భక్తులను అనుగ్రహించే భ్రమరాంబా దేవి

14 Oct, 2018 01:41 IST|Sakshi

శ్రీశైలం భూమండలానికి కేంద్రస్థానం. ఇది జ్యోతిర్లింగక్షేత్రమే కాదు, అష్టాదశ శక్తిపీఠాల్లో ఆరవది కూడా. ఇక్కడ సతీదేవి శరీరభాగాల్లో కంఠభాగం పడిందని పురాణాలు చెబుతున్నాయి. మల్లికార్జున స్వామివార్కి పశ్చిమభాగంలో అమ్మవారు కొలువై ఉంది. ఈ విషయాన్ని స్కాందపురాణాంతర్గతమైన శ్రీశైలఖండం కూడా చెప్పింది.

పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు తనకు సకల దేవ, యక్ష, గంధర్వ, పురుష, స్త్రీ, మృగ, జంతు జాలంతో మరణం కలుగరాదని బ్రహ్మతో వరం పొందాడు. వరగర్వంతో సకల లోకాలవారినీ హింసించసాగాడు. దీంతో అందరూ అమ్మవారిని శరణు వేడుకున్నారు. అప్పుడు అమ్మవారు భ్రమరరూపం ధరించి అరుణాసురుణ్ణి సంహరించి లోకాలను కాపాడింది. అరుణాసురసంహారం తరువాత భక్తుల విన్నపంతో శ్రీగిరిపై స్థిరంగా వెలిసింది.

అమ్మవారి మూలమూర్తి స్థితరూపంలో నిలుచుని ఎనిమిది చేతులతో కుడివైపు చేతులలో త్రిశూలం, చురకత్తి, గద, ఖడ్గం వంటి ఆయుధాలు, ఎడమవైపు మహిషముఖాన్ని బంధించి, డాలు, రక్తపాత్ర, అమృతఫలం ధరించి ఎడమకాలిని మహిషం (దున్నపోతు) వీపుపై అదిమిపెట్టి త్రిశూలంతో  కంఠభాగంలో పొడుస్తూ మహిషాసురమర్ధిని వలె కనిపిస్తుంది. అయితే అమ్మవారి ఈ ఉగ్రరూపాన్ని భక్తులు తట్టుకోవడం కష్టం కనుక సౌమ్యరూప అలంకరణతో భక్తులకు దర్శనమిస్తుంది.

ఈ రూపాన్ని విజయదశమి నాడు ఉత్సవమూర్తికి అలంకరించి భక్తులకు దర్శించుకునే వీలు కల్పిస్తారు. ఈ అమ్మవారిని తెలుగు ప్రాంతాలనుండే గాక కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ప్రాంతాల నుండి దర్శించడానికి వస్తారు. కన్నడ ప్రజలు భ్రమరాంబాదేవిని తమ ఇంటి ఆడపడుచుగా, మల్లికార్జున స్వామిని అల్లుడుగా భావించి అమ్మవారికి చీర, సారె, పండ్లు, పూలు సాంగెం పెట్టే సంప్రదాయం నేటికీ ఉంది

– డాక్టర్‌ ఛాయా కామాక్షీదేవి

మరిన్ని వార్తలు