బాహ్యం సౌందర్యం అంతరం దుర్గంధం

1 Apr, 2018 01:02 IST|Sakshi

ఒకరోజు బుద్ధుడు కోసలరాజు ప్రసేనజిత్తు ఆస్థానంలో కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో ఎందరో భిక్షువులు, పండితులు, రాచకుటుంబీకులు, పౌరులు బుద్ధుని ధర్మ ప్రసంగం వినడానికి వచ్చారు. అప్పుడు ఒక జాలరి బంగారు రంగుతో తళతళ మెరుస్తూ కాంతులీనుతున్న ఒక చేపను తీసుకు వచ్చాడు. ‘‘మహారాజా! ఇది అరుదుగా దొరికే బంగారు తీగ చేప. దీని గురించి వినడమే కాని, ఎప్పుడూ చూడలేదు.

ఇన్నాళ్లకి మాకు చిక్కింది. దీన్ని మీకు కానుకగా సమర్పించడానికి తెచ్చారు’’ అన్నాడు జాలరి. రాజు చేపను చూసి ఆశ్చర్యపోయాడు. సభికులు చూడాలనే తలపుతో ఒక బంగారు పళ్లెంలో పెట్టించి సభముందుంచాడు. సభికులు దాని అందాన్ని, దాని రంగుని, మెరుపుని, ఆకారాన్ని గురించి గొప్పగా చెప్పుకోసాగారు. ఇంతలో చేప పెద్దగా నోరు తెరిచింది. అంతే..! దాని నోట్లోంచి గుప్పున దుర్వాసన వచ్చింది. సభికులందరూ ‘ఛీ ఛీ’ అంటూ ముక్కులు మూసుకున్నారు.

అప్పుడు బుద్ధుడు– ‘‘పాండిత్యం, జ్ఞానం, ప్రతిభాపాటవాలు, నైపుణ్యం మనకి బాహ్య అందాన్ని కలిగిస్తాయి. అవన్నీ ఈ చేపకు ఉన్న శరీరం రంగులాంటివే. ఇక మన మంచి నడవడిక, కుశల ధర్మాన్ని ఆచరించడం, మన శీల సంపద మనలో దుర్గంధాన్ని దూరం చేస్తాయి. పాండిత్యం ఉన్నా శీలగుణం లేని వారి అంతరంగం, హృదయం ఈ చేపలాగే దుర్వాసన కొడుతుంది’’ అంటూ తన ప్రబోధాన్ని ప్రారంభించాడు.
– డా. బొర్రా గోవర్ధన్‌

మరిన్ని వార్తలు