శ్వేతార్క హనుమాన్‌

26 Aug, 2018 01:38 IST|Sakshi

గణపతి స్వరూపమైన తెల్లజిల్లేడు వేరును యథాతథంగా శ్వేతార్క గణపతిగా పూజించడం తెలిసిందే. అరుదుగా శ్వేతార్క మూలంపై గణపతి ఆకారం సహజసిద్ధంగా ఏర్పడుతూ ఉంటుంది. అది మరింత విశేషమైనదిగా తలుస్తారు. వినాయకుని విశిష్టతలతో కూడిన శ్వేతార్కమూలంపై ఆంజనేయుని రూపు తీర్చిదిద్దించి, దానిని ఆంజనేయ మూల మంత్రంతో ప్రాణప్రతిష్ఠ జరిపి పూజించడం ద్వారా పిల్లలకు బాలారిష్ట దోషాలు తొలగిపోతాయి.

జాతకరీత్యా ఏర్పడే బాలారిష్టాలు పన్నెండేళ్ల వయసు నిండేంత వరకు పిల్లలను పీడిస్తాయి. బాలారిష్టాల కారణంగా పిల్లలు తరచు ఆరోగ్య సమస్యలకు, ప్రమాదాలకు లోనవుతూ ఉంటారు. లేనిపోని భయాలతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి దోషాలను నివారించడానికి శ్వేతార్క హనుమాన్‌ ఆరాధన బాగా ఉపయోగపడుతుంది.

తెల్లజిల్లేడు వేరుపై ఆంజనేయుని రూపును తయారు చేయించి, సిందూరంతో అలంకరించి, పూజ మందిరంలో ఉంచి నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించాలి. శ్వేతార్క హనుమాన్‌ అర్చనలో భాగంగా ఉభయ సంధ్యల్లోనూ హనుమాన్‌ చాలీసాను పదకొండుసార్లు చొప్పున పఠించాలి.

– పన్యాల జగన్నాథ దాసు

మరిన్ని వార్తలు