అతిథిపూజకు ప్రేమే పుష్పం

11 Mar, 2018 00:43 IST|Sakshi

కుచేలుడు పరమ దరిద్రుడు. బ్రహ్మజ్ఞాని. ఒక్క కాసుదొరికితే పదివేల కాసులని మురిసిపోతాడు. ఉంటే తింటాడు. లేకపోతే మానేస్తాడు. ఎప్పుడూ బ్రహ్మానందంలో ఉండేవాడు. ఒకనాడు భార్య ...‘‘ఏమండీ, కష్ణుడు మీకు స్నేహితుడు కదా, ఒక్కసారి ఆయనను దర్శించుకుంటే  మన దరిద్రం తీరిపోతుందికదా !’ అంది. అక్కడికి వెడితే కష్ణుడికి అతిథి అవుతాడు కుచేలుడు. ‘‘నీ సలహా మంచిదే. కానీ స్నేహితుడి దగ్గరకు వెడుతూ ఏమీ పట్టుకెళ్ళకుండా ఎలా..ఏదయినా ఉందా...అయినా నీ పిచ్చికానీ నేను వెడితే మన దరిద్రం పోయేంత ఐశ్వర్యం ఇస్తాడా !!!’’ అని కుచేలుడు అన్నాడు.

కలలోసయితం భగవంతుని పేరెత్తని వాడికి కూడా ఆపదవచ్చినపుడు తలచుకోగానే వచ్చి రక్షించే స్వభావం ఉన్నవాడు కదా ఈశ్వరుడు ! అటువంటివాడు నిత్యం భగవంతుని నమ్ముకుని ఉండే మీ  కోర్కె తీర్చడా.. వెళ్ళండి’’ అని భార్య చెప్పింది.కుచేలం అంటే చిరిగిన బట్ట. ఆయన ఒంటిమీద ఉన్న బట్టకన్నా దానికి కన్నాలు ఎక్కువ. ఇంట్లో ఉన్న అటుకులను ఆ చినుగుల ఉత్తరీయంలోనే మూటగట్టుకుని కుచేలుడు ద్వారకా నగరంలో కష్ణుడి నివాసం వద్దకు చేరుకున్నాడు.

సాక్షాత్‌ లకీ‡్ష్మదేవి అవతారమైన రుక్మిణితో కలిసి కష్ణుడు హంసతూలికా తల్పంమీద ఉన్నాడు. బయట సేవకులు కుచేలుడిని ఆపి ఎవరికోసం వచ్చావు, ఎవరుకావాలని అడుగుతున్నారు. కష్ణుడు తన ప్రియస్నేహితుడని కలిసిపోదామని వచ్చానని చెప్పాడు. ‘ఎలా వీలవుతుంది ! ఇప్పుడు ఆయన రుక్మిణీదేవితో ఆంతరంగిక మందిరంలో ఉన్నారు. ఇప్పుడు కలిసే అవకాశం లేదు’అని వాళ్ళంటున్నారు.

దూరంనుంచి కష్ణుడు కుచేలుడిని చూసి గుర్తుపట్టిఒక్కసారిగా మంచం మీదినుంచి దూకి పరుగుపరుగున వచ్చి ఆప్యాయంగా కౌగిలించుకుని ‘ఎన్నాళ్ళకొచ్చావోయ్, మిత్రమా..’అంటూ తీసుకెళ్ళి తన శయ్యామందిరంలోని హంసతూలికాతల్పంమీద కూర్చోబెట్టాడు. అతిథి సత్కారం ఎలా చేయాలో కష్ణభగవానుడు మనకు నేర్పాడు. అలా కూర్చోబెట్టి‘రుక్మిణీ ! అలా చూస్తావేం. ఇతను బ్రహ్మవేత్త, నా బాల్యమిత్రుడు– కుచేలుడు. బంగారు చెంబుతో నీళ్ళు తీసుకురా’..అని చెప్పి పళ్ళెంపెట్టి అందులో కుచేలుడి పాదాలుంచి రుక్మిణీ దేవి బంగారు కలశంతో నీళ్ళుపోస్తుంటే కడిగి అలా కడిగిన నీటిని పరమ భక్తితో తన తలమీద చల్లుకున్నాడు. 

పళ్ళెం తీసేసి తన ఉత్తరీయంతో పాదాలు తుడిచి, ఒళ్లంతా గంధం రాసి, విసెన కర్రతో విసిరి, మంచి ధూపం వేసి, హారతిచ్చాడు. ‘మిత్రమా! ఎన్నాళ్ళకొచ్చావ్, మనిద్దరి గురుకులవాసం గుర్తుందా..’ అంటూ పాతజ్ఞాపకాలు గుర్తుచేస్తూ మంచి భోజనం పెట్టి కాళ్ళొత్తి పక్కన కూర్చుని నాకోసం ఏదో తెచ్చి ఉంటావంటూ చొరవగా వెతికి ఉత్తరీయానికి వేలాడుతున్న అటుకులను తీసి గుప్పెడు నోట్లో వేసుకుని ‘చాలా బాగున్నాయి’ అంటూ పరమ ప్రీతితో వాటిని పరపర నమిలి తినేసాడు. మరో పిడికెడు తీసుకుని నోట్లో వేసుకోబోతుండగా రుక్మిణీదేవి వారించింది. ఇప్పటికే ఇవ్వాల్సిన ఐశ్వర్యమంతా ఇచ్చేసారు. రెండో గుప్పిటతో మిమ్మల్నీ నన్నూ సమర్పించుకుంటారని వారించింది.

అదీ అతిథి పూజంటే. ఇంటికొచ్చినవాడు ఏమిచ్చాడన్నది కాదు ప్రధానం, ఇంటికొచ్చినవాడిపట్ల నీవెలా ప్రవర్తించావన్నది ముఖ్యం. అన్నీ పెట్టక్కర్లేదు, అన్నీ చేయక్కర్లేదు. ఎంత ప్రేమతో నీవు మాట్లాడిపంపించావన్నదికూడా అతిథిపూజే. అతిథిరూపంలో వచ్చినవాడికి నీకున్న వాటినిపెట్టి ప్రీతితో సేవించగలగాలి. వచ్చినవాడు ఈశ్వరుడు అన్నభావనతో, ఆ ప్రేమతో, ఆదరబుద్ధితో చేయాలి.

-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

మరిన్ని వార్తలు