విశ్వాసిని చక్కదిద్దే ముల్లు!

11 Nov, 2017 23:56 IST|Sakshi

గొంగళి పురుగు సీతాకోకచిలుకగా రూపాంతరం చెందడం దేవుని సృష్టిలో ఒక మహాద్భుతం. అదే ఒక సీతాకోకచిలుక గొంగళిపురుగుగా మారితే..? అది ఆ తర్వాత వినాశకరమైన, వికృతమైన పరిణామం. ఈనాడు మన చుట్టూ జరుగుతున్న పరిణామమిది. మనిషికున్న రోగాలన్నింటికీ మందులున్నాయేమోగానీ, అతనిలోని జీవన ప్రమాణాలు, విలువల దిగజారుడుకు విరుగుడు మందు లేదు.

పైకి ఎంతో హుందాగా, అందంగా కనిపించే సభ్యమానవుని ఆంతర్యంలోని దిగజారుడుతనం అనే గొంగళిపురుగు స్వభావానికి ప్రతిరూపమే ఈనాడు సమాజంలో పెచ్చరిల్లుతున్న హింస, ఊచకోతలు, పగలు, ప్రతీకారాలు, కుట్రలు, అందమైన ఉద్యానవనంగా ఉండేందుకు దేవుడు నిర్దేశించిన మానవ జీవితాలు, అతని చుట్టూ ఉన్న సమాజంలో విలువలూ, ప్రమాణాలూ అంతరించిపోయి క్రమంగా పాడుదిబ్బగా మారుతున్న నేటి పరిస్థితికి కారణం మనిషి తన పూర్వపు గొంగళి పురుగు స్వభావాన్ని సంతరించుకోవడమే!! ఇది మనిషికీ, మొత్తం సమాజానికే ఒక ముల్లుగా మారింది. మరేం చేయాలి?

తన జీవితంలో కూడా ఒక ముల్లు ఉండిందని, మూడుసార్లు ప్రార్థించినా దేవుడు దాన్ని తొలగించలేదు సరికదా, దాన్ని భరించేందుకు చాలినంత పనిస్తానన్నాడని, నా కృప నీకు చాలునని దేవుడు బదులిచ్చాడని పౌలు రాసుకున్నాడు (2 కొరింథి 12:7–9). అదే అపొస్తలుడైన పౌలు గొప్పదనం!! అపొస్తలుల్లో అత్యంత ప్రభావంతో కూడిన పరిచర్య చేసిన పౌలు నిజానికి నేను ప్రార్థన చేస్తే తిరుగు లేదు, నేను ఏదడిగితే అది దేవుడిచ్చాడు అని రాసుకోవచ్చు. ఆ ముల్లు ప్రస్తావన తీసుకు రావలసిన అవసరమే లేదు.

కానీ నిజాన్ని నిర్భయంగా చెప్పుకోగలిగిన తన అందమైన సీతాకోకచిలుక లాంటి జీవితంలో, అబద్ధాలాడే లేదా ఆ నిజాలను కప్పిపుచ్చే తన పూర్వపు గొంగళిపురుగు స్వభావాన్ని అతను మళ్లీ ఆశ్రయించదలచుకోలేదు. విశ్వాస జీవితంలో విజయమంటే అదే!! ప్రార్థనా జీవితమే అన్ని ముళ్లకు, సమస్యలకూ పరిష్కారం. ప్రార్థిస్తే దేవుడు ఆ ముల్లు తొలగించవచ్చు. ఒకవేళ ఆ ముల్లు కొనసాగడమే దేవుని సంకల్పమైతే, దాన్ని భరించే శక్తిని దేవుడు తన కృప ద్వారా అనుగ్రహించవచ్చు.

దేవుడు తన సంపూర్ణ శక్తిని కృప ద్వారా మన జీవితాల్లో ప్రవహింపజేసినప్పుడు అది అన్ని రంగాలనూ తాకి ఆనందమయం చేస్తుంది. మనిషి పతనమయ్యే ప్రమాదం ఉందనుకుంటే ముల్లును నలుగగొట్టడం ద్వారా అతని పతనాన్ని అరికట్టి ఆశీర్వాదపు బాటకు మళ్లించేదే దేవుని కృప!!  సముద్రంలోని నీళ్లను, ఆకాశపు నక్షత్రాలను, లోకంలోని ఇసుక రేణువులను కొలువలేనట్టే దేవుని కృపను కూడా కొలువలేము. దేవుని శక్తి నిరూపణ ఆ కృప ద్వారానే జరిగి అవసరమైతే నలగగొట్టి అయినా సరే, విశ్వాసిని అతని ద్వారా సమాజాన్ని శాంతిమయం, ఆనందదాయకం చేస్తుంది!!

– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌

మరిన్ని వార్తలు