మార్గం చూపిన మహాత్ముడు

26 Nov, 2017 00:25 IST|Sakshi

మానవజాతి సంస్కరణకు, సముధ్ధరణకు ఎంతోమంది మహనీయులు, మహాత్ములు, సంస్కర్తలు ప్రపంచంలో జన్మించారు. అలాంటి మహనీయుల్లో ముహమ్మద్‌ ప్రవక్త ఒకగొప్ప సంస్కర్త, మార్గదర్శి. క్రీ.శ.571 ఏప్రిల్‌ నెల 20 వ తేదీన అరేబియా దేశంలోని మక్కా నగరంలో ఆయన జన్మించారు. ఆమినా, అబ్దుల్లాహ్‌ తల్లిదండ్రులు. జననానికి రెండునెలల ముందే తండ్రినీ, ఆరేళ్ళప్రాయంలో అమ్మనూ కోల్పోయారు. అనాథ అయిన ఆరేళ్ళ బాబును తాతయ్య అక్కున చేర్చుకున్నారు. ఆయన తరువాత ముహమ్మద్‌  ప్రవక్త సంరక్షణా బాధ్యతను బాబాయి స్వీకరించారు.

ఈనాడు మనం అనేక రంగాల్లో అద్భుతాలు సాధించాము అనడంలో ఏమాత్రం సందేహం లేదు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మన ప్రగతి అంబరాన్ని చుంబిస్తోంది. కాని నైతికంగా, ధార్మికంగా, విలువల పరంగా ఏదిశగా పయనిస్తున్నామన్నది ప్రశ్నగానే మిగిలి ఉంది. కనుక, ఇకనైనా మనం మరిచిపోయిన పాఠాన్ని మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. విస్మరించిన మార్గాన్ని అనుసరించాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రవక్త బోధనలు, ఉపదేశాలవైపు మరలవలసిన అవసరం ఉంది. ఎందుకంటే, ఆ మహనీయులు గొప్పదైవప్రవక్త అయి ఉండి కూడా ఒక సామాన్యుడిలా, సామాజిక కార్యకర్తలా సమాజానికి సేవ చేస్తూ, ప్రజల్ని సన్మార్గపథాన నడిపించారు.

ఇహపర వైఫల్యాలనుండి రక్షించారు.సమాజంలోని సమస్త అసమానతలు, అమానవీయతలతో పాటు, అన్నిరకాల దుర్మార్గాలు, దౌర్జన్యాలను రూపుమాపారు. మానవులంతా ఒక్కటేనని, మనిషీ మనిషికి మధ్య ఎలాంటి వ్యత్యాసంగాని, ఆధిక్యత గానీ లేదని చాటి చెప్పారు. అందరూ సమానమే, అంతా ఒక తల్లిదండ్రిబిడ్డలే అన్నది ఆయన సందేశం.ఆధిక్యతకు, గౌరవానికి అసలైన కొలమానం నీతి నిజాయితీ, సత్‌ ప్రవర్తనే అన్నది ఆ మహనీయుని నిర్వచనం.

మానవ సమానత్వానికి, సామరస్యం, సోదరభావాలకు ఇది నిలువెత్తు నిదర్శనం. సాటి మానవుల ధన, ప్రాణాలను హరించడం, వారి గౌరవ మర్యాదలకు భంగం కలిగించడం, వారి మనోభావాలను గాయపరచడం, ఒకరిపై నిందలు వేయడం, చాడీలు చెప్పడం, వారి హక్కులను కాలరాయాలనుకోవడం మహా పాతకాలని, ,క్షంతవ్యం కాని నేరాలన్న ఆ మహాత్ముని హితోపదేశాలు మానవ హక్కుల పరిరక్షణకు అద్భుతమైన కవచాలు. శ్రామికుల స్వేదబిందువుల తడి ఆరకముందే వారి వేతనం చెల్లించివేయాలన్న కారుణ్య బోధ కష్టజీవుల పట్ల ఆ మమతలమూర్తికున్న కరుణకు తిరుగులేని నిదర్శనం.

