అక్కరకు రాని సంపద

9 Sep, 2018 01:36 IST|Sakshi

పూర్వం ఒకరాజు ఉండేవాడు. అతడు ప్రజలను పీడించి, పిప్పిచేసి చాలా సంపద కూడబెట్టాడు. దాన్ని ఊరికి దూరంగా ఒక రహస్య గుహలో దాచి పెట్టాడు. గుహ తాళం చెవులు ఒకటి తనదగ్గర, మరొకటి తనకు బాగా నమ్మకస్తుడైన ఒక మంత్రి దగ్గర ఉంచాడు. అప్పుడప్పుడూ ఆ గుహ దగ్గరకు వెళ్ళి సంపదను చూసుకొని వస్తుండేవాడు. ఒకరోజు రాజు సంపదను చూసుకోడానికి గుహకు వెళ్ళాడు. తాళం తీసుకొని లోపలికి ప్రవేశించాడు. వెండీ, బంగారం, వజ్రవైఢూర్యాలు రాసులు రాసులుగా గుహ లోపల ఉన్నాయి. రాజు వాటిని తనివితీరా చూసుకుంటున్నాడు.

అంతలో మంత్రి అటుగా వెళుతూ, గుహ తెరిచి ఉండడం గమనించాడు. బహుశా నిన్న తాను గుహను పరిశీలించి వెళుతూ తాళం వేయడం మరిచి పోయానని భావించి, బయటినుండి తాళంవేసి వెళ్ళిపోయాడు. రాజు గుహలో చాలాసేపటివరకు తను సంపాదించిన సంపదనంతా చూసుకొని పరమానందభరితుడై వెనుదిరిగాడు. తీరా ద్వారం వద్దకు వచ్చేసరికి తలుపు వేసి ఉంది. ఎంతబాదినా తలుపులు తెరుచుకోలేదు. ఎంత అరిచి గీపెట్టినా ఫలితం లేకపోయింది. గుహంతా కలియతిరుగుతూ, రాసులుగా పేర్చిన వజ్రవైఢూర్యాలను, మరకత మాణిక్యాలను మరోసారి చూసుకొని మళ్ళీ తలుపు దగ్గరికొచ్చాడు.

సమయం గడుస్తున్నకొద్దీ రాజుకు ఆకలివేయ వేయసాగింది. ఎంత సంపద పోగుపడి ఉన్నా రాజు అన్నం మెతుకుకోసం గింజుకులాడసాగాడు. దాహంతో నాలుక పిడచ కట్టుకుపోతోంది. గుక్కెడునీళ్ళ కోసం రాజు తన్నుకులాడసాగాడు. శరీరంలో సత్తువ సన్నగిల్లింది. కాళ్ళూచేతులు సహకరించడంలేదు. తను సంపాదించిన సంపదవైపు చూస్తూ, ఇంతసంపద కనీసం నాలుక తడుపుకోడానికి సైతం పనికి రావడం లేదని బాధపడసాగాడు. చివరికి శరీరంలోని శక్తినంతా కూడగట్టుకొని, వజ్రవైఢూర్యాలూ, మరకతమాణిక్యాలన్నిటినీ ద్వారం వద్దకుచేర్చి, వరుసగా పేర్చాడు. నిస్సహాయంగా వాటిపై వాలిపోయాడు. ఇంతటి అపారమైన సంపద ఉండికూడా ఎందుకూ కొరగాకుండా పోయింది. గుక్కెడు మంచినీళ్ళు కూడా ఇవ్వలేని ఈ సంపద దేనికీ? అని రెండు రక్తాక్షరాలు లిఖించి ప్రాణం వదిలాడు.

అటు రాజు కనబడడం లేదని రాజ్యమంతా గాలించడం ప్రారంభించారు. మూడురోజులు గడిచి పోయాయి. నాలుగవరోజు మంత్రి గుహవద్దకు వెళ్ళివద్దామని బయలు దేరాడు. తాళంతెరిచి చూసి మంత్రి అవాక్కయ్యాడు. రాజు శవం పక్కన చిన్న కాగితం ముక్కదొరికింది.’ఇంతటి అపారమైన సంపద గుక్కెడు మంచినీళ్ళను కూడా ప్రసాదించలేక పోయింది’ అని రాసి ఉంది అందులో.. అందుకే ఇస్లామీ ధర్మశాస్త్రం, ధనవ్యామోహానికి దూరంగా ఉండాలని, ధనాశ మనిషిని నీచమైన స్థాయికి దిగజారుస్తుందని హితవు చెబుతుంది. అధర్మంగా సంపాదించిన ధనసంపదలు ఏవిధంగానూ ఉపకరించవని, ఇహలోకంలో, పరలోకంలో పరాభవం పాలు చేస్తాయని హెచ్చరిస్తుంది. అల్లాహ్‌ మనందరికీ ధర్మబద్దమైన జీవితం గడిపే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం.

– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

>
మరిన్ని వార్తలు