తెలియదని తెలుసుకోవడమే జ్ఞానం

17 Sep, 2017 00:18 IST|Sakshi
తెలియదని తెలుసుకోవడమే జ్ఞానం

అధ్యాపకుడు అంటే ఏది చదవాలో అది చదివిస్తాడు. గురువుచేసే మొదటి పని వినయాన్ని నేర్పడం. అసలు విద్య అన్న మాటకు ఒక అర్థం–విత్‌ అంటే తెలుసుకొనుట. రెండవ అర్థం–నాకేమీ తెలియదని తెలుసుకోవడం. కానీ ఎవరైనా, ఎవరినైనా నీకేమీ తెలియదంటే ఒప్పుకోరు. అది మానవ నైజం. కంచికామకోటి పీఠాధిపతి శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని శిష్యులొకసారి ‘మిమ్మల్ని జగద్గురువని సంబోధించాలని ఉంది... అలా పిలవొచ్చా– అని అడిగారు. దానికాయన ‘‘జగద్గురువంటే ఒక సమాసం ప్రకారం ‘జగత్తునంతా గురువుగా కలిగినవాడు’ అనే అర్థంలో నేను ఎప్పుడూ జగద్గురువునే. ఎందుకంటే ఇంతమందిని చూసి నేను ప్రతిరోజూ నేర్చుకుంటున్నాను కనుక’ అన్నారు. అదీ ఆయన వినయం.

శిష్యుడు అంటే శిక్షింపబడేవాడు. వినయం ఉండి ఇంద్రియాలు శిక్షింపబడిన వాడు శిష్యుడు. గురువుగారి పేరు వినబడినా, ఆయన కనబడినా ఇంద్రియాలు అదుపులోకి రావాలి. చూడకూడనిది కన్ను చూడదు, స్మరించకూడనివి మనసు స్మరించదు, వినకూడనివి చెవులు వినవు. అలా ఇంద్రియాలను శిక్షించుకుని, నిగ్రహించుకుని, శమదమాదులు నేర్చుకుని గురువు ముందు కూర్చున్నవాడు శిష్యుడు.

అందుకే శంకరాచార్యులవారు షట్పదీ స్తోత్రం చేసూ ్త‘నా అవినయాన్ని తీసేసి వినయాన్ని కటాక్షించు’ అన్నారు. మొదట వినయం నేర్పినవాడు గురువు, ఆయన అధ్యాపకుడు. చదువు నేర్పుతాడు. ఉపాధ్యాయుడు అని మరో పేరు. అనేకమైన క్రియాకలాపాలవల్ల గురువు ఇన్ని పేర్లతో పిలవబడతాడు. లౌకికంగా అర్థం చెప్పాలంటే – కొంత ద్రవ్యాన్ని జీతంగా తీసుకుని పాఠం చెప్పేవాడు ఉపాధ్యాయుడు అని. మరొక అర్థంలో – ఎవరు వేదం నేర్పుతారో ఆయన  ఉపాధ్యాయుడు.

మరిన్ని వార్తలు