రాజు ఫకీరు

8 Oct, 2017 05:30 IST|Sakshi

పూర్వం హారూన్‌ రషీద్‌ అని ఒక రాజు ఉండేవాడు. మంచివాడు. కాని కాస్తంత అధికార గర్వం ఉండేది. ఒకరోజు రాజు వేటకు బయలు దేశాడు. వెంట చిన్నపాటి సైనిక పటాలంతో పాటు, ఇబ్రాహీం అనే మంత్రికూడా ఉన్నాడు. పరివారం ఒక దట్టమైన అడవిలోకి ప్రవేశించింది.అలా వెళుతూ వెళుతూ, ‘ఇబ్రాహీం! నాకు లభించని సంపద కాని, సంతోషం కాని ఇంకా ఏమన్నా ఉందంటావా?’ అని ప్రశ్నించాడురాజు.

‘అయ్యా.. సమస్త సంతోషాలు, అనంతమైన సిరిసంపదలు మీసొంతం. మీకు లేనిదంటూ ఏమీలేదు..’ బదులిచ్చాడుమంత్రి. అంతలో అడవిలోంచి ఓ కంఠం వినిపించింది. ‘మీరిద్దరూ బుద్ధిహీనులే. నిజమైన ఆనందం ఏమిటో మీకసలు తెలియనే తెలియదు.’ అని. ఈ శబ్దం విని వారు నిర్ఘాంతపోయి, అటువైపు దృష్టిసారించారు. ఒక బక్కపలచని, బలహీనవ్యక్తి అడవిలోంచి బయటికొచ్చాడు. అతణ్ణిచూసి, ‘ఎవర్నువ్వు?’ అంటూ ప్రశ్నించాడు రాజు. ‘నేను దేవుని దాసుణ్ణి’ ముక్తసరిగా సమాధానమిచ్చాడా వ్యక్తి.

‘నువ్వు నా పాలనలో ఉన్న ఈ దేశవాసివా? లేక ఇతరదేశస్థుడివా?’ ‘నువ్వూ నేనూ అందరూ దేవుని పాలనలోని వాళ్ళమే. మనందరి రాజు, ప్రభువు ఆయనే.’ అంతలో మంత్రి ఇబ్రాహీం కలగజేసుకొని, ‘నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా?’ అన్నాడు కోపంగా. ‘తెలుసు. దైవాన్ని, పరలోకాన్ని మరచి, అంతా ప్రపంచమే అనుకొనే వ్యక్తితో మాట్లాడుతున్నాను’ అన్నాడా వ్యక్తి తనదైన శైలిలో.. ఈమాటలతో మంత్రికోపం తారాస్థాయికి చేరింది. ఇది గమనించిన రాజు కలగజేసుకొని, ‘ఇబ్రాహీం.. కాస్త ఆగు. కోపాన్ని దిగమింగు’’ అని గద్దించాడు.

తరువాత భోజన ఏర్పాట్లు చేయమని పురమాయించాడు. రకరకాల రుచికరమైన వంటకాలు వడ్డించబడ్డాయి. భోజనానంతరం, ‘నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. సరైన సమాధానాలు చెబుతారా?’ అన్నాడు రాజు. ‘దైవచిత్తమైతే బుద్ధినుపయోగించి సరైన సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తాను.’ అన్నాడా వ్యక్తి. ‘ఫిరౌన్‌ ఎక్కువగా దైవానికి అవిధేయత చూపేవాడా? లేక నేనా?’ ’ఫిరౌన్‌ నేనే దేవుణ్నని ప్రకటించుకున్నాడు. అతడు దైవ తిరస్కారి. దేవుని దయవల్ల మీరలా కాదు. మీరు దైవ విశ్వాసి.’ అన్నాడా వ్యక్తి

