ప్రదక్షిణలు ఎలా చేయాలి?

27 Aug, 2017 01:09 IST|Sakshi
ప్రదక్షిణలు ఎలా చేయాలి?

భగవంతునిపై భక్తిని చాటుకోవడానికి ప్రదక్షిణలు చేయడం సంప్రదాయం. ప్రదక్షిణలో భక్తి, ఆరోగ్యం రెండూ ఉన్నాయి. ప్రదక్షిణలో ఎంత నిదానంగా నడిస్తే అంత ఫలితం పొందవచ్చు అని స్మృతులు తెలియజేస్తున్నాయి. ఆంజనేయునికి ఐదు ప్రదక్షిణలు చేయడం సంప్రదాయం. శివాలయంలో ఏమైనా ప్రత్యేకమైన కోరికతో చేసే ‘చండీ ప్రదక్షిణ విధి’ తప్ప మిగతా అన్ని ప్రదక్షిణలు ధ్వజస్తంభం నుండి మొదలుపెట్టి ధ్వజస్తంభం వద్దనే ముగించాలి. అప్పుడే ప్రదక్షిణలు పూర్తి అయినట్లు.

నవగ్రహ ప్రదక్షిణలు చేసే వారు ఆలయంలో ప్రవేశించగానే ముందు పూర్తి ప్రదక్షిణం చేసి ప్రధాన దేవత దర్శనానికి వెళ్ళాలి. కేవలం నవగ్రహాలను పూజించేవాళ్ళు ఇంటికెళ్ళి కాళ్ళు కడుక్కోవాలి. గణపతికి ఒక ప్రదక్షిణ, సూర్యునికి రెండు ప్రదక్షిణలు, శివునికి మూడు ప్రదక్షిణలు, విష్ణువుకు నాలుగు ప్రదక్షిణలు, అశ్వత్థవృక్షానికి (రావిచెట్టుకు) ఏడు ప్రదక్షిణలు చేయాలని ఆగమాలు చెబుతున్నాయి. శివాలయంలో నందీశ్వరుణ్ణి, ధ్వజస్తంభాన్ని కలుపుకొని ప్రదక్షిణ చేస్తే విశేషఫలం ఉంటుందని శాస్త్రోక్తి. ప్రద„ì ణ ఎంత నెమ్మదిగా చేస్తే అంత మంచిది. పరుగులు పెడుతూ చేసేది ప్రదక్షిణ అనిపించుకోదు.

భగవంతుని ఊపిరి
భగవంతుని ఉచ్ఛ్వాశ, నిశ్వాసలే వేదం. అనగా వేదం భగవంతుని ఊపిరి. కనుక వేదానికి నిగమం, ఆగమం అని రెండు పేర్లు. వేదాన్ని శృతి అని కూడా అంటారు. అలా చెప్పడానికి గల ఇంకొక కారణం, వేదం గురువుగారి దగ్గర విని నేర్చుకునేది. గురువు ఉచ్చరించినదాన్ని విని అదే విధంగా శిష్యుడు ఉచ్చరిస్తూ నేర్చుకుంటాడు కానీ పుస్తకం చూసి చదువుకుని, నేర్చుకునేది కాదు.

ఎందుకంటే వేదానికి స్వరం ప్రధానం. ఉచ్చరించడంలో దోషం వచ్చినా, స్వరంలో దోషం వచ్చినా, అక్షర దోషం వచ్చినా, అర్థాలు మారిపోతాయి, వ్యతిరేక ఫలితాలు వస్తాయి. వేదోచ్చారణలో జరిగే చిన్న పొరపాటు విపత్తులకు దారి తీస్తుంది. అందువల్ల శిష్యుడు గురువు వద్దకు వెళ్ళి, గురువు ఉచ్చరించినదాన్ని సరిగా తిరిగి అదే విధంగా ఉచ్చరిస్తూ నేర్చుకుంటాడు ఉంటాడు. అందుకే వేదం అనుశ్రవమైంది.

మరిన్ని వార్తలు