తనకేమీ తెలియదని తెలుసుకున్నవాడు జ్ఞాని

19 Aug, 2017 23:54 IST|Sakshi
తనకేమీ తెలియదని తెలుసుకున్నవాడు జ్ఞాని

అధ్యాపకుడు అంటే ఏది చదవాలో అది చదివిస్తాడు. ఏ చదువయినా ఈశ్వరుడి దగ్గరకు చేరుకునేటట్లు చేస్తాడు. గురువు వినీతుడు. శిష్యుడు వినేయుడు. గురువుచేసే మొదటి పని వినయాన్ని నేర్పడం. అసలు విద్య అన్న మాటకు ఒక అర్థం–విత్‌ అంటే తెలుసుకొనుట. రెండవ అర్థం–నాకేమీ తెలియదని తెలుసుకొనుట. కానీ మానవ నైజం ఏమిటంటే– సరస్వతీ కటాక్షం లేదంటే (నీ కేమీ తెలియదంటే) ఎవ్వడూ ఒప్పుకోడు.

లక్ష్మీకటాక్షం (పుష్కలంగా సంపద/డబ్బు) ఉందంటే ఒప్పుకోడు. ‘నాకేం తెలుసండీ’ అనగలగాలంటే చాలా తెలిసి ఉండాలి. కొన్ని తెలుసుకున్న తరువాత... ‘ఎన్ని గ్రంథాలున్నాయి, ఎంతమంది రుషులున్నారు, ఎన్నిదర్శనాలు, ఎంతమంది మహానుభావులు. అవన్నీ చదవడానికి నా జీవితం ఏం సరిపోతుంది. దీనికే సరిపోకపోతే ఇక వాటిని ఎప్పుడు అనుభవంలోకి తెచ్చుకోవాలి... అయ్యబాబోయ్, నాకేం తెలియదండీ’ అంటాడు. బాగా తెలిసున్నవాడి లక్షణం నాకేమీ తెలియదని వినయంతో ఉండడం.

సుందరకాండలో సీతమ్మ హనుమని పిలిచి–‘అంతమంది వానరులొచ్చి అటుపక్కన సముద్రపు ఒడ్డున ఉండిపోయారు కదా, నువ్వొకడివే కదా ఇక్కడికి వచ్చావు, రేపు రామ– రావణ యుద్ధం జరిగితే ఎంతమంది వానరులు వస్తారు’ అని సందేహం వ్యక్తం చేస్తే హనుమ అంటాడు ‘‘అమ్మా! నీకు తెలుసుకదా, రాణివాసంలోని మహారాణి దగ్గరకు ఎవర్నయినా పంపాల్సి వచ్చినప్పుడు ప్రభువులు తమ దగ్గరున్న సేవకుల్లో అందరికన్నా పనికిమాలిన వాడెవడో వాడిని పంపిస్తారు. అమ్మా, సుగ్రీవుడు నన్ను పంపించాడంటే–నాతో సమానులు, నాకన్నా అధికులున్నారు కానీ, నాకన్నా  తక్కువ వాళ్ళు అక్కడ లేరమ్మా’’ అన్నాడు. అదీ వినయం. అందుకే హనుమ పాదాలు పట్టుకుంటే బుద్ధి, వినయం లభిస్తాయంటారు.

కంచి కామకోటి పీఠాధిపతి శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని శిష్యులొకసారి ‘మిమ్మల్ని జగద్గురువని సంబోధించాలని ఉంది... అలా పిలవొచ్చా– అని అడిగారు. దానికాయన ‘‘జగద్గురువంటే ఒక సమాసం ప్రకారం ‘జగత్తునంతా గురువుగా కలిగినవాడు’ అనే అర్థంలో నేను ఎప్పుడూ జగద్గురువునే. ఎందుకంటే ఇంతమందిని చూసి నేను ప్రతిరోజూ నేర్చుకుంటున్నాను కనుక’ అన్నారు. అదీ ఆయన వినయం.

శిష్యుడు అంటే శిక్షింపబడేవాడు. వినయం ఉండి ఇంద్రియములు శిక్షింపబడిన వాడు శిష్యుడు. గురువుగారి పేరు వినబడినా, ఆయన కనబడినా ఇంద్రియాలు అదుపులోకి రావాలి. చూడకూడనిది కన్ను చూడదు, స్మరించకూడనివి మనసు స్మరించదు, వినకూడనివి చెవులు వినవు. అలా ఇంద్రియాలను శిక్షించుకుని, నిగ్రహించుకుని, శమదమాదులు నేర్చుకుని గురువు ముందు కూర్చున్నవాడు శిష్యుడు.

అందుకే శంకరాచార్యులవారు షట్పదీ స్తోత్రం చేసూ ్త‘నా అవినయాన్ని తీసేసి వినయాన్ని కటాక్షించు’ అన్నారు. మొదట వినయం నేర్పినవాడు గురువు, ఆయన అధ్యాపకుడు. చదువు నేర్పుతాడు. ఉపాధ్యాయుడు అని మరో పేరు. అనేకమైన క్రియాకలాపాల వల్ల గురువు ఇన్ని పేర్లతో పిలవబడతాడు. లౌకికంగా అర్థం చెప్పాలంటే – కొంత ద్రవ్యాన్ని జీతంగా తీసుకుని పాఠం చెప్పేవాడు ఉపాధ్యాయుడు అని. మరొక అర్థంలో – కుమారుడికి ఉపనయనంచేసే తండ్రి చెపుతున్నట్లుగా ‘‘ఉపేధ్య–తస్మాత్‌ అధీయతా’’ ఉపేధ్య అంటే వెళ్ళు. ఆయన దగ్గరకు వెళ్ళు, తస్మాత్‌  అధీయతా.. ఇప్పుడు ఆ మహానుభావుడి దగ్గరకువెళ్ళి  నేర్చుకో అని తండ్రి ఎవరివంక చేయి చూపించి పంపుతాడో, ఎవరు వేదం నేర్పుతారో ఆయన  ఉపాధ్యాయుడు.

మరిన్ని వార్తలు