చూపునిచ్చిన ప్రేమ

15 Jul, 2018 00:32 IST|Sakshi

యెరికో ప్రాంతంలో ఉన్న ఒక బిక్షకుడు ప్రతిరోజు మాదిరిగానే ఆ రోజు కూడా బిచ్చమెత్తుకోవడానికి తమ ప్రాంతానికి వెళ్లాడు. ఆ సమయంలో ఆ దారిగుండా నజరేయుడైన యేసు వెళుతున్నాడు అని ఆ బిక్షకుడు విని వెంటనే పెద్దగా అరవడం ప్రారంభించాడు. నేను గుడ్డివాడను కదా ఆయన నా అరుపులు వింటాడా అనే ఆలోచన చేయకుండా తన ప్రయత్నాన్ని తను చేస్తున్నాడు.

మనలో చాలామందిమి ఏ మాత్రం ప్రయత్నం చేయకుండానే ఒక నిర్ణయానికి వచ్చి ఇక అది జరగదు కదా అని ఏడుస్తూ కూర్చుంటాం. కానీ ఆ భిక్షకుడు అలా కూర్చోకుండా కళ్లు కనిపించకపోయినా తన గొంతుకతో అరుస్తున్నపుడు అక్కడ ఉన్నవారంతా అతడిని వారించారు. కానీ బిక్షకుడు అరవడం ఆపలేదు ఎప్పుడైతే మనం విశ్వాసంతో ఇది జరుగుతుంది, దేవుడు దీనిని చేయగలడు అని నమ్ముతామో ఖచ్చితంగా దేవుడు ఆ పనిని జరిగిస్తాడు. ఆ బిక్షకుడి∙విషయంలోనూ అదే జరిగింది. అందరూ అరవవద్దని అంటున్నా అతను ఇంకా పెద్దగా కేకలు వేయడం మొదలు పెట్టాడు. అతడి హృదయంలో తన పట్ల ఉన్న విశ్వాసానికి ప్రభువు ఆగాడు.

ఆ బిక్షకుడిని తన వద్దకు పిలవమని చెప్పగానే అప్పటి వరకూ అతను కూర్చోవడానికి ఆధారమైన తన బట్టను పారవేసాడు. అంటే నన్ను యేసు పిలుస్తున్నాడు.. అంటే ఇక నాకు ఆ బట్టతో పనిలేదు.. నాకు కళ్లొస్తున్నాయి.. అని భిక్షకుడు నమ్మాడు గనుకనే ఆ బట్టను పారవేయగలిగాడు ఈ సందర్బంలో మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం ‘‘విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా’’ (హెబ్రీ 11:6).

మనం కూడా దేవుని యెద్దకు వెళుతున్నాం మరి నిజంగానే విశ్వాసంతోనే వెళుతున్నామా? అడుగుతున్నాము కానీ పొందలేకపోతున్నాము అంటే ఆ బిక్షకుడికి ఉన్న విశ్వాసం మనకు లేదన్నమాట, ఆ బిక్షకుడు తన దగ్గరకి రాగానే ప్రభువు అడిగిన మాట ‘నేను నీకేమి చేయగోరుచున్నావు’ అని. అంటే మనం ఆయనను నమ్మితే ఆయన సమాధానం ఇస్తాడు. దగ్గరకు పిలుచుకుంటాడు. ఆయనకు మనకు ఏం కావాలో తెలిసినా మనలనే అడుగుతాడు. మనం అడిగిందే చేస్తాడు.

ఆ బిక్షకుడు దృష్టిని ఇమ్మని అడిగితే ప్రభువు ‘‘నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది’’ అంటున్నాడు. అంటే మన విశ్వాసం వలననే ప్రభువు పని చేస్తాడు. ఆ అంధుడు అరిచినపుడు ఆగడం, అతడిని తన దగ్గరకు పిలుచుకోవడం వెనక ప్రభువు ప్రేమ కనిపిస్తుంది. ఆ బిక్షకుడి పట్ల కరుణ కనిపిస్తుంది. ప్రభువు ప్రేమ చెట్టు వంటిది. చెట్టు ఎలాగైతే ఎందరొచ్చినా వాళ్ల ప్రాంతం, మతం, కులం చూడకుండా నీడనిస్తుందో ప్రభువు ప్రేమ కూడా చెట్టు వంటిదే. ఎలాంటి వారికైనా ఈ మహావృక్షం కింద నీడ దొరుకుతుంది. మనం చేయవలసినదల్లా ఒకటే ఆ చెట్టుకిందకు రావడం.

– రవికాంత్‌ బెల్లంకొండ

మరిన్ని వార్తలు