఏ మాత్రం మన ఆలోచనల్లో తేడా వచ్చినా శిల్పం అసలు రూపం పోతుంది. అన్నం ఎంత పవిత్రంగా వండుతామో.. అంతకన్నా  పవిత్రంగా శిల్ప కళను ప్రారంభించాలి. అప్పుడే అసలు రూపం వస్తుంది’’ అని చెప్పారు దేవిక.  ‘మొదట మట్టితో తయారు చేస్తాం. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో రూపొందించిన నమూనా ఓకే అయిన తర్వాత వాటిని అచ్చులుగా రూపొందిస్తాం’’ అని వివరించారు.  


యునెస్కో గోల్డ్‌మెడలిస్ట్: దేవిక అసంఖ్యాంగా అవార్డులు అందుకున్నారు. మహిళా శిల్పిగా గిన్నీస్ బుక్‌లోకి ఎక్కాలనేది ఆమె ఆశయం. పాఠశాల స్థాయి నుండే ఆయా రంగాల్లో తన ప్రతిభకు సానబెట్టుకున్నారు. యునెస్కో గోల్డ్ మెడలిస్ట్‌గా కూడా ఖ్యాతి గడించారు.  హైదరాబాద్ క్రిస్టల్ గార్డెన్స్‌లో లక్ష్మిదేవిగా నటించి ప్రదర్శించిన ‘ శ్రీలక్ష్మి వైభవం’ భరతనాట్య నృత్య ప్రదర్శన అంతర్జాతీయ కీర్తిని నార్జింపజేసింది.  ‘‘ఒక తెలుగు మహిళా శిల్పిగా గ్లోబల్ స్థాయిలో రాణించాలనేదే నా ఆశయం. ధ్యేయం. కష్టం నా వంతు ఫలితం దేవుని వంతు’’ అంటారు దేవిక.


ట్రస్ట్ ద్వారా సేవలు: దేవిక తాడేపల్లిగూడెంలో స్థిరపడ్డారు. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో ఉడయార్ అకాడమీ అండ్ ఫైనార్ట్స్ వెల్ఫేర్ అసోషియేషన్ స్థాపించి కళామతల్లికి ఇతోధిక సేవలు అందిస్తున్నారు. తనకున్న దానిలోనే పదిమంది పేదలకు సహాయ పడాలనే సంకల్పంతో పని చేస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించడంలో ముందుంటున్నారు. బడుగు, బలహీన వర్గాల్లో ఐక్యత, రాజకీయ చైతన్యం తీసుకురావడంతో పాటు పేదలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఎవరు తనని ఏ విధంగా ఆశ్రయించినా ముందుండి సేవ చేసి, వారి కష్టాలు తీర్చి పంపుతున్నారు. అందుకే  స్థానికులు దేవికను బడుగుల రాణిగా పిలుస్తుంటారు.  - కోన సుధాకర్‌రెడ్డి

 

మరిన్ని వార్తలు