ముహమ్మద్‌ ప్రవక్త చదవడం, రాయడం రాని నిరక్షరాస్యులు. అయినా ఆయన బోధలు యావత్‌ ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. మానవ సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు, సవాళ్ళకు ఆయన పరిష్కారం చూపారు. ఒక కులానికో, మతానికో, ఒక వర్గానికో, ప్రాంతానికో, ఒక దేశానికో ఆయన బోధనలు పరిమితం కాలేదు. సమస్త మానవులూ ఆయన సంబోధితులే. మానవ జీవితంలోని ఏ రంగమూ ఏదశలోనూ ఆయన మార్గదర్శకానికి వెలుపల లేదు. కుటుంబం, సమాజం, ఉద్యోగం, వ్యాపారం, నైతికం, ఆర్థికం, ఆధ్యాత్మికం, రాజకీయం – ఇలా .. అదీ ఇదీ అని కాకుండా, మానవ జీవితంలోని సమస్త రంగాల్లో ఆయన మార్గదర్శకం చూపారు. మనిషి పుట్టింది మొదలు మరణించే వరకు వివిధ దశల్లో, వివిధ రంగాల్లో ఎలా నడుచుకోవాలో, ఏది హితమో, ఏది హితం కాదో ఆచరణాత్మకంగా విశద పరిచారు.


మహిళలను గౌరవించాలని, వారిపట్ల చులకనభావం కూడదని ముహమ్మద్‌ ప్రవక్త విస్పష్టంగా ప్రకటించారు. తల్లిపాదాల కింద స్వర్గం ఉన్నదని చెప్పి స్త్రీజాతి ఔన్నత్యాన్ని శిఖరస్థాయికి చేర్చారు. పురుషులకు స్త్రీలపై ఎలాంటి హక్కులున్నాయో, ధర్మం ప్రకారం స్త్రీలకు కూడా పురుషులపై అలాంటి హక్కులే ఉన్నాయని స్త్రీ హక్కులను నిర్వచించారు. గుడ్డివారు, చూడగలిగేవారు సమానం కానట్లే, జ్ఞానులు, జ్ఞానవిహీనులు సమానం కాజాలరు అని చెప్పారు. తల్లిదండ్రులు తమ సంతానానికి మంచి విద్యాబుద్ధులు నేర్పించాలని, భావితరాల సంక్షేమానికి ఇది చాలా అవసరమని నొక్కి వక్కాణించారు.

విద్యనేర్చుకోవడానికి అవసరమైతే చైనా దేశమైనా వెళ్ళమని విద్యావిజ్ఞానాల ప్రాముఖ్యతను తెలిపారు. పారేనది ఒడ్డున ఉన్నప్పటికీ నీటిని వృథా చేయరాదని, వృక్షసంపదను నాశనం చేయకూడదని, ప్రకృతి సమతుల్యతకు, మానవాళి మనుగడకు ఇవి అత్యంత అవసరమని ఉద్బోధించారు. ప్రళయం ముంచుకొస్తున్నప్పటికీ, మీ చేతులలో ఒక మొక్క ఉంటే ముందు దాన్ని నాటండని పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను చాటిచెప్పారు. మొక్కలు నాటడం సదఖా అని కూడా ప్రవక్త మహనీయులు ఉపదేశించారు.

అందుకే, ధర్మబోధకులందరిలో అధికంగా సాఫల్యాన్ని పొందిన ప్రవక్త ‘ముహమ్మద్‌’ మాత్రమేనని ఎన్‌ సైక్లోపీడియా ఆఫ్‌ బ్రిటానికా కీర్తించింది. కనుక ఈనాటి పరిస్థితులు, పరిణామాల దృష్ట్యానైనా ముహమ్మద్‌ ప్రవక్త బోధనలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కేవలం ఆధునికత, శాస్త్రవిజ్ఞానమొక్కటే సర్వరోగ నివారిణి కాదు. దాంతోపాటు నైతిక, మానవీయ విలువలను ప్రోదిచేసే దైవప్రవక్తల ఉపదేశాలనూ పరిగణనలోకి తీసుకోవాలి.

శాస్త్రవిజ్ఞానానికి ఆధ్యాత్మిక దృక్పథం జోడించి విలువల పునర్నిర్మాణానికి పూనుకోవాలి. ఈ విషయంలో ముహమ్మద్‌ ప్రవక్త (స) తన 23 ఏళ్ళ దైవదౌత్యకాలంలో సాధించిన అపూర్వ విజయ సాఫల్యాలను, ఆయన నిర్మించిన సుందరమైన సత్‌ సమాజాన్ని గమనంలోకి తీసుకోవాలి. తద్వారా నేటి మన సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను అధిగమించి, నైతిక, మానవీయ విలువలతో నిండిన సంక్షేమ రాజ్యాన్ని పునర్నిర్మించుకోవచ్చు.
(ప్రవక్త జన్మదినం సందర్భంగా...)

– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

మరిన్ని వార్తలు