‘హ.మూసా(అ)మీకన్నా ఉన్నతులా? లేక మీరు ఆయనకంటే ఉన్నతులా?’ ‘హ.మూసా అలైహిస్సలాం దేవుని ప్రవక్త. నేను కేవలం దాసుణ్ణి. నాకూ ఆయనకు పోలికా?’ ‘మరి దేవుడు మూసాను ఫిరౌన్‌ వద్దకు పంపినప్పుడు, ఆయన సౌమ్యంగా హితబోధ చేశారు. మీరు నాపట్ల అలా సౌమ్యంగా ప్రవర్తించలేదు.?’ ’నిజమే. నేను మీ పట్ల కాస్త కటువుగానే ప్రవర్తించాను. అల్లాహ్‌ నన్ను మన్నించుగాక.. నేను మిమ్మల్ని కూడా క్షమించమని కోరుతున్నాను.’ ‘నేను మిమ్మల్ని మన్నించాను. నాప్రశ్నలన్నింటికీ మీరు సరైన సమాధానాలు చెప్పారు.’ అంటూ..’ ఇతనికి పదివేల నాణాలు కానుకగా ఇవ్వండి’ అని ఆదేశించాడు.

రాజాజ్ఞను ఆచరణలో పెట్టారు సేవకులు. ‘ఈ సంచులు నేనేమి చేసుకుంటాను? పేద సాదలకు పంచిపెట్టండి.’అన్నాడా వ్యక్తి. ఒక అధికారి కల్పించుకొని, ‘నీకసలు బుధ్ధుందా? రాజావారి కానుకల్నే వద్దంటున్నావు.’ అన్నాడు ఆగ్రహంగా! ఆ వ్యక్తి అతని వైపు చూస్తూ, ‘ఈ సంపద మీలాంటివారికోసం.. నాకవసరంలేదు.’ అంటూ లేచి నిలుచున్నాడు వెళ్ళిపోడానికి సిద్ధమవుతూ... దీంతో రాజు ఆ అధికారిని తీవ్రంగా మందలిస్తూ... ‘నాదగ్గరికి వచ్చిన వారినెవరినీ నేను రిక్తహస్తాలతో పంపను. వారికి ఏదో ఒకటి ఇచ్చి పంపడం నా అలవాటు’ అన్నాడు అనునయంగా.

‘మీరంతగా అంటున్నారు కాబట్టి, సరే’ అంటూ రెండుచేతులతో రెండుసంచులు పట్టుకొని, రాజువద్ద సెలవు తీసుకొని వెళ్ళిపొయ్యాడు. వెంటనే రాజు మంత్రి ఇబ్రాహీంను పిలిచి, ‘ఈవ్యక్తిసంచులు తీసుకెళతాడా..ఎక్కడైనా పారేసివెళతాడా చూడమని చెప్పి, తను కూడా మేడపైకెక్కాడు. ఆ వ్యక్తి రెండు చేతులూ పైకెత్తి, ‘ప్రపంచం నన్ను మోసం చెయ్యాలని చూసింది. కాని నాప్రభువు నన్ను రక్షించాడు’ అనుకుంటూ వెళ్ళిపోయాడు. హారూన్‌ రషీద్‌ మేడదిగి వచ్చి తన స్థానంలో కూర్చున్నాడు. అంతలో ఇబ్రాహీం కూడా వచ్చాడు.

‘రాజా... అతను రెండుసంచులనూ ద్వారం దగ్గర గుమ్మరించి, ఇదిరాజుగారి సొమ్ము. దీనికి హక్కుదారులు మీరు మాత్రమే. అని మనద్వారపాలకులకే దానం చేసి ఖాళీ చేతులతో వెళ్ళి పోయాడు’ అని చెప్పాడు. ఇది విని హారూన్‌ రషీద్, ‘ఇబ్రాహీం..! ఎవరైతే ప్రాపంచిక వ్యామోహాన్ని దరి చేరనీయరో వారు రాజదర్పాన్ని సుతరామూ అంగీకరించరు. అంటూ, ‘దేవా..! నాపాలనలో ఎల్లప్పుడూ ఇలాంటి సచ్ఛీలురు, సత్పురుషుల్ని ఉండేలా ఆశీర్వదించు’ అని చేతులెత్తి అల్లాహ్‌ను వినమ్రంగా వేడుకున్నాడు.

– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

మరిన్ని వార్తలు