లెంట్‌లో దేవునితో సాన్నిహిత్యం

18 Feb, 2018 01:33 IST|Sakshi

యేసుక్రీస్తుకు ఇమ్మానుయేలు అనే పేరు కూడా ఉంది. ‘దేవుడు మనకు తోడు’ అని దానర్థం. దేవుడెప్పుడూ భక్తులకు తోడుగానే ఉంటాడు కదా! యేసుకు ప్రత్యేకంగా ఆ పేరు ఎందుకొచ్చింది? ‘తోడు’ అంటే విశ్వాసికి ఎంతో చేరువలో ఉండే దేవుడని అర్థం. విశ్వాసులకు, భక్తులకూ దూరంగా అక్కడెక్కడో ఉండే దేవుడు యేసురూపంలో  మానవాళికి అత్యంత చేరువగా వచ్చి, వారితోనే కొద్దికాలం నివసించి, వారికష్టసుఖాల్లో పాలు పంచుకొని వారిలాగే అన్ని కష్టాలూ అనుభవించిన దైవకుమారుడని ఆయనకు పేరు. దేవుడిలా మనిషికి చేరువ కావడం పక్కన పెడితే, విశ్వాసి దేవునికి దగ్గరయ్యే కొన్ని మార్గాలను బైబిలు సూచించింది.

ఈ నలభై రోజులూ చాలామంది క్రైస్తవులు ఎంతో నిష్ఠగా, పవిత్రంగా ఆచరించే ‘లెంట్‌’ అంటే ఉపవాస దీక్ష అందుకు ఉద్దేశించినదే!! ఈ ఉపవాస దీక్షను ఎంత కఠోరంగా, ఎంత నిష్ఠగా ఆచరించామని కాకుండా, దీక్ష కారణంగా దేవునికి ఎంత దగ్గరమయ్యామన్నది ప్రాముఖ్యం. ఎక్కడో అమెరికాలో ఉంటున్న కొడుకు తమ దగ్గరికి వచ్చేస్తున్నానని చెబితే తల్లిదండ్రులు ఎంత ఉబ్బి తబ్బిబ్బైపోతారో, ‘లెంట్‌’ అసలు ఉద్దేశ్యం నెరవేరే విధంగా ఆ దీక్షను ఆచరిస్తే, విశ్వాసి ఆ విధంగా తనకు చేరువ కావడం చూసి దేవుడు కూడా అంతే ఆనందిస్తాడు.

సొంతింటికి రావడంలో కొడుకు ఉద్దేశ్యం ‘అమ్మానాన్నా నాకు మీరే అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తులు’ అని చెప్పడమే కదా! ‘లెంట్‌’లో చేసే ఉపవాస దీక్ష కూడా దేవునికి అదే మాట చెప్పకనే చెబుతుంది. కొన్ని గంటల కోసం ఆహార పానీయాలు మానడమే, మాంసాహారాన్ని తాత్కాలికంగా త్యజించడమే ఉపవాసమనుకుంటే అంతకన్నా పొరపాటు మరొకటి ఉండదు. ‘లెంట్‌’ కాలంలో దేవుని వాక్యాన్ని చదవడం కాదు, శ్రద్ధతో ధ్యానం చేయాలి.

లోకంలో నిమగ్నమై లోకానందం కోసం అప్పటిదాకా చేసిన పనుల స్థానంలో దేవుని కోసం చేసే పనులు చేపట్టాలి. ఎవరితోనైనా మనస్పర్థలు, పగలు, కోపాలుంటే అవి అలాగే పెట్టుకొని ఉపవాసం చేయడం వ్యర్థమైన పని. గిన్నెను శుభ్రంగా తోమకుండా ఎంగిలి గిన్నెలోనే వంట చేయడంతో సమానమది. క్షమాభావం, పొరుగు వారు, పేదల పట్ల ప్రేమ వ్యక్తం చేసే రోజులుగా లెంట్‌ దినాలుండాలి. ఎంత భోజనాన్ని దేవుని కోసం వదిలేస్తామో అందుకు పదిరెట్ల భోజనం మన కారణంగా నిరుపేదలు తినగలిగితే, దేవునికి మనం నిజంగా చేరువైనట్టే! ఉపవాస దీక్షను ఒక తంతులాగా, ఆచారంగా కాదు, ఎంతో నిష్ఠ, దేవుని పట్ల ప్రేమతో చేస్తే దేవునికి చేరువవుతాం.

– రెవ.డా. టి.ఎ.ప్రభుకిరణ్‌

మరిన్ని వార్తలు