సీతారామ కల్యాణం చూచువారలకు చూడముచ్చట

14 Apr, 2019 03:17 IST|Sakshi

తెలుగువారి అయోధ్యాపురి భద్రగిరి. శ్రీరామచంద్రుని జన్మతిథి అయిన చైత్రశుద్ధ నవమినాడు భద్రాచలంలో శ్రీసీతారామ చంద్రమూర్తులకు తిరుకల్యాణోత్సవం నేత్రపర్వంగా జరుగుతుంది. ఫాల్గుణ పౌర్ణమినాడు కల్యాణవేడుకకు శ్రీకారం చుడతారు. శ్రీరాముడిని, సీతాదేవిని పెళ్లికుమారుని, పెళ్లి కుమార్తె్తను చేస్తారు. ఆ రోజున వసంతోత్సవం జరుపుతారు. ఇరువురు మూర్తులకు పసుపు వచ్చని నూలు వస్త్రాలు ధరింపజేస్తారు. పసుపు, కుంకుమ, చందనం, సుగంధద్రవ్యాలు కలిపిన జలంతో ‘వసంతం’ తయారు చేస్తారు. దీనిని సీతారాములపై చిలకరింపచేస్తారు. ఆ ఏడాది కల్యాణోత్సవాన్ని నిర్వహించే అర్చకులు, సతీ సమేతంగా పసుపుకొమ్ములను రోళ్లలో దంచుతారు. ఈ పసుపుతో సీతమ్మకు మంగళస్నానం చేయిస్తారు. శ్రీరామునికి సున్నిపిండి, సుగంధద్రవ్యాలు, శీకాయపొడి కలిపిన మిశ్రమంతో మంగళస్నానం చేయిస్తారు.

అనంతరం మంగళాక్షతలను కలిపే కార్యక్రమం మొదలుపెడతారు. ఎక్కడా విరగని మేలిరకమైన, పరిశుద్ధమైన బియ్యంతో తలంబ్రాలు తయారుచేస్తారు. వీటిలో బియ్యంతో పాటు పసుపు, కుంకుమ, ఆవునెయ్యి, సుగంధద్రవ్యాల పొడి, గులాల్‌ కలుపుతారు. వీటితోపాటు విద్యుద్దీపాలు, పుష్పమాలాలంకరణలతో వర్ణరంజితంగా, నూతన శోభతో కల్యాణఘట్టానికి ముస్తాబవుతుంది భద్రగిరి.సీతారాముల పెళ్లి అంటే మన ఇంట్లో పెళ్లే అన్నట్లుగా ఉంటుంది ఆ రోజున భద్రాద్రి అంతటా. భద్రాద్రిలోని ఆలయంలో సీతారాముల్ని ఫాల్గుణపౌర్ణమి నుంచి ప్రతిరోజూ నూతనవస్త్రాలు,  సుగంధభరిత పుష్పాలు, పత్రాలతో అలంకరిస్తారు. బుగ్గన చుక్కలతో, నుదుటన కల్యాణ తిలకాలతో లోకోత్తర సౌందర్యంతో మెరిసిపోతుంటారు సీతమ్మ, రామయ్య. అందుకే ఉత్సవమూర్తులను దర్శించుకోవటానికి కల్యాణానికంటే ముందుగానే ఆలయానికి చేరుకుంటారు భక్తులు. సీతమ్మకు ఒడిబియ్యాన్ని, రాముడికి నూతనవస్త్రాలను సమర్పించి కల్యాణ సంరంభం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తారు. 

కల్యాణానికి ముందురోజు రాత్రి జరిగే ఎదుర్కోలు వేడుక ఒక మనోజ్ఞమైన ఘట్టం. భద్రాచల రాజవీధిలో అర్చకులు, భక్తులు ఆడ, మగ పెళ్లివారిగా విడిపోయి సునిశిత, హాస్య, వ్యంగ్య చమత్కారోక్తులతో సీతమ్మ ఘనత ఇదీ, రామయ్య గొప్పతనం ఇదీ అంటూ హాస్యభరితంగా వాదించుకుంటారు. చిరరకు సీతారాములిద్దరూ ఒకరికొకరు సమవుజ్జీలు, ఒకరికొకరు తగినవారు అని  నిర్ణయానికి వచ్చి ఒకరికొకరు తాంబూలాలు ఇచ్చుకుంటారు. వసంతం చల్లుకుంటారు. నవమినాడు జరిగే కల్యాణానికి తరలిరావల్సిందిగా ఇరుపక్షాలు ఒకరికొకరు ఆహ్వానపత్రికలు ఇచ్చిపుచ్చుకుంటారు. కల్యాణం అంటే సీతారాములదే. ప్రతి ఏడాది కల్యాణం జరుగుతున్నా ఏయేటికాయేడు మరింత కొత్తగా, ఉత్సాహంగా జరుగుతుంది కల్యాణోత్సవంలోని ప్రతి ఘట్టం.

ఎన్నిసార్లు వీక్షించినా తనివితీరని దృశ్యం సీతారాముల కల్యాణోత్సవ సంబరం. సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మాతండ్రి అంటూ భక్తివాత్సల్యాలతో సీతారామకల్యాణాన్ని వీక్షిస్తారు భక్తకోటి. ఆ ఉత్సవానికి వ్యాఖ్యానాన్నీ అందిస్తారు.మాతా రామః మత్పితా రామచంద్రఃభ్రాతా రామః మత్సఖా రాఘవేశఃసర్వస్వం మే రామచంద్రః దయాళుఃనాన్యం దైవ నైవజానే న జానేనా తల్లి రాముడు, తండ్రి  రామచంద్రుడు, అన్నదమ్ములు రామడు, స్నేహితుడు రాముడు, రామచంద్రుడే నా సర్వస్వం, వేరే దైవమే నాకు తెలియదు, నేను ఎరుగను అని  ఈ శ్లోకం అర్థం. ఇలా తన కుటుంబంలో రాముడిని, రాముడినే తన కుటుంబంగా భావించిన వ్యక్తులు సంపూర్ణ వ్యక్తిత్వాన్ని,  ఉత్తమ కుటుంబాన్ని  పొందగలుగుతారు.
గోపరాజు పూర్ణిమాస్వాతి

శ్రీరామ కర్ణామృతంలోని ఈ శ్లోకాన్ని శుభలేఖలపై ముద్రించని వారు, దానిని చూడనివారు అరుదు. శ్రీరామ కర్ణామృతంలోని ఈ శ్లోకం సీతారాముల తలంబ్రాల వేడుక గురించి రమ్యంగా వర్ణించారు. సీతమ్మ తెల్లని ముత్యాలు దోసిటిలోకి తీసుకోగా అవి ఎర్రబడ్డాయట. వాటిని  రామయ్యపై పోయగా అవి  రాముడి తలపాగాపై తెల్లగా, శరీరం మీద పడగానే నీలంగా మారాయట. చివరికి కిందపడేటపుడు మళ్లీ తెల్లగా మారాయట. తెలుపును స్వచ్ఛతకు, సత్వగుణానికి ప్రతీకగా ఎరుపు, నలుపు, నీలాలు రజ, తమో గుణాలకు ప్రతీకలుగా భావిస్తే సత్వగుణాన్ని కలిగి ఉన్న మనుషులను ఏ చెడుగుణాలు పాడు చేయలేవని స్వఛ్చంగా ఉన్న సంసార జీవితాన్ని ఏ శక్తులూ నాశనం చేయలేవని అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని తెలుసుకున్న జంటలు నూరేళ్లు ఆనందంగా జీవిస్తారు.


  

మరిన్ని వార్తలు