అమ్మ ప్రేమను మించిన అల్లాహ్‌ ప్రేమ

11 Nov, 2018 02:03 IST|Sakshi

పూర్వకాలంలో ఒక మనిషి ఏదో ఊరుకు వెళుతున్నాడు. సుదూరప్రయాణం. ప్రయాణానికి అవసరమైన సరంజామా అంతా సర్దుకున్నాడు. ఆహారం, నీళ్ళు, దుస్తులు, పైకం అంతా వాహనం పైనే సర్దేశాడు. కొండలు, కోనలు, అడవి మార్గాన ప్రయాణం సాగుతోంది. మార్గమధ్యంలో అనూహ్యంగా ఒంటె తప్పిపోయింది. చుట్టూ దట్టమైన అడవి. అంతా కీకారణ్యం. కనుచూపుమేర ఎక్కడా జనసంచారమే లేదు. ఒంటరిగా, సాధ్యమైనంతమేర అడవి అంతా గాలించాడు. కాని ఒంటె ఆచూకీ దొరకలేదు. ఆహారం, తాగునీరు, దుస్తులు, పైకం అన్నీ దానిపైనే ఉన్నాయి. కనీసం గొంతుతడుపుకుందామన్నా చుక్కనీరులేదు. ఆకలి..దాహం.. అలసట.. భయం.. ఒంట్లో ఏమాత్రం సత్తువ లేదు. నీరసం ఆవహించింది. ఏం చేయాలో అర్ధంకావడం లేదు. వెదికే ఓపిక లేదు. కాళ్ళు తడబడుతుండగా ఆ వ్యక్తి ఓ చెట్టు కింద కూలబడ్డాడు. బాగా అలసిపోయి ఉండ డం వల్ల కళ్ళు మూతలుపడ్డాయి. నిద్రముంచుకొచ్చేసింది. క్షణాల్లో గాఢనిద్రలోకి జారుకున్నాడు.

తరువాత కళ్ళు తెరిచేసరికి ఎదురుగా తప్పిపోయిన తన ఒంటె దర్శనమిచ్చింది. నీరు, ఆహారం, దుస్తులు, పైకం అన్నీ పదిలంగా ఉన్నాయి. ఆశ్చర్యం.. ఆనందం.. తన కళ్ళను తానే నమ్మలేకపోతున్నాడు.. ఇదికలా.. నిజమా..? అన్నసంశయంలో పడిపొయ్యాడు. కొన్ని క్షణాలపాటు అతనికేమీ అర్ధం కాలేదు. చివరికి కలకాదు నిజమే అని నిర్ధారించుకున్నాడు. ముహమ్మద్‌ ప్రవక్త వారు ఈసంఘటనను సహచరులకు వినిపించి ‘ఆవ్యక్తి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది?’ అని ప్రశ్నించారు. ‘దైవప్రవక్తా.! ఆవ్యక్తి ఆనందానికి అవధులే ఉండవు. జీవితంపై ఆశలు వదులుకున్న అతను ఎంతగా సంతోషిస్తాడో మేము మాటల్లో చెప్పలేము. అతని మానసిక ఆనందాన్ని వర్ణించడం ఎవరితరమూ కాదు. అమితమైన సంతోషంతో అతని హృదయం ఉప్పొంగి, ఆనంద తాండవం చేస్తుంది.’ అని విన్నవించారు సహచరులు.

అప్పుడు ప్రవక్తమహనీయులు, ‘‘దారితప్పిన ఒకవ్యక్తి నిజం తెలుసుకొని, సన్మార్గం అవలంబించి తన వైపుకు మరలినప్పుడు దైవం కూడా అలాగే సంతోషిస్తాడు. తన దాసుల్లో ఏ ఒక్కరూ నరకంలోకి పోవడాన్ని అల్లాహ్‌ సుతరామూ ఇష్టపడడు. అందుకే ఆయన మానవుల మార్గదర్శకం కోసం అనేక ఏర్పాట్లు చేశాడు. కనుక మానవులు తమ తప్పు తెలుసుకొని, మంచిమార్గం వైపు మరలితే అల్లాహ్‌ ప్రేమకు, ఆయన కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రులై ఇహ, పరలోకాల్లో సాఫల్యం పొందవచ్చు’’ అని బోధించారు. పరాత్పరుడైన దైవం మనందరికీ రుజుమార్గంపై నడిచే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం.!

– ముహమ్మద్‌ ఉస్మాన్‌ఖాన్‌

మరిన్ని వార్తలు