ఏకం అనేకం! అనేకం ఏకమే!!

8 Oct, 2017 00:55 IST|Sakshi

ఆయన ఒక సాధువు.... ఏకాంతం కోసం ఓ పర్వతప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఓ పూరిపాక ఏర్పాటు చేసుకున్నారు. ఆయన దర్శనం కోసం ఓరోజు ఓ సన్యాసిని వచ్చింది. ఆమె తలపై గడ్డితో చేసిన ఓ టోపీ ఉంది. ఆమె మూడుసార్లు ఆ పూరిపాక చుట్టూ ప్రదక్షిణం చేసి అనంతరం ఆయన ముందుకొచ్చి నిల్చుని నమస్కరించింది. ‘‘అయ్యా! ఒక్క మాట చెప్పండి. నా టోపీని తీసి మిమ్మల్ని గౌరవిస్తాను’’ అంది ఆమె. సాధువు ఏం చెప్పాలా అని ఆలోచించారు.

‘ఒక మాట అంటే పెద్దగా ఉండక్కరలేదు. ఏం చెప్పాలి. నన్ను చిక్కుల్లో పడేసిందా ఈమే?’ అనుకున్నారు. ‘‘మీరు చెప్పలేకపోయారు. నేను పోతున్నాను’’ అని ఆమె వెళ్ళిపోయింది...
‘‘ఆమె ఏమడిగింది? ఆమె గడ్డి టోపీ దేనికి సంకేతం?’’ అని సాధువు ఆలోచనలో పడ్డారు. ‘‘ఇక్కడ ఇంతకాలమూ ఏకాంతంలో ఉండి ఏం లాభం? ఓ సాధారణ మహిళకు ఒక మాట చెప్పలేకపోయాను....’’ అని బాధపడ్డారు.ఇక ఇక్కడుండి లాభం లేదు అనుకుని అలా వెళ్తుండగా ఓ గురువు ఎదురుపడ్డారు. ఈయన్ని చూడగానే, ‘‘ఏమిటీ ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నావు... ఏమైంది?’’ అని అడిగారు గురువు.

‘‘ఒక మహిళ దగ్గర నేను ఓడిపోయాను. అవమానభారంతో ఉన్నాను. నేనిక బతికుండి ఏం లాభం?’’ అనుకుంటూ జరిగినందతా చెప్పి బాధపడ్డారు సాధువు. గురువు తన చూపుడు వేలు పైకెత్తి చూపించారు. ‘‘అన్ని నిజాలకు ఇందులో ఉంది సమాధానం... అన్నీ ఇందులో ఒదిగిపోతాయి. ఒకటి వందై, వంద వేలై, వేలు లక్షయి, లక్ష కోటయి... విడిపోయి మళ్ళీ పెరుగుతాయి. కానీ అన్నీ ఒకట్లో ఒకటై పోతాయి...’’ అన్నారు గురువు. సాధువు ఆ వేలి వంక దీక్షగా చూసారు. ఆ వేలిలో ఆ మహిళా కనిపించింది. ఆమె టోపీ తీసి తల వంచి గౌరవించినట్టు అనుభూతి చెందారు సాధువు.

– యామిజాల జగదీశ్‌

మరిన్ని వార్తలు