సానుకూల దృక్పథం

30 Apr, 2017 01:05 IST|Sakshi
సానుకూల దృక్పథం

పూర్వం ఒక మహారాజు దగ్గర గుణ వర్ధనుడు, సుగుణ వర్ధనుడు అనే ఇద్దరు మంత్రులు ఉండేవారు. వారిద్దరిలో ఎవరు యోగ్యులో ఎంచుకొని, వారికి మహామంత్రి పదవి ఇవ్వాలనుకున్నాడు రాజు. వారిద్దరిపై ఏవో కారణాలు చూపి ఆగ్రహం నటించాడు. ఇద్దరినీ పదవినుంచి తొలగాఇంచి నగర బహిష్కరణ చేశాడు. ఇద్దరు మంత్రులూ రాజ్యంలో ఒక మారుమూల గ్రామానికి చేరి అక్కడ జీవిస్తున్నారు. కొన్నాళ్లకి వారిద్దరికీ తిరిగి రమ్మని సందేశం పంపుతూ, దానితోపాటు కాకిమాంసం కూర కూడా పంపాడు రాజు.

అది అందుకున్న గుణవర్ధనుడు ‘‘రాజుగారికి నామీద ఇంకా కోపం తీరినట్టు లేదు.అందుకే ఈ కాకి మాంసం పంపాడు!’’అనుకున్నాడు.
కానీ సుగుణ వర్ధనుడేమో ‘రాజుగారికి నా మీద కోపం పోయింది. ఆయన ప్రేమతో ఈ కాకి మాంసాన్ని పంపాడు. ఇంతకంటే విలువైన పక్షిమాంసాలు దొరికితే పంపకుండా ఉంటాడా?’అనుకుని వెంటనే బయలుదేరి  వెళ్లి, రాజుగారిని కలిశాడు.విషయాన్ని సానుకూల దృక్పథంతో ఆలోచించిన సుగుణ వర్థనుణ్ణి మహామంత్రిని చేశాడు రాజు. సానుకూల, ప్రతికూల దృక్పథాల గురించి బౌద్ధం చెప్పిన సందేశాత్మక కథ ఇది.
– డా. బొర్రా గోవర్ధన్‌

మరిన్ని వార్తలు