శిక్షించడం కాదు... క్షమించడమే దేవుడి శక్తి

30 Jul, 2017 00:06 IST|Sakshi
శిక్షించడం కాదు... క్షమించడమే దేవుడి శక్తి

యేసుక్రీస్తు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యలు ఒక స్త్రీని తెచ్చి ఆయన ముందు నిలబెట్టి, ‘ఈమె వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. మోషే ధర్మశాస్త్రం అలాంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపమంటోంది. మరి నీవేమంటావు? అని ప్రశ్నించారు. ఆనాటి సమాజంలో పరిసయ్యలు, శాస్త్రుల దౌర్జన్యం అంతా యింతా కాదు. రానున్న కొద్దిరోజుల్లో వాళ్లు తనకు కూడా వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టించి సిలువ శిక్ష వేయించనున్న ఘనులని యేసుకు తెలుసు.

ధర్మశాస్త్రం రాళ్లతో కొట్టి చంపమన్న స్త్రీని క్షమించమని ప్రభువంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన బోధ చేస్తున్నారంటూ ఆయన మీద నేరారోపణ చేయాలని, రాళ్లతో కొట్టి చంపండని తీర్పు చెబితే, మరి అందర్నీ క్షమించాలన్న నీ బోధ మాటేమిటని నిలదీయాలన్నది వారి పన్నాగమని ప్రభువుకర్థమైంది. అందుకే వారికి చిక్కనివిధంగా ప్రభువు జవాబిచ్చాడు. ‘‘రాళ్లతో కొట్టండి కాని ఎన్నడూ పాపం చేయనివాడు మొదటి రాయి వేయాలని ప్రభువు ఆదేశించడంతో అంతా బిత్తరపోయి ఆమెను వదిలేసి వెళ్లిపోయారు. ‘‘నేను కూడా నిన్ను శిక్షించనమ్మా, ఇక ముందు పాపం చేయకుండా జీవించు’’ అని చెప్పి ఆ స్త్రీని ప్రభువు పంపించాడు (యోహాను 8:1–11).
ఈ సంఘటన తర్వాతే ‘నేను లోకానికి వెలుగును’ అన్న అద్భుతమైన ప్రకటనను ప్రభువే చేశాడు (8:12).


ప్రభువు వెలుగు కాబట్టే, ఆయన వెలుగులో ఆ స్త్రీ చేసిన పాపం మాత్రమే కాదు, ఆమె పాపి అంటూ రాళ్లతో కొట్టేందుకు సిద్ధమైన వారందరి పాప జీవితం బట్టబయలయింది. ‘తీర్పు’ చెప్పేవాడు అన్నివిధాలా నిర్దోషిగా, ఆదర్శప్రాయమైనవారిగా ఉండాలన్న కనీస సూత్రాన్ని పాటించని నాటి సమాజం, నేటి సమాజం కూడా యేసుక్రీస్తు వెలుగులో దాని డొల్లతనమంతా బట్టబయలవుతోంది. ఎంతటి కఠినమైన తీర్పైనా చెప్పగల పాపరహితుడైన యేసుక్రీస్తు, శిక్షించడానికి కాకుండా పాపిని రక్షించడానికి, అలా అతన్ని సంస్కరించి లోకానికి ఆశీర్వాదంగా మార్చడానికి సమర్థుడన్నది చరిత్ర చెప్పే సత్యం!!! అలా యేసుక్రీస్తు ‘క్షమాశక్తి’ చేత సంపూర్ణంగా నింపబడిన ఒకనాటి పాపులు, పామరులు, అణగారిన వర్గాలవారే చరిత్రను తిరగరాశారు.

‘దేవుని శక్తి’కి కేంద్రాలయ్యారు. ‘మేమింత గొప్పవాళ్లం కదా, పాపులమెలా అవుతాం?’ అన్న భావనతో ఉన్నవారికి దేవుని శక్తి అర్థం కాదు. మన జీవితాల్లో దేవుని శక్తి నిరూపణ, దేవుని క్షమాపణతోనే ఆరంభమవుతుంది. దేవుని క్షమాపణ పొందకుండా దేవుని ద్వారా గొప్పగా వాడబడటం అసాధ్యం. దేవుడు క్షమించిన విశ్వాసి దేవుని చేత గొప్పగా వాడబడకుండా ఉండటం అసాధ్యం. రాళ్ల కుప్పలకింద శవంగా మారవలసిన నాటి స్త్రీ, ఆ తర్వాత ప్రభువు పరిచారికగా మారి ఎందరికో ఆశీర్వాదంగా మారడం దేవుని శక్తికి నిదర్శనమే కదా!!
– రెవ. టి.ఎ.ప్రభుకిరణ్‌

మరిన్ని వార్తలు