ఇష్టంగా కష్టపడితేనే ఏదయినా సాధ్యం

27 May, 2018 00:59 IST|Sakshi

మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం విద్యార్థుల చేత చేయించిన ప్రతిజ్ఞలో మొదటిది ‘‘నేను ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దాని సాధనకోసం కష్టపడతాను.’’ విద్యార్థులందరూ జీవితంలో లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అది లేకుండా కొనసాగించిన జీవితానికి దిశ–దశ ఉండవు. నేను ఒక చోటికి వెళ్లాలనుకోవడం, నేనిది సాధించాలనుకోవడం.. అలా ఒక ఉత్తమమైన లక్ష్యాన్ని జీవితంలో ఏర్పరుచుకోవాలి. అది ఎంత అవసరమో దాని సాధనకోసం అహరహం ప్రయత్నించడం అంతే అవసరం.గాలివాటుకు ఎగిరిపోయే గడ్డిపరకలుంటాయి. అవి గాలి ఏ దిశలో వీస్తే ఆ దిశలో ఎగిరిపోతుంటాయి. తనకంటూ ఒక దిశ లేదు.

భగవంతుడిచ్చిన అపురూప జీవితం అలా ఉండకూడదు. ఏదో ఒక లక్ష్యం ఉండాలి. ‘నేనిది చేస్తాను’ అని అనాలంటే ధైర్యం కావాలి. ధైర్యమంటే చీకటిగదిలోకి వెళ్ళడానికి ఉండే ధైర్యం కాదు. నేనీ పుస్తకాన్ని చదువుతాను... చదవడం అంటే కేవలం చదువుకుంటూ పోవడం కాదు. అన్నం తిన్న తరువాత నేను, అన్నం ఎలా ఒకటయిపోతామో, నేను నీళ్ళు తాగిన తరువాత నేను నీళ్ళు ఎలా ఒకటయిపోతామో అలా పుస్తకం, నేను ఒకటి కాగలగాలి. ఆ తరువాత ఆ పుస్తకంలో ఏముందన్న దానిమీద సాధికారత ఏర్పడుతుంది. మళ్ళీ పుస్తకం తిరగేయాల్సిన అవసరం రాకూడదు. అదీ లక్ష్య సాధనకు శ్రమించడానికి కావలసిన ధైర్యమంటే.

లంకాపట్టణానికి వెళ్ళడానికి హనుమతో కొన్నివేల వానరాలు బయల్దేరాయి. సముద్రం వంక చూసిన తరువాత అవి అక్కడే చతికిలపడిపోయాయి. కానీ హనుమ ఒక్కడే–నేను ఈ నూరు యోజనాల సముద్రాన్ని దాటతాను’ అని నిర్ణయం చేసుకున్నాడు. నిర్ణయం చేసుకోవడం ఒక ఎత్తు. అలా చేసుకున్నంత మాత్రాన అది సాధ్యంకాదు. అలా అనుకున్న వ్యక్తి జీవితాన్ని తపస్సుగా స్వీకరించాలి. తపస్సంటే – కళ్ళు మూసుకుని చెట్టుకిందో పుట్టలోనో కూర్చోవడం కాదు. ఇంద్రియాలను, మనసును చాలా కఠినంగా నియంత్రించగలగాలి... అలా కష్టపడాలి.

హనుమలాగా కష్టపడడంతోపాటూ దాన్ని సాధించడంలో సంతోషాన్ని పొందాలి. మీ లక్ష్యసాధన సందర్భంగా కష్టపడేటప్పుడు మీకది కష్టమనిపిస్తున్నదంటే మీరది ఎప్పటికీ సాధించలేరు. మీరు దాన్ని ఆస్వాదించగలగాలి. కష్టపడడాన్ని ఆనందించగలగాలి. ఒక పుస్తకం చదువుతున్నారు లేదా ఒక ఉపన్యాసం వింటున్నారు. అది మూడు నాలుగు గంటలు కూడా పట్టవచ్చు. దానికి విసుగు ప్రదర్శించకూడదు. మొదట ఉన్నప్పుడు ఎంత ఆసక్తి ఉందో అంతే ఆసక్తి చివరివరకూ ఉండగలగాలి. అంతేతప్ప యాంత్రికంగా ఏదో చేయాలి కాబట్టి చేసామని చేయకూడదు. సంతోషంగా చేసింది మనసులో బాగా నాటుకుంటుంది. లోపలకు వెడుతుంది. మీరు సంతోషంగా, ప్రయత్నపూర్వకంగా చేయనిదానిని మీ మనసు గ్రహించదు.

మీరు ఇంటిదగ్గర బయల్దేరి విద్యాలయానికి వెడుతున్నారు. దారిలో ఎన్నో విషయాలు చూస్తారు. చూడడం కంటి ధర్మం. కానీ ఏవి చూసారో అవన్నీ మనసులోకి వెడతాయా ...??? ఏదయినా ఒకటి వెళ్ళిందనుకోండి అది మాత్రం మనసులో నిలబడిపోతుంది. అందువల్ల లక్ష్యసాధనలో శ్రమతోపాటూ ఏకాగ్రత ఉండాలి, లక్ష్యం మీదినుండి దృష్టి చెదరకూడదు. లక్ష్యం ఏర్పాటు చేసుకోవడం ఒక ఎత్తయితే, దానికోసం చెమటోడ్చి విజయాన్ని అందుకోవడం రెండో మెట్టు.


- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

మరిన్ని వార్తలు